ఆస్తి కోసం ఆరుగుర్ని చంపిన జోలీ కేసులో కొత్త కోణాలు!

ఆస్తి కోసం ఆరుగుర్ని చంపిన జోలీ కేసులో కొత్త కోణాలు!

ఆస్తి కోసం 6గురుని చంపిన ఓ కోడలి ఉదంతం..! కేరళలో ... ఆస్తి కోసం 14 ఏళ్లలో... ఒకే కుటుంబంలో ఆరుగుర్ని చంపిన కోడలు జోలీ ఉదంతంలో... కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఓ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో ఆమెకు రాయ్ అనే అధికారి సాయం చేశాడు. అతని ఏడాదిన్నర కొడుకును కూడా చంపేందుకు జోలీ యత్నించినట్లు తాజాగా బయటపడింది. దీనిపై దర్యాప్తు అధికారులు స్పెషల్ ఛార్జ్‌షీట్ రెడీ చేస్తున్నారు. ఈ కేసు ఎంత లోతుగా ఉందంటే... క్రైమ్ బ్రాంచ్... మొత్తం ఆరు టీమ్‌లను ఆరు హత్యలపై దర్యాప్తు కోసం నియమించాలని అనుకుంటోంది. ఇందుకోసం జిల్లాలో వాళ్లనే ఎక్కువగా నియమించాలని అనుకుంటోంది. ఈ హత్య కేసుల్లో రియల్ ఎస్టేట్ గ్రూపులకు కూడా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జోలీని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తామని అధికారులు చెబుతున్నారు.

2002 నుంచి 2016 వరకు జరిగిన ఈ హత్యలన్నీ సహజ మరణాలుగా అంతా భావించారు. ఐతే... హత్యలు జరుగుతున్న ఏళ్లలోనే... ఆస్తులన్నీ జోలీ పేరు మీదకి మారిపోయాయి. ఈ వరుస మరణాలపై ఆమె మొదటి భర్త సోదరుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దాంతో అవన్నీ హత్యలేనని తేలింది. సైనేడ్ ఇచ్చి వారిని చంపినట్లు తేల్చారు. అన్ని హత్యల వెనకా ఉన్నది జోలీయే. కేరళలోని కూడతాయిలో పొన్నమట్టం కుటుంబానికి చెందిన అన్నమ్మ థామస్, టామ్ థామస్ అనే దంపతులకు ఇద్దరు కొడుకులు. ఒకరు రాయ్ థామస్, మరొకరు మోజో. రాయ్ థామస్‌కి 14 ఏళ్ల కిందట జోలీతో పెళ్లైంది. అయితే రాయ్ థామస్ పెద్దనాన్న కొడుకు షాజూతో జోలీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. షాజూ ఆస్తులతోపాటూ... తన భర్త కుటుంబానికి చెందిన ఆస్తిని దక్కించుకోవాలనుకుంది. ఇందుకోసం భర్త కుటుంబ సభ్యులతో పాటు షాజూ భార్య, కూతుర్ని కూడా చంపేసింది.

ఈ కేసులో జోలీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న షాజూకి తండ్రి అయిన జచారియాస్ ఓ ఆశ్చర్యకర విషయం చెప్పారు. జోలీ మొదటి భర్త రాయ్ థామస్... సైనైడ్ వల్లే చనిపోయాడని తనకు తెలుసన్న ఆయన... ఆ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పలేదని అన్నాడు. జోలీ గనక ఇప్పుడు పోలీసులకు పట్టుపడకపోయి ఉంటే... తమను కూడా చంపేసేదని అనుమానం వ్యక్తం చేశాడు. ఐతే... దీనిపై అధికారులు మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

more updates »