తీరం దాటిన ‘ఫణి’ తుఫాన్

తీరం దాటిన ‘ఫణి’ తుఫాన్

శ్రీకాకుళం: ప్రచండ తుపాను ఫొని తీరం దాటింది. పూరీకి దక్షిణంగా బాలూగాంవ్, రాంబా సమీపంలో ఇది తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఉదయం 8 గంటలకు తీరాన్ని తాకిన తుపాను 10 గంటల సమయానికి పూర్తిగా తీరాన్ని దాటి భూభాగంపైకి వచ్చేసింది. భూభాగంపైకి వచ్చే సమయంలో తుపాను వెంబడి ప్రచండవేగంతో గాలులు, వర్షాలు పూరీ తీరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు గాలుల వేగం 200 కిలోమీటర్ల పైగా ఉన్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) స్పష్టం చేసింది. అతి తీవ్ర తుపానుగా బలహీన పడి బెంగాల్‌ వైపు పయనించనుంది. అనంతరం కోల్‌కతాను దాటి బంగ్లాదేశ్‌ వెళ్లే అవకాశం ఉంది.

తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం జిల్లా తీవ్రంగా ప్రభావితం అయ్యింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళంలోని కంచిలిలో 19.7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణశాఖ వెల్లడించింది. తీర ప్రాంతంలో దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినట్టు ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది. ఉత్తరాంధ్రలోని దాదాపు 8 లక్షల 53 వేల మందికి పైగా స్థానిక ప్రజలకు తుపాను హెచ్చరికలను తెలియజేసినట్టు ఆర్టీజీఎస్ వెల్లడించింది. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా తుపాను నష్టం కొంతమేర తగ్గించగలిగామని అంచనా వేస్తున్నారు. పెనుగాలుల కారణంగా శ్రీకాకుళం జిల్లాల్లోని చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకూలాయి. రహదారులపై ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు మృతి చెందినట్టు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రచండ తుపాను ఫొని పూరి తీరాన్ని తాకటంతో కోస్తాంధ్రకు తుపాను ముప్పు తప్పినట్టేనని అధికారులు స్పష్టం చేశారు. ఒడిశాలోని పూరీ, ఖుర్దా, జగత్ సింగ్ పూర్ తదితర తీరప్రాంత జిల్లాల్లో తుపాను భీభత్సం సృష్టిస్తోంది. తుపాను తీరం దాటిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ స్పష్టం చేస్తోంది.

more updates »