మమత నిజ స్వరూపం ఇదే: నిప్పులు చెరిగిన అమిత్ షా

మమత నిజ స్వరూపం ఇదే: నిప్పులు చెరిగిన అమిత్ షా

మమతా బెనర్జీ నిజస్వరూపం ఏంటో నిన్న కోల్ కతాలో జరిగిన ఘటనతో బెంగాల్ వాసులకు తెలిసి వచ్చిందని, ఆమెను ప్రజలు తిరస్కరించే రోజు ఎంతో దూరంలో లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో ఎంతో మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని, తన రోడ్ షో జరిగితే, ఓడిపోతానన్న భయంతోనే మమతా బెనర్జీ తన నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు.

పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ, బీజేపీ ర్యాలీలోకి జొరబడిన టీఎంసీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారని, ఆస్తులను నాశనం చేశారని అన్నారు. తన రోడ్ షోలో మూడు సార్లు టీఎంసీ దాడులు చేసిందని, ఆందోళన చేస్తున్న వారిని అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అమిత్ షా ఆరోపించారు. తనపైనా రాళ్లదాడి జరిగిందని, అయితే, వ్యక్తిగత సిబ్బంది జాగ్రత్తగా ఉండటంతోనే బయట పడ్డానని అన్నారు.

టీఎంసీ కార్యకర్తలు దాడి కోసం ముందుగానే పెట్రోల్ బాంబులను సిద్ధం చేసుకుని వచ్చారంటే, దాడి ఘటన వెనుక ఎంతటి కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఈశ్వరచంద్ర విగ్రహాన్ని ధ్వంసం చేసింది టీఎంసీ కార్యకర్తలేనని ఆరోపించిన ఆయన, కాలేజీ గేటు తాళాలను బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి, విగ్రహాన్ని నాశనం చేశారని అన్నారు.

more updates »