అధిక ధరలకు అమ్మితే తాట తీస్తా... సీఎం జగన్

అధిక ధరలకు అమ్మితే తాట తీస్తా... సీఎం జగన్

రాష్ట్రంలో ఏర్పడ్డ ఇసుక కొరత మరియు తక్షణమే ప్రభుత్వం తీసుకోవలసిన జాగ్రత్తల విషయమై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే జైలుకు పంపేలా ప్రత్యేక చట్టం తేవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదలు తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుకను పెద్ద ఎత్తున స్టాక్‌ యార్డులకు తరలించి ఎక్కడా కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

రెండు మూడు రోజులుగా వరద కొంత తగ్గినందున రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల సంఖ్య 61 నుంచి 83కు పెరిగిందని అధికారులు తెలిపారు. సరఫరా రోజుకు సగటున 41 వేల టన్నుల నుంచి 69 వేల టన్నులకు పెరిగిందని వివరించారు. వారం రోజుల్లో దీన్ని లక్ష టన్నులకు పెంచుతామన్నారు. వాతావరణం సహకరిస్తే 15 నుంచి 30 రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని, అన్ని రీచ్‌ల్లో ఇసుక వెలికితీత ప్రారంభమై సరఫరా రోజుకు 2 నుంచి 3 లక్షల టన్నుల వరకు పెరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ పోలీస్‌ అధికారులు రవిశంకర్‌ అయ్యన్నార్, సురేంద్రబాబు, గనులశాఖ అధికారులు పాల్గొన్నారు.

సీఎం సమీక్షలో కీలక అంశాలివీ..

  • - ఇసుక స్మగ్లింగ్‌కు ఏమాత్రం ఆస్కారం లేకుండా సరిహద్దుల్లో నిఘా పెంచి టెక్నాలజీని వినియోగించుకోవాలి.
  • - ప్రతి రూట్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సిబ్బందికి సదుపాయాలు కల్పించాలి.
  • - తప్పు చేసిన వారిని జైలుకు పంపితే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుంది.
  • - ప్రతి రీచ్‌లో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా చూడగలగాలి. తవ్వకాలు నిలిచిపోతే వెంటనే కారణం తెలియాలి.
  • - మొత్తం 275 రీచ్‌లలో రాత్రి పూట కూడా పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
  • - రీచ్‌ల వద్ద ఈ నెలాఖరు నాటికి సీసీ కెమెరాలు, వే బ్రిడ్జిలు సిద్ధం కావాలి. జాప్యాన్ని నివారించేందుకు వేర్వేరు సంస్థల నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలి.
  • - వరద తగ్గగానే అన్ని రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా కోసం వాహనాలను విస్తృతంగా అందుబాటులో ఉంచాలి.
  • - కిలోమీటరుకు టన్ను రూ.4.90 చొప్పున ఇసుక రవాణాకు ఎవరు ముందుకు వచ్చినా వెంటనే అనుమతి ఇవ్వాలి.
  • - స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వలు సరిపడా చేరేవరకు విరామం లేకుండా పనిచేయాలి.
  • - అవసరమైతే స్టాక్‌ పాయింట్లు పెంచాలి. ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ఇసుక సరఫరా చేయాలి.
more updates »