భారతదేశ పరువు తీస్తున్న కాంగ్రెస్: షా

భారతదేశ పరువు తీస్తున్న కాంగ్రెస్: షా

చిక్కీలో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 అధికరణ రద్దును విపక్షాలు విమర్శించడాన్ని తప్పుపట్టారు. కాశ్మీర్ అంశంపై యునైటెడ్ కింగ్‌డమ్ లేబర్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ విభాగం చర్చించినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కాశ్మీర్ తమ ఆంతరంగిక అంశమని, దీనిపై మూడో దేశ జోక్యానికి ఆస్కారమే లేదని భారత్ అనేక సందర్భాల్లో తేల్చిచెప్పినప్పటికీ కాంగ్రెస్ ఈ విధంగా వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు. ఈ అంశంపై రాహుల్‌గాంధీ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడు జిరమీ కార్బిన్‌తో కాశ్మీర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ యూకే విభాగం చర్చించడాన్ని ఆయన తప్పుపట్టారు. కాశ్మీర్ అంశంపై లేదా భారత ఇతర ఆంతరంగిక వ్యవహారాలపై ఇతర దేశాల నేతలతో చర్చించే అధికారం తమ యూకే విభాగానికి లేదని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్ సి పి తమ సొంత కుటుంబాల ప్రయోజనం కోసమే పనిచేస్తున్నాయని, బీజేపీ, శివసేన దేశ ప్రయోజనాలే పరమాధిగా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ వాస్తవాన్ని గ్రహించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని అమిత్ షా కోరారు. రెండోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత మోదీ తీసుకున్న నిర్ణయం 370 అధికరణను రద్దు చేయడమేనని, దీంతో భారత్‌లో కాశ్మీర్ విలీనం పరిపూర్ణమైందని అమిత్ షా తెలిపారు. 370 అధికరణను రద్దు చేస్తే కాశ్మీర్ లోయలో రక్తం ప్రవహిస్తుందని కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ హెచ్చరించారని గుర్తుచేసిన అమిత్ షా ‘ఇంతవరకు ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదు’ అని అన్నారు. 370 అధికరణ రద్దుకు, మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని గుర్తు చేసిన అమిత్ షా ‘370 అధికరణ రద్దుతో భారత్‌లో కాశ్మీర్ పూర్తిగా విలీనమైంది. అంటే దేశ ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష నెరవేరింది’ అని పేర్కొన్నారు. అలాగే, కాశ్మీర్‌తో మహారాష్టక్రు ఎంతో సంబంధం ఉందని, ఆ రాష్ట్ర పరిరక్షణ కోసం మహారాష్టక్రు చెందిన ఎందరో సైనికులు ప్రాణత్యాగం చేశారని అమిత్ షా గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యలు చేపట్టిన తర్వాత రాజకీయ సుస్థిరత ఏర్పడిందని అన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంతటి సమీప బంధం ఉంటే, ఇదేదీ పట్టనట్టు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అమిత్ షా ఎద్దేవా చేశారు.

370 అధికరణ రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కాబట్టి, ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకుని, మొత్తం దేశమంతా ఏకం అన్న రీతిలో తీర్పునివ్వాలని ఆయన కోరారు. 2024కల్లా దేశమంతా ఎన్‌ఆర్‌సీని అమలు చేస్తామని, ప్రతి చొరబాటుదారుడ్నీ తరిమేస్తామని ఆయన స్పష్టం చేశారు.

more updates »