కళ్ళుమూసుకుపోయిన సమాజాన్ని కలంతో కదిలించిన కామినిరాయ్

కళ్ళుమూసుకుపోయిన సమాజాన్ని కలంతో కదిలించిన కామినిరాయ్

సతీసహగమనం, బాల్య వివాహాలు వంటి మూఢనమ్మకాలతో కళ్ళుమూసుకొని పోయిన రోజుల్లో స్త్రీ జాతి కోసం కలం పట్టి కధం తొక్కిన కామిని 155 వ జన్మదినం సందర్బంగా ఆమె పై ఈ స్పెషల్ స్టోరీ. అసలు ఆమె ఎవరు? ఈ సమాజానికి ఏమిచేసింది? తన జీవితాన్ని ఎలా ఆనాటి సమాజానికి ఉపయోగకరంగా మార్చుకుంది వంటి విషయాలను తెలుసుకుందాం..

ప్రసిద్ధి చెందిన రచయితల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనం సరాసరి వర్జినీయా ఉల్ఫ్, టోని మారిసన్ దగ్గరకు వెళతాంగానీ భారతగడ్డ పై పుట్టి ఉద్యమకెరటమైన మహిళల్లో కామినీరాయ్ ఉన్నారని మర్చిపోతాం. ‘మీ అమ్మాయిని కాలేజీ పంపిస్తున్నారా? ఏమిటీ విడ్డూరం’ అని బుగ్గలు నొక్కుకునే కాలంలో... స్త్రీకీ ఒక హృదయం ఉందనే ఎరుక ఏమాత్రం లేని కాలంలో మహిళల హక్కుల కోసం గళం విప్పారు కామిని. వీధుల్లో కదం తొక్కారు. స్త్రీ చైతన్య కవిత్వాన్ని కుమ్మరించారు.

1864లో అక్టోబర్ 12న బెంగాలీ ప్రెసిడెన్సీలోని బసంద గ్రామంలో జన్మించారు కామిని. తండ్రి చండీ చరణ్‌సేన్ ప్రగతిశీల భావాలున్న రచయిత కావడంతో స్వేచ్ఛగా పెరిగింది కామిని. ఆ వాతావరణం స్నేహితురాళ్ల ఇండ్లలో ఎందుకుండదో ఆమెకు అర్థమయ్యేది కాదు. ‘బయటికి వెళుతున్నాను’ అని ఇంట్లో చెప్పడానికి, పెద్దల నుంచి అనుమతి తెచ్చుకోవడానికి తన స్నేహితురాళ్ల తల ప్రాణం తోకకు వచ్చేది. ‘మనం వెళ్లేది అంతరిక్షానికి కాదు కదా?’ అని స్నేహితురాళ్లను అడిగేది. కలకత్తాలోని బేతూన్ కాలేజీలో చేరినప్పుడు చుట్టాలు పక్కాలు, ఇరుగు పొరుగువాళ్లు ఆకాశం భూమి ఏకమైనంతగా ఆశ్చర్యపోయారు. ‘ఈ సమాజం ఎటు పోతుందో ఏమిటో!’ అని సూటిపోటి మాటలు అన్నవాళ్లూ ఉన్నారు. అయితే అవేమీ మనసుకు తీసుకోలేదు. అలా తీసుకొని ఉంటే కామిని మన దేశంలో ఫస్ట్ వుమన్ ఆనర్స్ గ్రాడ్యుయేట్ అయ్యేవారు కాదు. తాను చూసిన పరిస్థితులు కామినికి స్త్రీ హక్కులపై స్పృహను కలిగించాయి. ఫెమినిజం వైపు ఆకర్షితమయ్యేలా చేశాయి. ‘ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్’ పేరుతో రాసిన వ్యాసంలో చదువు వల్ల స్త్రీ చైతన్యం బహుముఖాలుగా వికసించడం గురించి, స్త్రీ స్వేచ్ఛపై పురుష దురహంకార భయాలను గురించి రాశారు. స్త్రీ హక్కులు, చైతన్యానికి సంబంధించిన స్పృహను రచనలు, ఉపన్యాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు కామిని. ప్రత్యక్ష కార్యచరణలోనూ తన నిండైన నిబద్ధతను చాటుకున్నారు.

కుమిదిని మిత్ర, మృణాళినీ సేన్ మొదలైన స్త్రీవాద నాయకురాళ్లతో కలిసి 1921లో ‘స్త్రీలకు ఓటు హక్కు’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ‘వీళ్లకు ఓటు హక్కు కావాలట’ అని వెక్కిరించేవాళ్లు కొందరు మగాళ్లు. ‘మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా పురుషుడి స్థాయికి ఎప్పుడూ చేరలేరు’ అనేవారు. ఇలాంటి వాళ్ల అహంకారపు దుమ్మును దులిపేస్తూ ఒక కొత్త కాంతిని దర్శింపజేశారు కామిని. చీకట్లో ఉంది స్త్రీలు కాదు, దురహంకార భావాలతో విర్రవీగే వాళ్లు అనేవారామె.

బ్రిటిష్, ఇండియన్ ఫెమినిస్ట్‌లు సంయుక్తంగా కలిసి ప్రచురించే ‘స్త్రీ ధర్మ’ పత్రికలో స్త్రీవాద దృక్పథంతో వచ్చే అంతర్జాతీయ వార్తల గురించి చర్చించేవారు. ప్రపంచవ్యాప్త స్త్రీవాద ఉద్యమాలను గురించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుండేవారు. ఫిమేల్ లేబర్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ (1922-23) సభ్యురాలిగా స్త్రీ కార్మికులకు అండగా నిలిచారు కామిని. పురుషులతో సమానంగా చెమటోడుస్తున్నప్పటికీ తక్కువ వేతనాలు ఇచ్చేవారు పరిశ్రమ యజమానులు.

ఒకవేళ వాళ్లు న్యాయబద్ధంగా సమాన వేతనాలు ఇచ్చినా... మగకార్మికులు అభ్యంతరం చెప్పేవాళ్లు. ఆ పద్ధతిని మార్చి, పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనాలు అందేలా చేస్తూ వేతన సమానత్వానికి న్యాయం చేశారు కామిని.సృజనాత్మక రంగంలో కూడా తనదైన కృషి చేశారు. ఔత్సాహిక రచయితలు, కవులను ప్రోత్సహించారు. నేల విడిచి సాము చేయరాదని చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలతో ప్రభావితమైన కామిని, తన రచనల్లో మాత్రం సొంత గొంతు వెదుక్కున్నారు. అక్షరం అనేది లక్ష ఆలోచనల సమాహారం అనే నినాదాన్ని తన కవిత్వంతో నిరూపించారు.

కవయిత్రి, ఉపన్యాసకురాలు, ఉపాధ్యాయురాలు, గణితంలో ఆరితేరిన ప్రతిభావంతురాలిగా ప్రత్యేకతను చాటుకున్న కామిని 30వ ఏట వివాహం చేసుకున్నారు. ఇది కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లయిన తరువాత కవిత్వం రాయడం తగ్గించారు. ‘‘చివరికి మీరు కూడా కుటుంబ బంధంలో చిక్కుకోకతప్పలేదన్నమాట’’ అని ఎవరో సరదాగా అంటే- ‘‘అలా ఏమీలేదు...ఇదిగో నా లివింగ్ పోయమ్స్’’ అన్నారట తన పిల్లల్ని చూపిస్తూ. కాగితంలోనే కాదు జీవితంలోనూ కవిత్వాన్ని చూసిన కామిని తొలి తరం ఫెమినిస్ట్‌గా చరిత్రలో నిలిచిపోయారు. ఆత్మగౌరవానికి ఒక ప్రతీకగా వెలిగారు.

కలకత్తాలోని బేతూన్ కాలేజీలో చేరినప్పుడు చుట్టాలు పక్కాలు, ఇరుగు పొరుగువాళ్లు ఆకాశం భూమి ఏకమైనంతగా ఆశర్యపోయారు. ‘ఈ సమాజం ఎటు పోతుందో ఏమిటో!’ అని సూటిపోటి మాటలు అన్నవాళ్లూ ఉన్నారు. అయితే అవేమీ మనసుకు తీసుకోలేదు కామిని.

more updates »