ఇద్దరు చంద్రుల రాజకీయ చదరంగం లో గెలుపెవరిది?

ఇద్దరు చంద్రుల రాజకీయ చదరంగం లో గెలుపెవరిది?
దేశ రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మొదటి ఫేజ్లో ఎన్నికలైన ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు దాదాపు 40 రోజులు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే కష్టమే. అందుకే రాష్ట్రాలు వదిలి దేశ పర్యటనలు మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఈ ఖాళీ టైం లో చక్రం తిప్పుదామంటే ఎన్నికల కమిటీ, చీఫ్ సెక్రటరీ అడ్డుతగులుతున్నారు. మరి ఏమిచేయాలో బోధ పడటం లేదు. అలాగే కేసీఆర్ ఇంటర్ గొడవలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. దానినుంచి ఎలా బయటపడాలో అర్ధం కావటం లేదు. మొత్తం మీద ఇద్దరు చంద్రులూ ఇరకాటం లో కాసంత ఇబ్బంది పడుతున్నారు. చివరకి మంచి అవకాశం దొరికింది. అదేంటో చూద్దాం. లోక్ సభ ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ స్వంతంగా రాదని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాకు రావటానికి ఏదో ఉప్పందిందని అనుకుంటున్నారు. సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు చెప్పకపోయినా రాజకీయనాయకులకు ఉప్పందించారనుకుంటున్నారు. మొదటి నాలుగు విడతల్లో ఫలితాలు బిజెపి కి అంత అనుకూలంగా లేవని, ఈ లెక్కన బిజెపి , ఆ మాటకొస్తే ఎన్డీయే కు కూడా పూర్తీ మెజారిటీ రాదని చెప్పుకుంటున్నారు. ఇటీవల బిజెపి కి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రామ్ మాధవ్ బ్లూమ్ బెర్గ్ కిచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్డీయే కి పూర్తీ మెజారిటీ వస్తే సంతోషం అని ప్రకటించటం తో రాజకీయ పరిశీలకులకు చేతినిండా పని దొరికింది. రామ్ మాధవ్ లాంటి నాయకులే బిజెపి కి స్వంతంగా మెజారిటీ రాదని నర్మగర్భంగా చెప్పినట్లయ్యిందని ఈ లెక్కన లోక్ సభ కు హంగ్ తప్పదని చెబుతున్నారు. ఈ పరిస్థితులే ఇద్దరు చంద్రులను దేశ పర్యటనలకు ఉసిగొల్పాయి. ఒకవేళ హంగే వస్తే చిన్న చిన్న పార్టీలు కూడా కీలకం కాబోతున్నాయి. ఈ ఇద్దరూ ఈ అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆరాటపడుతున్నారు. చంద్రబాబు నాయుడు అటు కాంగ్రెస్ ను, ఇటు కాంగ్రెసేతర ప్రతిపక్షాలను కలుపుకు పోతూ రాజకీయ చక్రం తిప్పుతున్నాడు. కేసి ఆర్ కేవలం కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక పార్టీలను కూడగట్టాలని అనుకుంటున్నాడు. ఇందులో చంద్రబాబు నాయుడు వ్యూహం క్లిక్ అయ్యే అవకాశాలే మెండుగా వున్నాయి. కేసీఆర్ కొన్ని పరిమితులతో కదలటం వలన ఆ వ్యూహం ఫలించటం కష్టం. ఎందుకంటే కాంగ్రెస్ లేకుండా బిజెపి యేతర ప్రభుత్వం అధికారం లోకి రావటం జరగదు. అదీగాక ఇప్పటికే కేసీఆర్ బిజెపి బి టీంగా బలంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి కేసీఆర్ కన్నా చంద్రబాబు నాయుడు కే చక్రం తిప్పే అవకాశాలు మెండుగా వున్నాయి. ఇదంతా కూడా ఎన్డీయే బలం మెజారిటీ కి తక్కువగా వున్నప్పుడే నని మరచిపోవద్దు. మోడీ మాత్రం ఇప్పటికీ తనకే మెజారిటీ వస్తుందని నమ్ముతున్నాడు. ఇప్పుడు జరిగే ఆరవ, ఏడవ దఫా ఎన్నికలన్నీ తనకు అనుకూలంగా వుంటాయని నమ్ముతున్నాడు. అందుకే ఈ రెండు ఎన్నికలు మోడీకి కీలకం కాబోతున్నాయి. తూర్పు ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, బీహార్,మధ్య ప్రదేశ్ మోడీ హవా ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం నమ్ముతుంది. పశ్చిమ బెంగాల్ లో గణనీయమైన రీతిలో బలం పెరుగుతుందని నమ్ముతుంది. విశేషమేమంటే బెంగాల్ లో పరిస్థితులు అనుకూలంగా వున్నా కిందలెవెల్ లో తగినంత క్యాడర్ లేకపోవటం ఒకింత ఇబ్బందిగా వుంది. అందుకు బూత్ లెవెల్ లో సిపిఎం క్యాడర్ మద్దత్తు కూడగడుతున్నట్లు తెలుస్తుంది. అది తెలిసే బెంగాల్ సిపిఎం కార్యదర్శి కింద లెవెల్ క్యాడర్ కు ఎటువంటి పరిస్థితుల్లో మద్దతివ్వద్దని ఓ సర్కులర్ జారీచేయాల్సి వచ్చిందని అంటున్నారు. అంటే దేశ వ్యాప్తంగా సిపిఎం మోడీ వ్యతిరేక కూటమి కూడగడుతుంటే బెంగాల్ లో సిపిఎం క్యాడర్ మమతా వ్యతిరేక కూటమిని కూడగడుతున్నట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో వైచిత్రాలు జరగటమంటే ఇదే కాబోలు. ఇంతవరకు భారతదేశం లో ఒపీనియన్ పోల్స్ ,ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా విజయవంతం అయిన సంఘటన లేదు. కేవలం ఇండికేటివ్ గానే ఉంటున్నాయి. ఆ లెక్కన చూస్తే ఇద్దరు చంద్రుల ఆశలు ఏమేరకు నెరవేరతాయో చెప్పలేము. ఇప్పటికయితే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. అదే జరిగితే పాపం ఇద్దరు చంద్రుల ఆశలు అడియాశలేనా?
more updates »