బెంగాల్ లో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడింది

బెంగాల్ లో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడింది

బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యవ్యవస్థకే ప్రమాదం. మీటింగులు పెట్టుకోనివ్వకపోవటం, పోలీసు వ్యవస్థను రాజకీయ అంగంగా మార్చుకోవటం, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వకపోవటం. ఒకవేళ ఇచ్చినా కార్యకర్తలతో హింసను ప్రోత్సహించటం , ముఖ్యమంత్రి హోదాలో వుండి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం మమతా బెనర్జీ అరాచకానికి పరాకాష్ట. మొత్తం దేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే ఒక్క బెంగాల్ లోనే ఎందుకిలా అల్లర్లు జరుగుతున్నాయో ప్రజాస్వామ్య వాదులు , మేధావులు ఆలోచించాలి. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఎవరికి వారు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాహింసకు తావులేదు. మరి బెంగాల్లోనే ఎందుకిలా?

మొదట్నుంచీ బెంగాల్ లో ఘర్షణ వాతావరణమున్నా ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. మమతా బెనర్జీ తో వచ్చిన సమస్యల్లా ఆవిడ ఏదనుకుంటే అది జరగాల్సిందే. ఎదురుచెప్పకూడదు. ప్రతిపక్షం లో వున్నప్పుడు సిపిఎం పై యుద్ధం చేసినప్పుడు అందరూ ఈమె సిపిఎం పార్టీ నియంతృత్వ పోకడలపై గట్టిగా నిలబడుతుందని భావించి మద్దత్తిచ్చారు. అది ప్రజల ప్రజాస్వామ్య హక్కులకోసం అని అనుకున్నారు. ఇప్పుడర్ధమవుతుందేమిటంటే తన మాటే చెల్లాలనే మనస్తత్వం తో ఇదంతా చేస్తుందని ఎవరూ భావించలేదు. అప్పట్లో అధికారంలోవున్న సిపిఎం అధికార దుర్వినియోగం చేస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మమతకు మద్దతిచ్చినప్పుడు ఈమెకూడా అలా అంతకంటే ఎక్కువగా తయారవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని కాపాడుతుందని ఈమెకు అధికారం కట్టబెట్టారు. కానీ జరిగిందేమిటి? ఆవిడ వచ్చినప్పటినుంచి కాంగ్రెస్, సిపిఎం ని ఎలా దెబ్బ తీయాలా అనే ఆలోచనలతోనే పనిచేసింది. అప్పట్లోనే రచయితలమీద నిర్బంధం విధించింది. వ్యతిరేకించిన వాళ్ళను ఏదోవిధంగా అంతుచూడాలనే పద్దతిలో ప్రవర్తించేది. అందుకే సిపిఎం, కాంగ్రెస్ పోయిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. కానీ దానికి రెండు పార్టీల్లో పూర్తి అనుకూలత లేకపోవటం ఆమెకు కలిసొచ్చింది. ఆ మైత్రిని వాళ్ళు ఎన్నికలకే పరిమితం చేయకుండా ప్రజాఉద్యమం లోకి మళ్ళించివుంటే ప్రజలు వాళ్లవైపే నిలబడేవాళ్లు. కానీ ఆవిడ తీసుకున్న ప్రజావ్యతిరేక, హిందూ వ్యతిరేక చర్యల్ని సిపిఎం,కాంగ్రెస్ గట్టిగా ఖండించక పోవటం బీజేపీ కి కలిసొచ్చిందని చెప్పాలి. అంటే ఓ విధంగా టీఎంసీ నియంతృత్వ పోకడలు, కాంగ్రెస్,సిపిఎం అరకొర ప్రతిఘటన బీజేపీ కి అందొచ్చిన అవకాశం. బీజేపీ ని కూడా సిపిఎం ని, కాంగ్రెస్ ని బెదిరించినట్లు అణిచివేయటానికి అన్ని రకాల ప్రయత్నం చేసింది. అయినా వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారం లో ఉండటం వాళ్లకు కలిసొచ్చింది. విశేషమేమంటే బెంగాల్ పశ్చిమ ప్రాంతం లో ఆదివాసులు, దళితులూ ఎక్కువమంది బీజేపీ లోకి చేరటం. చివరకు దళిత కార్యకర్తలను టీఎంసీ క్యాడర్ హత్యకూడా చేసారు. ఈ పరిణామాలన్నీ బీజేపీ బలపడేటట్లు చేసాయి. ప్రజలు చివరికి బీజేపీ సిద్ధాంతం పై కన్నామమతా దౌష్ట్యాలపై పోరాడే పార్టీగా గుర్తించటంవలనే దాని గొడుగు క్రింద చేరారు. ఈ పరిణామక్రమం లో సిపిఎం, కాంగ్రెస్ బలహీనపడి బీజేపీ బలపడింది. ప్రస్తుతం పోటీ టీఎంసీ బీజేపీ మధ్యనే ప్రధానంగా జరుగుతుంది.

రాజకీయాల్లో ఎత్తుగడలు, వ్యూహప్రతివ్యూహాలు సహజం. అందులో ఎవరు వ్యూహాలు విజయవంతమయితే వాళ్లనే ప్రజలు ఆదరిస్తారు. అంతవరకూ బాగానే ఉంది. కాకపోతే చిక్కల్లా రాజ్యాంగ పద్ధతుల్లో ఈ వ్యూహాలు ఉండాలి. బెంగాల్ లో ఆ పరిధులు దాటి మమతా అధికారం కోసం ఎంతకైనా తెగించటం. బీజేపీ సిద్ధాంతం వ్యతిరేకించాలనుకుంటే ప్రజలదగ్గరకెళ్ళి నచ్చచెప్పుకోవాలిగాని వాళ్ళ హక్కుల్ని హరించే హక్కు మమతకు లేదు. ఆవిడ వాడే భాష ఆవిడ పదవికి తగదు. ప్రధానమంత్రి తుఫాను సమయంలో ఫోను చేస్తే తీయకపోవడం , బీజేపీ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవటం లాంటి చేష్టలు ప్రజలు హర్షించరు. ఈ చర్యలవలన తటస్థులు కూడా ఆమెకు వ్యతిరేకంగా మారే అవకాశముంది. మొన్న జరిగిన అమిత్ షా ర్యాలీ లో టీఎంసీ క్యాడర్ నిరసన తెలపటం రెచ్చగొట్టే చర్య. సహజంగా అధికారం లో వున్నపార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడదు. కానీ ఈవిడ స్టయిలే వేరు. ర్యాలీ విజయవంతమయితే మరుసటి రోజు అంతకంటే పెద్ద ర్యాలీ నిర్వహించే హక్కు మమతకి వుంది. కానీ ర్యాలీ ని ప్రశాంతంగా జరగనీయక పోవటం ప్రజాస్వామ్య హక్కుల్ని హరించటమే. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు ఇంకా దారుణం. మధ్యలో సామాజికఉద్యమ పితామహుడు ఈశ్వర చంద్ర విద్యా సాగర్ ప్రతిమను ధ్వంసం చేయటం దారుణం. మొత్తం దేశం ఒకదారయితే బెంగాల్ ది వేరే దారని నిరూపించింది మమతా బెనర్జీ.

వీటన్నిటిలో హైలైట్ వాట్సాప్ లో మమతా ఫోటోను మార్పిడిచేసి ప్రచురించిన వ్యంగ్య ప్రతిమను ఫార్వర్డ్ ( తను సృష్టించింది కాదు) చేసినందుకు బీజేపీ యువ కార్యకర్త ప్రియాంక శర్మ ని 14 రోజుల పోలీస్ కస్టడీకి పంపించటం. ఈ చర్యను కూడా సమర్ధించే మేధావుల్ని ఏమనాలో అర్ధంకావటంలేదు. భావ స్వేచ్ఛను నిర్బంధిస్తే ప్రజాస్వామ్యమనేది సమాధి అయినట్లే భావించాలి.

చివరలో ఇంకో ముఖ్యవిషయాన్ని ప్రస్తావించాలి. ఈ మమతా అప్రజాస్వామిక చర్యల్ని ఖండించాల్సిన ఉదారవాదులు అవి జరిగింది వాళ్ళ బద్ధ వైరి బీజేపీ పై కాబట్టి మిన్నకుండటం ఉదారవాదానికే మయానిమచ్చ. సమస్యను సమస్యగా చూడకుండా బీజేపీ అయితే ఒక వైఖరి వాళ్లకు జరిగితే ఇంకో వైఖరి అవలంబించటం అవకాశవాదం. చివరకు ప్రజలు వీళ్ళ ప్రజాస్వామ్య వైఖరి బూటకమని భావనకు వచ్చే ప్రమాదముంది. దేశంలో బీజేపీ బలపడటం లో ఉదారవాదుల అవకాశవాద వైఖరి కూడా ఒక కారణమని చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలను అందరూ ముక్త కంఠం తో ఖండించినప్పుడేప్రజాస్వామ్యం, మానవ హక్కులు బలపడతాయని అందరం గ్రహించాలి.

more updates »