విజయసాయి రెడ్డి నా పరువు తీశాడు: రవి ప్రకాష్

విజయసాయి రెడ్డి నా పరువు తీశాడు: రవి ప్రకాష్

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఆర్థిక నేరాల ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన విషయం తెల్సిందే. ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని, తీవ్రమైన మనీలాండరింగ్ వ్యవహారాల్లో కూడా రవిప్రకాష్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే నిజాలు కావని, రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. కాబట్టి విజయసాయిరెడ్డిపై రవిప్రకాశ్ రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేయబోతున్నారు.

రవి ప్రకాష్ పై అసత్య ఆరోపణలు చేసి, ఆయన పరువుకు భంగం కలిగించినందుకు దావా వేయబోతున్నట్టు వెల్లడించారు. టీవీ9లోకి మైహోం రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి చట్ట వ్యతిరేకంగా ప్రవేశించారని... రవి ప్రకాష్ పై వారిద్దరే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పారు.

రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి అనుచరుడు రామారావు లిఖితపూర్వకంగా తమ ఆరోపణలను వివిధ శాఖలకు గత నెలలో పంపించారని... అయితే ఇవన్నీ గాలి ఆరోపణలని అధికారులు తేల్చారని రవిప్రకాశ్ మేనేజర్ తెలిపారు. రామారావు పంపిన లేఖ ప్రతినే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజయసాయిరెడ్డి తన లెటర్ హెడ్ పై పంపించారని చెప్పారు. వీరు చేసిన నిరాధారమైన ఆరోపణలను ప్రసారం చేసిన చానళ్లపై కూడా కోర్టులను ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

more updates »