సుప్రీం తీర్పుని అందరం గౌరవిద్దాం

సుప్రీం తీర్పుని అందరం గౌరవిద్దాం

ఈ రోజు చరిత్రలో మరిచిపోలేనిది . ఎన్నో ఏళ్ల నుంచి తెగని రామ జన్మభూమి సమస్య ఒక కొలిక్కి వచ్చింది. సుప్రీమ్ కోర్టు ఏకగ్రీవంగా తీర్పు ఇవ్వటం ఓ మైలురాయి. ఇప్పటివరకు ఎడతెగని వివాదాలకు సుప్రీం కోర్టు ముగింపు పలికింది. పలకటమే కాకుండా ఎన్నో వివాదాత్మక అంశాలపై వివరణ ఇచ్చింది. ఇక ఈ వివాదానికి స్వస్తి పలికి దేశ నిర్మాణం పై దృష్టి సారించాలి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని అందరం ముక్తకంఠంతో ఆహ్వానిద్దాం. తీర్పుకు ముందు అందరూ తీర్పు ఎలా వచ్చినా సమర్థిస్తామని చెప్పటం జరిగింది. అందరూ దీనికి కట్టుబడి ఉంటారని ఆశిద్దాం.

ఇందులో ఒకరికి గెలుపు, మరొకరికి ఓటమి గా ఎవరూ భావించవద్దు. ఉన్నదాంట్లో ఇరుపక్షాలకు న్యాయం చేసినట్లుగా వుంది. వివాదాస్పద స్థలం రామాలయ నిర్మాణం కోసం కేటాయించినా ఏ ఒక్క సంస్థకో ఆ బాధ్యత అప్పగించకుండా ప్రభుత్వమే ఓ ట్రస్టు ని స్థాపించమని ఆదేశించటం విజ్ఞత తో కూడుకున్న నిర్ణయం. అలాగే భూమి యాజమాన్య హక్కులు నిరూపించలేకపోయినా ఇన్నాళ్లు ఆ భవనం తన స్వాధీనంలోనే ఉండటం, దాన్ని చట్ట విరుద్ధంగా పడగొట్టటం వలన సున్నీ వక్ఫ్ బోర్డు కి ప్రత్యామ్నాయంగా 5 ఎకరాలు కేటాయించటం కూడా తీర్పులోని సమతుల్యతను తెలియ జేస్తుంది. అదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చిన వ్యక్తులపై వున్న క్రిమినల్ కేసులు ఏమవుతాయో తెలియటంలేదు. ఈ తీర్పు నేపధ్యం లో ఈ కేసులు తీవ్రతను కోల్పోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

అయోధ్య వివాదం ఇప్పడిది కాదు. రాముడు హిందూ సమాజం లో అత్యంత ఆదర్శప్రాయమైన వ్యక్తి. ఆ నాటి సమాజం లోని విలువలకు ప్రతీక. తను పాటించిన విలువలు ఈ రోజుకీ ఎంతో ఉదాత్తంగా వున్నాయి. ఒక పురుషుడు, ఒక స్త్రీ తోటే వివాహబంధం నెరపాలని ఈనాటి ఆధునిక సమాజం పాటిస్తున్న విలువను ఎన్నో ఏళ్ల కిందటే రాముడు పాటించాడు. మాట కోసం, తండ్రి ఆజ్ఞ లు జవదాటని కొడుకుగా తాను పాటించిన విలువలు ఎన్నో శతాబ్దాలనుంచి ప్రజలకు ఆదర్శం అయ్యాయి. అటువంటి రాముడు జన్మించిన స్థలంగా హిందువులందరూ భావిస్తున్న స్థలంగా కాబట్టే ఇంత వివాదం చెలరేగుతుంది. వాస్తవానికి చరిత్రలో హిందూ దేవాలయాలు కూలగొట్టి ఎన్నో వేల మసీదుల నిర్మాణం జరిగింది. కానీ ఆ చరిత్రని చెరిపేసే ప్రయత్నంగా దీన్ని చూడకూడదు. ఎందుకంటే రామజన్మభూమిని అతి పవిత్రంగా హిందువులు భావిస్తున్నారు కాబట్టే ఈ వివాదం . మొత్తం మీద ఈ వివాదాన్ని ఇంతటితో ముగించి మత సామరస్యాన్ని కాపాడుకోవటం మనందరి కర్తవ్యం . దీన్ని మరింత వివాదం చేసుకోకుండా ఉంటే సమాజానికి మంచిది.

ఇప్పుడే మాట్లాడుతున్న ఒవైస్సీ ధోరణి చూస్తే ఇందుకు భిన్నంగా , రెచ్చగొట్టే పద్ధతుల్లో వుంది. అటువంటివి కొద్దిరోజులు ప్రసారం చేయకుండా ఉంటే మంచిది. తీర్పు రాకముందువరకూ తీర్పు ఎలా వచ్చినా గౌరవిద్దామని మాట్లాడిన ఒవైసి ఇలా రెచ్చ్చగొట్టే ధోరణి లో మాట్లాడటం ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రసార సాధనాలు కొద్ది రోజులు స్వీయ నియంత్రణ పాటించటం మంచిది. ఇటువంటి ప్రకటనల వల్ల ఆ సమాజానికి మేలు కన్నా కీడే జరుగుతుంది. అందరం కొద్దిరోజులు ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలను విస్మరిస్తే మంచిది. దీనికి విరుగుడుగా మరిన్ని ప్రకటనలు వస్తే సమాజ విభజనకే దోహదపడుతుంది కాబట్టి వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లటమే ఉత్తమం . ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.

more updates »