ఎన్నికలు అయిపోయినా అదే వాతావరణంలో వున్న ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలు అయిపోయినా అదే వాతావరణంలో వున్న ఆంధ్ర ప్రదేశ్
ఎన్నికలు అయిపోయి దాదాపు వారం కావస్తున్నా ఆంధ్ర ఇప్పటికీ ఆ వాతావరణం నుంచి బయటకు రాలేదు. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనే చెప్పాలి. ఎక్కడైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయనాయకులు రిలాక్స్ అవుతారు. కానీ అందుకు విరుద్ధంగా ఆంధ్రా లో ప్రతిరోజూ వాతావరణాన్ని ఉద్రిక్తంగా తయారుచేయడంలో ముఖ్యమంత్రే ప్రధాన కారణం కావటం విస్మయానికి గురిచేస్తుంది. దీనికి కారణమేంటి? ఇందులో రెండు మూడు విషయాలు ప్రస్ఫూటంగా కనిపిస్తున్నాయి. ఒకటి అందరూ అనుకుంటున్నట్లు ఓటమి భయం పట్టుకోవటం. దానితో రకరకాల ఎలిబీలు సృష్టించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇవియం లు కొన్నిచోట్ల పనిచేయనిమాట వాస్తవం. అయితే మొత్తం ఇవియం లలో వీటి శాతం ఎంత? చంద్రబాబు నాయుడు చెప్పేదానికి ఎన్నికల కమిటీ చెప్పేదానికి పొంతన లేదు. ఎన్నికల కమిటీ కేవలం 45 ఇవియం ల్లో మాత్రమే ఈ సమస్య వచ్చిందని చెబుతుంది. నిజంగా చంద్రబాబునాయుడు చెప్పినట్లు ముఫయి శాతం ఇవియం లలో సమస్య వస్తే షుమారు 80 శాతం ఓట్లు ఎలా వేసారో చెప్పాలి. బాధ్యతాయుత స్థానాల్లో వుండి ఎలాపడితే అలా మాట్లాడకూడదని తెలిసీ మాట్లాడటంలో పరమార్ధమేంటి? చివరకు నా ఓటు ఎవరికీ పడిందోనని సందేహం వెలిబుచ్చటం తాను ఏ స్థాయికి దిగజారిమాట్లాడుతున్నాడో అర్ధమవుతుంది. మరి రేపు ఫలితాలు తనకు అనుకూలంగా వస్తే ఏమని చెబుతాడు? ఎన్నికల తర్వాత తన ప్రవర్తన చూసి ప్రజలందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇక రెండో కారణం, ఐటి గ్రిడ్ కేసులో ఉచ్చు బిగిస్తుండటంతో భయపడి పోయి ముందుగా ప్రతిపక్ష పార్టీల మద్దత్తు కోసం తహ తహ లాడుతున్నాడు. ఐటి గ్రిడ్ కేసులో ఇప్పుడు ఆధార్ అధికారులు కూడా డేటా చోరీ వ్యవహారంలో తీవ్రంగా పరిగణించి కంప్లెయింట్ చేయటం చూస్తుంటే పీకలదాకా చంద్రబాబునాయుడు కూరుకుపోయినట్లు తెలుస్తుంది. త్వరలో ఈ కేసులో సంబంధిత వ్యక్తులు జైలుకెళ్ళటం ఖాయంగా కనిపిస్తుంది. ఆధార్ డేటా చోరీ చిన్న విషయం కాదు. మొదట్లో ఆంధ్ర ప్రదేశ్ డేటా నే అనుకున్నారు. ఇప్పుడు తెలంగాణ డేటా కూడా చోరీకి గురయ్యిందని నిర్ధారణ అయ్యింది. ఈ డేటాని సేవ మిత్ర యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంది. మరి తెలంగాణ డేటా ని ఎందుకు సేకరించారో తెలియాల్సివుంది. దీనిమీద సంబంధిత అధికారుల్ని అరెస్ట్ చేస్తే ఎప్పటిలాగే కక్ష సాధింపుచర్యగా చిత్రీకరించి దేశంలోని ప్రతిపక్షనాయకుల మద్దతుకూడగట్టటం లో భాగమే ఈ దేశవ్యాప్త ప్రచారంగా కనిపిస్తుంది. మూడో కారణం , ప్రతిపక్ష పార్టీల్లో నాయకుడుగా ఎదగాలనే తపన. ఒకవేళ రేపు ఎన్నికల్లో ఓడిపోయినా వచ్చే ప్రభుత్వం తన మీద అవినీతి ఆరోపణలపై విచారణ చేపడితే అది కక్ష సాధింపుచర్యగా ప్రతిపక్ష పార్టీల్లో చిత్రీకరించి సానుభూతిపొందటం ఇందులో భాగంగానే ఇప్పుడు వాళ్లకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనటం. ఒకవైపు నాయకుడుగానే ఎదుగుతూ రెండోవైపు వాళ్ళ మద్దతుతో ఓడినా రాజకీయాల్లో కొనసాగటం ఈ వ్యూహంలో భాగంగానే చెప్పొచ్చు. ఈ అన్నింటిలో అంతర్లీనంగా అర్ధమవుతుంది ఏంటంటే ఓటమి తప్పదనే సంకేతాలు అందటంతో రాద్ధాంతం చేస్తున్నట్లు ప్రజలు చెప్పుకుంటున్నారు. నిజమెంతో ఫలితాలు వస్తేగాని తెలియదు.
more updates »