ఆంధ్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయి

ఆంధ్ర రాజకీయాలు భ్రష్టు పట్టాయి

ఆంధ్రా రాజకీయాలు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. కుల, మత రాజకీయాలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిసిగ్గుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీపై జరుగుతున్న ప్రచార సరళి చూస్తే తమ స్వార్ధం కోసం రాజకీయ నాయకులు , ప్రచార సాధనాలు ఎక్కడికైనా దిగజారుతాయని అర్ధమవుతుంది.

ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తిని ఇష్టమొచ్చినట్లు, ఎప్పుడుబడితే అప్పుడు బదిలీ చేయటం తీవ్రంగా ఖండించాల్సిన పరిణామమే. కాకపోతే ఇదేదో మొదటిసారి జరిగినట్లు, అసాధారణంగా ఇలా జరగటం వ్యవస్థలు నాశనం అవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో వాస్తవం లేకపోలేదు. రాజకీయనాయకుల ఇష్టానుసారం తలూపనప్పుడు అధికారుల బదిలీలు సర్వ సాధారణమయిపోయింది. ఇది మొట్టమొదటి సారి జగన్మోహన్ రెడ్డి చేయటంలేదు. అంతకుముందు పరిపాలకులందరూ అవలంబించిన పద్దతే. ఇందుకు ఏ రాజకీయ పార్టీ , నాయకులు మినహాయింపుకాదు. చంద్రబాబు నాయుడు, కెసిఆర్ , మోడీ కూడా ఈ విషయంలో పవిత్రులు కాదు. కాబట్టి వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయనే దాంట్లో అందరం ఏకీభవించాల్సిందే. అంతవరకు ప్రచార సాధనాలు , నాయకులూ పరిమితమయితే పర్వాలేదు.

దీనిలో కులాన్ని జోడించడం ఇటీవల కొత్త పరిణామం. ఇది చంద్రబాబు నాయుడు హయంలో ఐ వి ఆర్ కృష్ణారావు ని బదిలీ చేయటంతో మొదలయ్యింది. వెంటనే బ్రాహ్మణ సంఘం ఈ బదిలీని కుల వివక్షగా ప్రచారం చేసింది. దానికి తగ్గట్లుగానే కృష్ణారావు గారు రిటైర్మెంట్ తర్వాత బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. ఆ స్థాయి వ్యక్తులు ప్రత్యక్షంగా కుల సంఘాల్లో చేరటం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. ఇది ఆయనకొక్కరికే కాదు, అందరికీ వర్తిస్తుంది. వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని గగ్గోలు పెట్టే ప్రజాస్వామ్య పరిరక్షకులు ఈ చర్యలను ఖండించిన పాపాన పోలేదు. ఖండించకపోగా వాటికి ప్రచారం కూడా కల్పించారు. ఇప్పుడు అదే సీను రివర్స్ అయ్యింది. అప్పుడు సమర్ధించిన వాళ్లు ఇవ్వాళ అదే విమర్శను ఎదుర్కుంటున్నారు. అసలు ఇటువంటి వాటిలో కులాల్ని చొప్పించటం రాజకీయనాయకులు మానుకోవాలి. ఎల్ వి సుబ్రహ్మణ్యం బదిలీని ఆకస్మికంగా చేయటం ఖండించాల్సిందే, కానీ దానికి కులాన్ని జోడించడం సమాజానికి, సామాజిక సమతుల్యతకు హానీ చేసిన వాళ్లవుతారు.

ఇది అంతటితో ఆగలేదు. దీంట్లో మతాన్ని జోడించడం ఆందోళకరమైన విషయం. సరైన ఆధారాలు లేకుండా ఇటువంటి ప్రచారం చేయటం, సాంఘిక మాధ్యమాల్లో విద్యావంతులు సైతం పోస్టులు పెట్టటం దారుణం. ఈ బాధ్యతా రాహిత్య ప్రవర్తన మన మధ్యనే , మనతోటి సహచరులే చేయటం ఏ విధంగానూ సమర్ధనీయంకాదు. అలాగే దీనిపై రేటింగుల కోసం టీవీ చానళ్ళు చర్చలుపెట్టటం సమాజంలో విచ్చిన్నకర పోకడలు పెరగటానికి దోహదపడుతున్నాయని గమనించాలి. ఇది చివరకు హిందూ, క్రైస్తవ తగాద గా చిత్రించటం దారుణం. ఎల్ వి సుబ్రహ్మణ్యం బదిలీ చివరకు సమాజంలో మతాల పేరిట చిచ్చు పెట్టటానికి సాధనంగా ఉపయోగపడటం దురదృష్టకరం . ఇప్పటికైనా ఈ ప్రచారానికి ఫులుస్టాప్ పెట్టాలి. కులాలు, మతాలు ఒక పరిపాలనా సంబంధమైన బదిలీకి పులిమి పబ్బం గడుపుకోవటం దేశ ప్రయోజనాలకి , సమాజ శ్రేయస్సుకి ద్రోహంచేసినవారు అవుతారని ఇప్పటికైనా గ్రహించి నిగ్రహంతో వ్యవహిస్తారని ఆశిద్దాం.

more updates »