తెలంగాణలో ప్రాణాలు తీసుకున్న మరో ఇంటర్ అమ్మాయి

తెలంగాణలో ప్రాణాలు తీసుకున్న మరో ఇంటర్ అమ్మాయి

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకం కారణంగా మరో విద్యాకుసుమం రాలిపోయింది. మంచి మార్కులు వస్తాయని గంపెడాశలు పెట్టుకోగా ఏకంగా ఫెయిల్ కావడంతో బాలిక ప్రాణాలు తీసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని జూలూరుపాడు మండలం వెంగన్నపాలెనికి చెందిన మానస ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. పరీక్షలు బాగా రాశాననీ, ఉన్నత చదువులకు వెళ్లాలని ఆమె భావించింది. అయితే ఇంటర్ బోర్డు-గ్లోబరీనా సంస్థలు ఫలితాల ప్రకటనలో జరిగిన అవకతవకల కారణంగా మానస ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో తేలింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యువతి పొలానికి కొట్టేందుకు తెచ్చిన పురుగుల మందు తాగింది.

దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు మానసను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ యువతి ఈరోజు ప్రాణాలు కోల్పోయింది.

దీంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మానస మరణంతో ఇప్పటివరకూ తెలంగాణలో చనిపోయిన ఇంటర్ విద్యార్థుల సంఖ్య 27కు చేరుకుంది.

more updates »