ఆర్డీఎక్స్ లవ్ మూవీ రివ్యూ

ఆర్డీఎక్స్ లవ్ మూవీ రివ్యూ

నటీనటులు : పాయల్ రాజ్ పుత్, తేజూస్ కంచర్ల, ఆదిత్య మీనన్, నరేష్,తులసి, చమ్మక్ చంద్ర,ఆమని, ముమైత్ ఖాన్, విద్యులేక రామన్ తదితరులు.
దర్శకత్వం : శంకర్ భాను
నిర్మాత‌లు : సి.కళ్యాణ్
సంగీతం : రథన్
రేటింగ్ : 2/5

ఆరెక్స్ 100 మూవీతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ చేసిన మరో బోల్డ్ అటెంప్ట్ ఆర్డీఎక్స్ లవ్. విజయవంతమైన ఆరెక్స్ 100మూవీ ని తలపిస్తున్న టైటిల్ తో పాటు, మసాలా ట్రైలర్స్ తో మూవీపై అంచనాలు ఆకాశానికి లేపారు. మరి పాయల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ఏ మేరకు అంచనాలు అందుకుందో సమీక్షలో చూద్దాం.

కథ:
అలివేలు (పాయల్ రాజ్ పుత్) ఓ పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి కొంత మంది అమ్మాయిలతో కలిసి సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. కండోమ్ ల వినియోగంపై అవగాహన పెంచడం.. మద్యం- గుట్కాలు లాంటి దురలవాట్లను మాన్పించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్న అలివేలును చూసి ఇంప్రెస్ అయిన సిద్ధు (తేజస్) ఆమెకు సహకారం అందిస్తూ తన ప్రేమలో కూడా పడతాడు. అలివేలు కూడా అతడికి ఆకర్షితురాలవుతుంది. అయితే తన కొడుకును వలలో వేసుకుందన్న కారణంతో అలివేలు మీద సిద్ధు తండ్రి దాడి చేయిస్తాడు. అప్పుడే అలివేలు ఇదంతా చేయడం వెనుక పెద్ద లక్ష్యం ఉందని వెల్లడవుతుంది. ఇంతకీ ఆ లక్ష్యమేంటి.. అలివేలు దాన్ని సాధించిందా లేదా అన్నది మిగతా కథ.

నటీనటులు:
పాయల్ రాజ్ పుత్ ఈ కథ విన్నపుడు ఏం ఊహించుకుందో ఏమో కానీ.. ఈ సినిమా పూర్తయ్యాక కూడా దీన్ని ఓన్ చేసుకుని ప్రమోట్ చేసినందుకు ఆమెను అభినందించాల్సిందే. ఓవైపు వెంకీ లాంటి హీరో పక్కన నటిస్తూ ఇలాంటి సినిమా చేయడం అంటే చేజేతులా కెరీర్ ను దెబ్బ తీసుకోవడమే. తన అందాల కోసం వచ్చే యువతను ఆమె అలరించింది కానీ.. ఇలాంటి సినిమా చేసి తన స్థాయిని బాగా తగ్గించుకుందన్నది మాత్రం వాస్తవం. ‘హుషారు’ సినిమాతో ఆకట్టుకున్న తేజస్.. ఇందులో ఒక వ్యర్థ పాత్ర చేశాడు. ఆదిత్య మీనన్ విలనీ బాగానే కామెడీ పండించింది. నాగినీడు.. తులసి.. ఆమని.. నరేష్ లాంటి వాళ్లు తమ స్థాయికి తగని పాత్రలు చేశారిందులో. హీరోయిన్ పక్కన కనిపించే అమ్మాయిలు ఇచ్చిన హావభావాలకు దండం పెట్టేయాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
పాయల్ రాజ్ పుత్ గ్లామర్

మైనస్ పాయింట్స్ :
క‌థ‌, క‌థ‌నం
సాగ‌దీతగా స‌న్నివేశాలు
హాస్యం.. భావోద్వేగాలు

సాంకేతిక విభాగం:
చిన్న చిత్రం అయినప్పటికీ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ రాజీ లేకుండా మూవీ తెరకెక్కించారనిపించింది. ఇక కెమెరా వర్క్ ఆకట్టుకుంది. పల్లె వాతావరణం, అక్కడి కల్చర్ చక్కగా బందించి తెరపై ఆవిష్కరించారు. రథన్ అందించిన పాటలు, అలాగే బీజీఎమ్ గుడ్, ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ పూర్తిగా వైఫల్యం చెందింది.

మంచి సబ్జెక్టు ఎంచుకున్న దర్శకుడు శంకర్ భాను దానిని చెప్పే క్రమంలో ప్రక్కదారి పట్టాడు. కథకు అవసరంలేని అనేక సన్నివేశాలతో మూవీ ఫ్లో దెబ్బతీశారు. హీరోయిన్ పాయల్ సేఫ్ సెక్స్ ప్రచారం, గుట్కా బ్యాన్ వంటి సన్నివేశాలు చాలా సిల్లీగా కథకు అవసరమా అనిపిస్తాయి. పాయల్ చేత చెప్పించే అడల్ట్ కామెడీ డైలాగ్స్ కథకోసం కాకుండా బోల్డ్ నెస్ కోసం జొప్పించినట్లు అనిపిస్తుంది.ఏమాత్రం ఆకట్టుకొని స్క్రీన్ ప్లే మూవీ ప్రేక్షకుడిపై ఎక్కడా పట్టుసాధించదు.

తీర్పు:
మొత్తంగా ఆర్డీఎక్స్ లవ్ మూవీ ఏమాత్రం ఆకట్టుకోని సీరియస్ డ్రామా గా చెప్పొచ్చు. ఏమాత్రం ఆకట్టుకొని కథ, కథనాలతో సాగే ఈ చిత్రంలో పాయల్ గ్లామర్ కొంచెం ఉపశమనం అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ చూసి ఫుల్ టైం రొమాంటిక్ మూవీ అని వెళితే పప్పులో కాలేసినట్టే. కథకు అవసరం లేకున్నా జోడించిన బోల్డ్ డైలాగ్స్ మరియు మసాలా సీన్స్ మూవీని కాపాడలేకపోయాయి.

more updates »