తెలంగాణ ఆర్టీసీ పై ఇదే ఫైనల్: కెసిఆర్

తెలంగాణ ఆర్టీసీ పై ఇదే ఫైనల్: కెసిఆర్

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను పూర్తిస్థాయిలో నడపాలని అధికారులను ఆదేశించారు. కండక్టర్లు, డ్రైవర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని.. అద్దె బస్సులకు త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం సూచించారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి విధుల్లోకి తీసుకునేది లేదని మరోసారి స్పష్టం చేశారు. సమ్మె చేస్తున్న వారితో ఇకపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమ్మెకు దూరంగా ఉన్నవారికే సెప్టెంబర్‌ నెల జీతాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావద్దనే ఉద్దేశంతోనే పాఠశాలలకు దసరా సెలవులు పొడిగించినట్లు తెలిపారు. ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన 30 శాతం బస్సులు నడపనున్నట్లు కేసీఆర్‌ వివరించారు. 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్‌ పర్మిట్లు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.

ఆర్టీసీ బస్సులను నడిపేందుకు విశ్రాంత ఆర్టీసీ, పోలీసుశాఖ డ్రైవర్లను తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మూడు రోజుల్లోగా బస్సులన్నీ పూర్తి స్థాయిలో నడిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూనియన్‌ నాయకుల మాటలు నమ్మి కార్మికులే ఉద్యోగాలు పొగొట్టుకున్నారు తప్ప ప్రభుత్వం ఎవరినీ తొలగించలేదని పేర్కొన్నారు. రైల్వే, విమానయాన సంస్థలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ సూపర్‌వైజర్లను సమ్మెలోకి దింపి... యూనియన్‌ నాయకులు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. యూనియన్‌ నాయకులే...48 వేల మంది కార్మికుల ఉద్యోగాలు పోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగవేళ ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్టపరిచిన కార్మికులను ఎట్టిపరిస్థితుల్లో క్షమించేది లేదన్నారు. సమ్మెను ఉద్ధృతం చేస్తామన్న కార్మిక సంఘాల బెదిరింపులకు ప్రభుత్వం భయపడేది లేదని సీఎం మరోసారి స్పష్టం చేశారు.

more updates »