ప్రత్యేక హోదాపై కిం కర్తవ్యం?

ప్రత్యేక హోదాపై కిం కర్తవ్యం?

ప్రత్యేక హోదాపై ఇప్పటివరకు చంద్రబాబునాయుడు గానీ, జగన్ మోహన్ రెడ్డి గానీ, పవన్ కళ్యాణ్ గానీ ముఖ్యమంత్రి అయితే సాధ్యాసాధ్యాలపై చర్చించుకున్నాం. ఇందులో ఎవరు ముఖ్యమంత్రయినా ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లేనని తేలింది. మరి కిం కర్తవ్యం? ప్రత్యేక హోదా కావాలని బిజెపి నే అడిగింది, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వటంలేదు. అలాగే కాంగ్రెస్ కు అంతచిత్తశుద్ధి వుంటే చట్టం లో ఎందుకు చేర్చలేదు? రాదని తెలిసీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సెంటిమెంట్ తో ఎందుకు ఆడుకున్నాయి? మరి ఇదే నిజమయితే రెండుసార్లు మేధావుల కమిటీలు సమావేశమై తీర్మానాలు చేసినా ఎక్కడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవని ఎందుకు చెప్పలేదు?ఇదంతా చూస్తుంటే ఎదో మాయా ప్రపంచం లో ఉన్నట్టుంది. ఏంచేయాలో తేల్చుకోవాలన్నా 23 దాకా ఆగాలా? 23 తర్వాత ఏమన్నా అద్భుతాలు జరుగుతాయా? కేవలం ఆశ చావక అలా వాయిదా వేస్తున్నామా? అన్ని ప్రశ్నలే, సందేహాలే. జవాబులు లేవు, దొరకవు. ప్రత్యేక హోదా మాయా లేడి లాగా వుంది. మరి ఏం చేద్దాం? రండి, నాతోపాటు మీరూ మేధోమధనం చేయండి.

అసలు సమస్య ఎందుకింత జఠిలమైంది? మోడీ, చంద్రబాబు మధ్య ఇగో సమస్యా? లేక మోడీ నిజంగా ఇవ్వలేని పరిస్థితిలో వున్నాడా? అసలేంటీ సమస్య? ప్రత్యేక హోదా అంటే రాష్ట్రాల్లో కొన్ని ప్రత్యేకం. వాటిని అన్ని రాష్ట్రాలతో కాకుండా జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్పటం. ఇప్పటివరకు కొండప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలకు తప్పించి ప్రధాన భూభాగంలో వున్న ఏ రాష్ట్రానికీ ఈ హోదా ఇవ్వలేదు. కానీ ప్రధాన భూభాగం లో వున్న అనేక రాష్ట్రాలు మనకన్నా ముందే ప్రత్యేక హోదా అడిగి వున్నయి. అయినా కేంద్రం జాలిచూపలేదు. అదివరకు ఈ హోదా ఇవ్వాలంటే జాతీయ మండలి లో తీర్మానం చేయాల్సి వుంది. ప్రస్తుతం ఆ జాతీయ మండలి అనే వ్యవస్థనే రద్దు చేశారు. అసలు ఈ ప్రత్యేక హోదా ఇవ్వటానికి ఆధారమేమిటి? కొండప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, స్వంతగా ఆదాయ వనరులు సమకూర్చుకునే అవకాశాలు తక్కువ ఉండటం , దేశ సగటు కన్నా తక్కువ సగటు వ్యక్తిగత ఆదాయం ఉండటం , ఆర్ధికంగా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే బలహీనంగా ఉండటం లాంటి ప్రత్యేక కారణాలు వుంటే వాటినాధారం చేసుకొని నిర్ణయిస్తారు. మరి వీటిల్లో ఏ ఒక్క కేటగిరి లోకి ఆంధ్ర ప్రదేశ్ రాదు. అంటే రాదని తెలిసీ ఎందుకు వాగ్దానం చేశారు? ఇదే రాజకీయ క్రీడ అంటే. వెంకయ్య నాయుడు అయితే ఎదో ఆంధ్రావాడు కాబట్టి ఆవేశంతో మాట్లాడాడని అనుకోవచ్చు . అరుణ్ జైట్లీ ప్రతిపక్ష నాయకుడుగా ఎందుకు ఈ హామీలో భాగమయ్యాడు. అరుణ్ జైట్లీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఏ ప్రాతిపదికన ఇవ్వాలో , మిగతా రాష్ట్రాలకు ఇవ్వకుండా ఆంధ్ర ప్రదేశ్ కి ఇవ్వాలంటే ఎంత ఇబ్బందో తెలియదంటే నమ్మలేము. అందుకే ఇది కాంగ్రెస్, బిజెపి కలిసి ఆడిన నాటకంగా అభివర్ణించొచ్చు. ఇందులో మోడీ పాత్ర ఆ రోజుకి లేదనే చెప్పాలి. అప్పటికి మోడీ గుజరాత్ కే పరిమితం. కానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇద్దరి భాగస్వామ్యం తోనే కాంగ్రెస్ ఈ నాటకానికి తెరలేపింది.ఇదీ దీని వెనక చరిత్ర. ఇప్పుడు అరిచి గీ పెట్టుకున్నా ఒడిశా, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ లాంటి అతి పేద రాష్ట్రాలకు ఇవ్వకుండా మనకు వచ్చే అవకాశాలు లేవు.

ఇకపోతే దీనివలన వచ్చే ప్రయోజనాలేంటి? ఎవరూ మేధావులతో సహా ఆంధ్రకు ఇది లేకపోతే భవిష్యత్తు అంధకారబంధురమని చెప్పటంలేదు. కేంద్ర ప్రభుత్వం లెక్కగట్టి ఈ అయిదు సంవత్సరాలకు గాను ఈ హోదా వలన 16447 కోట్ల రూపాయలుగా తేల్చారు. అది తప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు. ప్రత్యేక హోదా వస్తే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 60 శాతం గ్రాంట్ బదులు 90 శాతం గ్రాంట్ వస్తుంది కాబట్టి ఆ 30 శాతం అదనపు గ్రాంట్ ని లెక్కకట్టి 16447 కోట్లగా తేల్చారు. ఇదిపోతే ఇదిమిద్దంగా ఇదీ అదనపు ప్రయోజనమని ఎవరూ చెప్పటం లేదు. కాకపోతే ఇది ఇచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమల స్థాపనలో పన్ను రాయతీలు ఇవ్వటం జరిగింది. కానీ దానికోసం ప్రత్యేక జీవో ద్వారానే ఇచ్చారు తప్పితే ఎక్కడా ప్రత్యేక హోదా ఉండటం వలన ఇచ్చినట్లు చెప్పలేదు. పన్ను రాయతీలు ఇవ్వాలనుకుంటే ప్రత్యేక హోదా లేకపోయినా ఇవ్వొచ్చు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి?

ప్రజల్లో సెంటిమెంట్ బలంగా వుంది కాబట్టి దానికోసం కేంద్రం తో ఘర్షణ వైఖరితోనే ఉందామా? లేకపోతే వేరే ప్రత్యామ్నాయమేమన్నాఉందా? ఇది చాల సున్నితమైన సమస్యే. మే 23 తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా విషయమిది. ఇంతకు మించి అద్భుతాలు ఏమీ జరగవు. ఇప్పుడు చేయాల్సిందల్లా ఆవేశాలు కావేశాలకు పోకుండా మన రాష్ట్ర ప్రయోజనాల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకోవాలి. దీని ద్వారా వచ్చే ప్రయోజం పరిమితమైనప్పుడు , ఎంత అరిచిగీ పెట్టినా రాదని తెలిసినప్పుడు ముందుగా ఆ 16447 కోట్ల రూపాయలు తీసుకుంటే ఆ మేరకు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది కదా. ప్రస్తుతం బీహార్ ఏం చేస్తుంది. విభజన సందర్భం లో వచ్చిన కేంద్ర సహాయం తీసుకొని ఈ రోజుకీ ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతూనే వుంది. తమిళనాడు లో రాష్ట్రం లో ఏ పార్టీ అధికారం లో వున్నా కేంద్రం తో సఖ్యతగా ఉండి అధిక నిధులు పొందటం అందరికీ తెలిసిందే. మరి మనమూ ఆ దోవలో పోలేమా ,అదీ అంతకన్నా వేరే దారి లేదని తెలిసినప్పుడు. ఈ ఆచరణాత్మక వైఖరి తీసుకోవాలన్నా ధైర్యం కావాలి. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాల కోసం ప్రజల సెంటిమెంట్ కి ఎదురొడ్డి నిలబడి ఆచరణాత్మక వైఖరి తీసుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. విభజన చట్టం లో అమలుచేయాల్సిన అంశాలు ఎన్నో వున్నాయి. అవి ఘర్షణ తో సాధించుకోలేనప్పుడు మిత్ర వైఖరితో సాధించుకోవడానికి ప్రయత్నం చేయటంలో తప్పేమీలేదు. ఎందుకంటే ఇందులో వ్యక్తిగత స్వార్ధం కన్నా రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడివున్నాయి కాబట్టి. ఈ దిశగా ఆలోచిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందేమో ?

more updates »