సాధ్వి ప్రజ్ఞ మోడీ కి గుదిబండ లా తయారయ్యింది

సాధ్వి ప్రజ్ఞ మోడీ కి గుదిబండ లా తయారయ్యింది

సాధ్వి ప్రజ్ఞ ఠాకూర్ మోడీ కి గుదిబండలా తయారయ్యింది. అదేదో దిగ్విజయ సింగ్ ని దెబ్బతీయాలని హిందూ తీవ్రవాదిగా ముద్రపడిన సాధ్విని అభ్యర్థిగా నిలబెట్టి తప్పుచేసామా అని నాయకత్వం ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆవిడ మాట్లాడే ప్రతి మాటా బీజేపీ కి ఇబ్బందిగా మారుతుంది. అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీడియా తో మాట్లాడుతూ హేమంత్ కర్కరే కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖలు పెద్ద దుమారాన్నే లేపాయి. అప్పటికి ఇంకా మహారాష్ట్ర ఎన్నికలు పూర్తికాలేదు. బీజేపీ హడావిడిగా డామేజ్ కంట్రోల్ పని చేయాల్సి వచ్చింది. ఈ లోపల ఎంత డామేజ్ జరిగిందో తెలియదు. ఇవ్వాళ అంతకన్నా పెద్ద దుమారాన్నే సాధ్వి ప్రజ్ఞ లేపింది. విలేఖరులు కమల్ హస్సన్ నాథురాం గోడ్సే పై చేసిన వ్యాఖలపై సాధ్విని అభిప్రాయం చెప్పమని అడగగా నాథురాం గోడ్సే దేశభక్తుడని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్య బీజేపీ ని బాగా ఇబ్బంది పెట్టింది. ఒకవైపు బీజేపీ, మోడీ గాంధీజి ని ఆదర్శంగా ప్రచారం చేస్తుంటే ఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షానికి పెద్ద అస్త్రం అందించినట్లయ్యింది. చివరకు సాధ్వి ప్రజ్ఞ తో క్షమాపణ చెప్పించినా ఈ వ్యాఖ్యలవలన 19 వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎంత మేరకు బీజేపీ కి నష్టం జరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ కి మణి శంకర్ అయ్యర్, సామ్ పాట్రోడా లాగా బీజేపీ కి సాధ్వి ప్రజ్ఞ తయారయ్యింది.

ఇది ఎక్కడిదాకా దారితీస్తుందో తెలియదు. అసలు బీజేపీ సాధ్వి కి టిక్కెట్టు ఇవ్వటం పెద్ద తప్పిదం. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి కి టిక్కెట్టు కేటాయించటం బీజేపీ కి అప్రతిష్టగా మారుతుందని అదివరకే చెప్పాము. అది ఇప్పుడు రుజువయ్యింది. అవకాశవాద రాజకీయాలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఇద్దరూ చేస్తున్నాయనటానికి ఇదే నిదర్శనం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎంతోప్రచారం చేస్తున్నప్పుడు కోర్టులో కేసులు ఎత్తివేయకుండా అభ్యర్థిత్వం ఇవ్వటం ఉగ్రవాద ప్రచారాన్ని నీరుగార్చినట్లయ్యింది. ఇది మోడీ ప్రతిష్టకి దెబ్బగానే భావించాలి.

రేపొద్దున సాధ్వి ఎన్నికల్లో గెలిస్తే తర్వాత తన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకవేళ కోర్టు కేసుల్లో ఆమెకు చుక్కెదురయితే మోడీ, బీజేపీ ఏమి సమాధానం చెబుతారు? ఒక సీటు కోసం ఇంత తెగింపు అవసరమా? అసలు ఈ వ్యూహ కర్త ఎవరు? అమిత్ షా నా? ఇంకెవరైనా ఉన్నారా? ఎన్నికలైన తర్వాత ఈ విషయం పెద్ద వివాదాస్పదమవుతుందని పరిశీలకులు అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ తలనొప్పిపై గుసగుసలు మొదలయ్యాయి. బీజేపీ కి, మోడీ కి ముందు ముందు ఈ సమస్య గుదిబండలా మారబోతుందని అనుకుంటున్నారు.

more updates »