భూరికార్డుల సంస్కరణలే విజయారెడ్డి హత్యకు కారణమా?

 భూరికార్డుల సంస్కరణలే విజయారెడ్డి హత్యకు కారణమా?

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ సిబ్బందితో పనిపడుతుంది. కుల - ఆదాయ - స్థానికత ధ్రువపత్రాల గురించో, భూమి సమస్యల గురించో, పట్టాదారు పాసు పుస్తకం గురించో, మరేదైనా అవసరంతోనో రెవెన్యూ కార్యాలయం గుమ్మం తొక్కని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాబట్టే ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ఇటీవల తెలంగాణలో భూరికార్డుల సంస్కరణ చేపట్టారు. కొత్త పాసుపుస్తకాలు ఇచ్చారు. వాటిలో చాలా తప్పులు జరిగాయి. రికార్డుల సరవణ బాగా చేశారని ఒక దశలో రెవెన్యూ సిబ్బందిని మెచ్చుకుని, ఒక నెల జీతం బోనస్ ఇచ్చిన సీఎం కేసీఆర్, తర్వాత వారిని తప్పుబట్టారు. ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ రచ్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో రెవెన్యూశాఖను ప్రక్షాళించాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం.

రెవెన్యూ వ్యవస్థ బాగా లేదనీ, రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి సరికొత్త చట్టం తెస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం చెప్పారు. అంతేకాదు పలు వేదికల మీద రెవెన్యూ సిబ్బందిపై ఘాటు విమర్శలు చేశారు. ఒక వీఆర్వో తలచుకుంటే ఒకరి భూమిని మరొకరి పేరిట రాసేయగలడని చెప్పారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చాలనీ, సంస్కరణలు తేవాలనీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయి.

సంస్కరణలు అవసరమా, కాదా?

రెవెన్యూ శాఖలో ఎలాంటి సంస్కరణలు కావాలనే విషయంలో అభిప్రాయ బేధాలున్నాయిగానీ, సంస్కరణలు అవసరమనేది అన్ని వర్గాలూ ఒప్పుకొనే మాట.

రెవెన్యూ ఉద్యోగులు అన్ని రకాల చట్టాలు, జీవోలను తెలుసుకుంటూ పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి వీరికి పని ఎక్కువ, పలుకుబడి ఎక్కువ. వీరిపై ఆరోపణలు కూడా ఎక్కువే. చాలా సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది అందుబాటులోఉండరు. కనుక చట్టవ్యతిరేక మార్గాల్లో పనిచేయించుకునేవారు, చేసేవారూ పెరిగిపోయారు. రెవిన్యూ అధికారులను ఎవరు ఏమీ అనరు ఎందుకంటే భూమి రికార్డులు వాళ్ల చేతుల్లో ఉంటాయి కాబట్టి.

ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ వల్ల అటు సిబ్బందీ, ఇటు పౌరులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పనిమీద తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాలంటే, తహశీల్దార్ తోపాటు ఆర్ఐ, వీఆర్వోలు ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. సాధారణంగా తహశీల్దార్లు కలెక్టరేట్లో సమావేశాలనీ, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల సమావేశాలనీ, శిక్షణ కార్యక్రమాలనీ, మంత్రుల పర్యటనలనీ.. ఇలా రకరకాల పనుల్లో ఉంటారు. దీంతో ఈ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకుని వెళ్లి వారి చేత పనిచేయించుకోవడం పెద్ద తలనొప్పి.

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎంఆర్ఓ విజయారెడ్డి హత్య వెనుక అసలు కారణాలు ఏమిటి?

విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్. ఇతనిది రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని గౌరెల్లి గ్రామం. తన తండ్రి కృష్ణ. వారి అన్నదమ్ముల పొత్తులో 30 కుటుంబాలకు కలిపి సుమారు 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివాదంలో ఉంది. పాస్ బుక్ పొందటం కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళాడు. ఆ విషయం లోనే విజయారెడ్డితో గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చు.(నిజా నిజాలను పోలీసులు విచారిస్తున్నారు).

ఏది ఏమైనా చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగికి ఇలాంటి చర్య జరగటం బాధాకరం.

more updates »