చెత్త ఇచ్చాడు.. టిఫిన్ చేశాడు..!

చెత్త ఇచ్చాడు.. టిఫిన్ చేశాడు..!

మన దేశంలో గార్బేజ్ కేఫ్ (చెత్త కేఫ్) అనే కేఫ్ ఉందని మీకు తెలుసా..? చెత్త కేఫ్ అంటే చెత్తను ఇచ్చే కేఫ్ కాదు చెత్త తీసుకొని ఫుడ్ ఇచ్చే కేఫ్. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం. ఛత్తీస్‌గఢ్ లోని అంబికాపూర్ అనే నగరంలో ఈ కేఫ్ ఉంది. ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఈ నగరం రెండో స్థానంలో నిలిచింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదిద్దామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తూ... అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) ఈ కేఫ్‌ని తెరచింది. "మహాత్మాగాంధీ 150వ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచీ దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులు) వస్తువుల్ని నిషేధించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ కేఫ్ ను ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీ ఎస్ సింగ్‌దేవ్... "గార్బేజ్ కేఫ్" (చెత్త కేఫ్) ప్రారంభించారు. ఈ కేఫ్ దేశంతోపాటూ... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది" అని సింగ్‌దేవ్ అన్నారు.

ఇలాంటి కేఫ్ ఒకటి ప్రారంభమైందని తెలిసి ఆశ్చర్యపోయిన ఓ స్థానికుడు నమ్మకం లేకపోయినా... చెక్ చేసి చూద్దామని తన ఇంట్లో దాదాపు అర కేజీ బరువు వేస్ట్ ప్లాస్టిక్ వస్తువుల్ని తీసుకెళ్లి ఇచ్చాడు. నిజంగానే ఫ్రీ ఫుడ్ ఇవ్వడంతో చాలా ఆనందపడ్డాడు. ఇలాంటి కేఫ్ వల్ల చెత్త ఎక్కడబడితే అక్కడ పడేయకుండా ఉంటారనీ, సిటీ క్లీన్‌గా ఉంటుందని అంటున్నాడు ఆయన. కేఫ్ ముందు "ఎక్కువ వేస్ట్... ఎక్కువ టేస్ట్" అని ఉండటం అతనికి బాగా నచ్చిందన్నాడు. చెత్త కేఫ్‌లో ఇచ్చిన ఫుడ్ చాలా టేస్టీగా ఉందని మెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఈ కేఫ్‌కి జనం క్యూ కడుతున్నారు. ఇక్కడ పోగవుతున్న చెత్తను మున్సిపల్ కార్పొరేషన్‌కి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి చాలా చర్యలు చేపట్టింది. వాటన్నింటికంటే... తాజా కేఫ్‌పై ఎక్కువ పాజిటివ్ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కేఫ్ లు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని అనేకమంది సలహాలు ఇస్తున్నారు.
more updates »