టిఎస్ఆర్టీసీ కార్మిక సమ్మె లోతుపాతులు

టిఎస్ఆర్టీసీ కార్మిక సమ్మె లోతుపాతులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తారా స్థాయికి చేరింది. ఇరువైపులా రాజీలేని వైఖరిని తీసుకున్నారు. ఇటీవల చరిత్రలో ఇటువంటి సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమం మొదలయ్యిన తర్వాత ఇంతగా కత్తులు దూసుకోవటం చూడలేదు. తెలంగాణ ఉద్యమం అన్ని సెక్షన్ల కార్మికులను, ఉద్యోగులను కూడా కదిలించింది. అందుకనే కార్మికులు కూడా ఇది మా ప్రభుత్వమని ఫీల్ అయ్యారు. అందులోభాగంగానే తెలంగాణ ఆర్టీసీ లో కూడా తెరాస కార్మిక విభాగం ఆవిర్భవించటమే కాకుండా కొన్నాళ్ళు హరీశ్ రావు నాయకత్వం వహించాడు కూడా. గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ఆసంఘాన్ని అక్కున చేర్చుకోవటం కూడా జరిగింది. అంత సంబంధ బాంధవ్యాలున్న కార్మికులు, ప్రభుత్వం కత్తులు నూరుకునేకాడికి ఎందుకు వచ్చింది?

దీనికి ప్రధానంగా పొరుగు తెలుగు రాష్ట్రంలో జరిగిన పరిణామాలే కారణం. ఆంధ్రాలో జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈ చిచ్చుకు కారణమయ్యింది. ఇది ఇంతవరకు భారత దేశంలోనే ఈ పనిచేసిన మొట్టమొదటి ప్రభుత్వంగా రికార్డుల కెక్కింది. అయితే ఆ నిర్ణయం ఎంతవరకు సబబు అనేది కాలమే నిర్ణయించాల్సి వుంది. అది ఆర్థికపరంగా సరైన నిర్ణయమా కాదా అనేది పక్కన పెడితే జగన్ మోహన రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చాడు, అమలుచేసాడు . ఆ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు రేపింది. అదే కార్మిక నాయకుల మీద ఒత్తిడి తెచ్చింది. పక్క రాష్ట్రం, అదీ నిన్న మొన్నటివరకు కలిసి వున్న కార్మికులు ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారటం తో మాకూ అదే హోదా ఎందుకు రాదనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తింది. కార్మిక నాయకులు సభ్యుల మనోభావాల్ని కాదనలేని పరిస్థితి. దీనితో ఉద్యమం మొదలయ్యింది. ఇందులో రకరకాల సంఘాలు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది నిర్వివాదాంశం. అయితే వీటన్నింటికి ప్రధాన భూమిక కార్మికుల్లో తాము కూడా పక్క రాష్టం లోని ఆర్టీసీ సోదరుల్లాగా ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలనే బలమైన కోరిక. ఈ సెంటిమెంటుని ఏ కార్మిక సంఘ మన్నా కాదంటే కార్మికులనుంచి దూరమవుతామనే భావన ఉండటం. అసలు ఈ సెంటుమెంటునుంచి ఏ కార్మికసంఘమూ దూరంకావాలని కోరుకోదుకూడా . ఎందుకంటే పక్క రాష్ట్రంలో సాధ్యమయినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనే ఆలోచన రావటం సహజమే.

ఇంతవరకు కార్మికుల, కార్మిక సంఘాల ఆలోచనల్ని తప్పుపట్టటానికి ఏమీ లేదు. ఈ లక్ష్యాన్ని సాధించటం కోసం ఐక్య సంఘటన ని కూడా ఏర్పాటుచేసుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడాలి. ఇక్కడనుంచీ పరిస్థితులు కార్మికులనుండి కార్మిక సంఘాల నాయకుల చేతుల్లోకి వెళ్లాయి. ఇదికూడా సహజంగా జరిగే పరిణామమే. ఇక్కడనుంచే అసలు వ్యవహారం మొదలవుతుంది. నాయకుల పరిణితి మీద ఉద్యమ స్వరూపం ఆధారపడివుంటుంది. బలమైన కోరిక ఉంటేనే సరిపోదు దానిని సాధించటానికి అనుసరించాల్సిన ఎత్తుగడలు, అసలు లక్ష్య సాధనపై అంచనాలు ఇవన్నీ నాయకుల సామర్ధ్యానికి పరీక్ష. అదే సభ్యులకి, నాయకులకి మధ్య తేడా. అక్కడే నాయకత్వ సామర్ధ్యం బయటపడుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం.

ఇప్పుడు ప్రభుత్వానికి కార్మిక నాయకులకి మధ్య వచ్చిన పేచీ అల్లా ఒకే ఒక విషయం మీద. అది ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయటంపై. ఇది ఓ విధానపరమైన నిర్ణయం. ఆంధ్ర ప్రభుత్వం చేసింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేయాలని చెప్పలేము. ఇక్కడున్న ముఖ్యమంత్రి ఆలోచనలమేరకు ఇది ఆధారపడివుంటుంది. కార్మికసంఘాలు పట్టుబట్టటంలో తప్పులేదు. పక్క రాష్ట్రంలో చేశారుకాబట్టి ఇక్కడ చేయమని అడగటం వరకు బాగానే వుంది. కాకపోతే అవతలి వ్యక్తి ఆలోచనల్ని అంచనా వేసుకోకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటం లో వున్న సాధకబాధకాలు నాయకత్వానికి స్పష్టమైన అంచనా ఉండాలి. ఆర్టీసీ కి ఇవ్వాల్సిన బకాయిలు ప్రభుత్వం ఇవ్వటంలేదనే వరకు ప్రజలు కార్మికులకి మద్దత్తిస్తారు. కానీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే విధానపరమైన డిమాండుకు ప్రజల మద్దత్తు కూడబెట్టటానికి ఎంతో కష్టపడాలి. ఎందుకంటే మొదటి వాదనలో కార్మికులవైపు బలమైన సాక్ష్యాలున్నాయి. కానీ రెండో వాదనలో అంటే విలీనం విషయంలో వాదన కొంత బలహీనంగా వుంది. దాన్ని అంచనా వేసుకోకుండా తెగినదాకా లాగటం కొంత దుస్సాహసమేమో ఆలోచించాల్సిన అవసరం ఎంతయినా వుంది.

ఇందులో ఇరువైపులా రాజకీయాకారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సివుంది. కెసిఆర్ వ్యక్తిగతంగా ఓ దొర మనస్తత్వం కలవాడు. తనమాటే చెల్లాలనే నియంతృత్వపోకడలు ఎక్కువగా వున్న వ్యక్తి. కొన్ని సందర్భాల్లో ఆ మనస్తత్వం తెలంగాణకు మేలుచేసినా అన్ని సందర్భాల్లో అది కుదరదు. ఇక్కడ విలీనంపై తనకు గట్టి అభిప్రాయాలు వున్నాయి. విలీనం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదనే అభిప్రాయం వున్నప్పుడు , అదీ తనలాంటి గట్టి నాయకత్వం వున్నప్పుడు ఎంత ఒత్తిడితీసుకొచ్చినా ప్రయోజనం ఉండదు. ఇది కార్మిక సంఘాల నాయకులు అంచనా వేయాల్సి వుంది. రెండోవైపు దీన్ని అవకాశంగా తీసుకొని కెసిఆర్ ని దెబ్బతీయాలనే వ్యక్తులు, పార్టీలు అనుసరిస్తున్న ఎత్తుగడలూ , పత్రికా ప్రకటనలూ ఏ విధంగానూ కార్మికులకు మేలుచేయవు. బలహీన నాయకత్వం వున్నప్పుడు ఆ మద్దత్తు ఉపయోగపడుతుందేమోకానీ ఈ నాయకత్వం దగ్గర కుదరదు. ఈ రాజకీయ పార్టీల ఉచ్చులో కార్మిక నాయకులు పడితే నష్టపోయేది కార్మికులేగానీ రాజకీయనాయకులు కాదు. అందునా ఇప్పట్లో ప్రభుత్వం మారే అవకాశం కూడా లేదు. రెండోది, పండగ సందర్భముగా ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడితే దిగివస్తుందని అనుకోవటం కూడా అంచనాలో ఎక్కడో లోపముంది. ప్రభుత్వం సంగతేమోగానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి వ్యతిరేకతను కార్మికులు మూట కట్టుకున్నారని అర్థంచేసుకోవాలి. ప్రజల మద్దత్తు లేనిదే ఈ సమస్య పరిష్కారం కావటం కష్టం. ఈ విషయంలో కూడా నాయకత్వం తప్పుడు అంచనాలతో ముందుకెళ్లిందని చెప్పకతప్పదు. ఇక కెసిఆర్ కార్మికుల నందరిని ఉద్యోగాల్లోనుంచి తీసేసాననటం హాస్యాస్పదం. దేశంలో కార్మిక చట్టాలు వున్నాయి. ఇది ఆయన ఏమనుకుంటే అది అమలుజరిగే నియంతృత్వ వ్యవస్థకాదని గుర్తుంచుకోవాలి. కొత్తగా ముందే యూనియన్ లో చేరమని బాండు రాయించుకొని చేర్చుకుంటామని చెప్పటం ఆయనకు రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకంలేదని చెప్పాల్సివుంటుంది.

ఇద్దరూ తెగిందాకా లాగకుండా పరిష్కారమార్గం వెదకాల్సిన అవసరం ఎంతయినా వుంది. కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మంచిమనసుతో మధ్యవర్తిత్వం చేయటం ముఖ్యం. దురదృష్టవశాత్తు కెసిఆర్ కి సలహా ఇవ్వదగ్గ మంత్రులెవరూ లేరు. అలాగే కార్మిక నాయకులుకూడా పట్టువిడిచి విలీనం అంశాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయటం మంచిది. ఇప్పుడు కావాల్సింది ఇద్దరికీ నచ్చచెప్పగలిగిన మధ్యవర్తి. అదే ఇరువురికీ శ్రేయస్కరం.

more updates »