సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచే జనసేన పోటీ..!?

సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచే జనసేన పోటీ..!?

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైంది జనసేన పార్టీ.. జనసేన నుంచి బరిలోకి దిగేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో బెటర్ అభ్యర్థిని ఎంపికచేసే ప్రక్రియను కూడా పార్టీ స్ర్కీనింగ్ కమిటీ ప్రారంభించింది. అయితే, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సుదీర్ఘ కాలం రాజకీయాలు చేయడానికే తాను వచ్చానని ప్రకటించిన జనసేనాని స్క్రీనింగ్ కమిటీ ఏ నియోజకవర్గం అప్పగిస్తుందనే చర్చ సాగుతోంది. అయితే, జనసేన స్క్రీనింగ్ కమిటీకి తొలి దరఖాస్తు సమర్పించిన పార్టీ చీఫ్.. ఉత్తరాంధ్ర నుంచే బరిలోకి దిగే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర - తూర్పుగోదావరి జిల్లాలపై ప్రభావం ఉండే నియోజకవర్గాన్ని ఎంచుకునే దిశగా జనసేనాని ఆలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గాజువాక లేదా తూర్పుగోదావరి జిల్లాలోని ఒక సీటు నుంచి జనసేనాని బరిలోకి దిగుతారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది. అయితే, గాజువాక నుంచి పోటీకే స్క్రీనింగ్ కమిటీ మొగ్గు చూపుతోందన్న సమాచారం ఉంది. రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంతో పార్టీ అధినేతను అక్కడి నుంచే పోటీకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పోటీచేసే సీటుపై వారం రోజుల్లోగా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

more updates »