'వైయస్ఆర్ కంటి వెలుగు' కార్యక్రమంలో జగన్ ఫుల్ స్పీచ్

'వైయస్ఆర్ కంటి వెలుగు' కార్యక్రమంలో జగన్ ఫుల్ స్పీచ్

వరల్డ్ సైట్ డే సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా, కొత్తూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో జగన్ మాట్లాడుతూ..తొలి దశలో అక్టోబర్ 10 నుంచి 16 వరకూ 62,469 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. స్క్రీనింగ్ చేసిన వారికి రెండో దశలో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70,41,988 మందికి విజన్ సెంటర్లలో కంటి పరీక్షలు, చికిత్సలు నిర్వహించి కళ్లజోళ్లు పంపిణీ చేస్తామన్నారు. అలాగే 2020 ఫిబ్రవరి 1 నుంచి ప్రజలందరికీ 3,4,5,6వ దశల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మూడో దశలో పూర్తిగా అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. 2022 జూన్ నెలాఖరులోపు రాష్ట్రంలో అందరికీ కంటి పరీక్షలు పూర్తి చేసి ఉచితంగా కళ్లజోళ్లు అందిస్తామన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్ని ప్రక్షాళన చేస్తామని సీఎం అన్నారు. ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రాక ముందు పరిస్థితుల్ని, ప్రస్తుత మారిన పరిస్థితుల్ని ఫొటోలు తీసి ప్రజల ముందు ఉంచుతామని జగన్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయమైన పరిస్థితి ఉందని, కనీసం జనరేటర్లు కూడా పనిచేయడం లేదన్నారు. 2020 జనవరి నుంచి అన్ని ఆస్పత్రుల్లో రీవాంప్, మరమ్మతులు చేసి ఆధునీకరిస్తామన్నారు. 2022 జూన్‌లోపు పరిస్థితులను మారుస్తామన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.650 కోట్లు బకాయి పడిందని, అందులో రూ.540 కోట్లు ఇప్పటికే చెల్లించామని, మిగతావి కూడా చెల్లించి ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరి పోస్తామన్నారు. అలాగే 108 వాహన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో 676 మండలాల్లో 108 వాహన సేవల కోసం 432 కొత్త వాహనాలు కొనుగోలు చేస్తున్నామన్నారు. 676 మండలాల్లో 104 వాహనాలు కొనుగోలు చేస్తామని, మొత్తం 1100 వాహనాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని, 2020 మార్చి 1 నాటికి అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి అన్నారు. పలాస, మార్కాపురంలో కిడ్నీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, మార్కాపురం, పిడుగురాళ్ల, ఏలూరు, పులివెందులలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో 5.40 కోట్ల జనాభాలో 2.12 కోట్ల మందికి చిన్న, పెద్దా కంటి సమస్యలున్నాయన్నారు. ఈ సమస్యను గుర్తించి రూ.5.60 కోట్లతో 6 దశల్లో ప్రతి ఇంటికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కంటి వెలుగు ద్వారా ఉచిత కంటి పరీక్షలు, గ్లకోమా, డయాబెటిస్, రెటినోపతి, నేత్ర చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేయిస్తామని, కళ్లజోళ్లు ఉచితంగా అందిస్తామన్నారు.

ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2000 రకాల వ్యాధులను చేరుస్తున్నామన్నారు. డెంగీ, మలేరియాను కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తున్నామన్నారు. రూ.1000 పైబడి ఖర్చు అయ్యే వ్యాధులకు వైద్యం అందిస్తామన్నారు. రోగుల డేటా ఎంట్రీతో ఈ ఏడాది డిసెంబర్ 1న కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తామన్నారు. 2 వేల వ్యాధులకు వర్తింపజేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి 1 నుంచి పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తామని, ఏప్రిల్ 1 నుంచి ప్రతి జిల్లాకు ఈ ప్రాజెక్టు విస్తరించి అమలు చేస్తామన్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ కింద సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు పొందేందుకు 151 ఆస్పత్రుల్ని గుర్తించామన్నారు. జనవరి 1 నుంచి డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.10 వేలు, పెరాలసిస్ తదితర నాలుగురకాల వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇస్తామన్నారు. పోస్ట్ ఆపరేటివ్ కేసులకు రోజుకు రూ.250 చొప్పున నెలపాటు ఆర్థిక సాయం ఇస్తామని, నెలకు మించితే ప్రతి నెలా రూ.5 వేలు సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు విచ్చేసిన జగన్‌ అనంత రైతాంగంపై వరాల జల్లు కురిపించారు. తాగు, సాగునీటి సమస్య లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీరుకూడా రావడం లేదన్నారు. ఈ కాలువను ఆధునీకరించి 6వేల క్యూసెక్కుల నీటిని ఇదే కాలువ గుండా ప్రవహించేలా చేస్తామన్నారు. ఇదొక్కటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4వేల క్యూసెక్కుల సామర్థ్యం కల్గిన సమాంతర కాలువ పనులు కూడా చేపడతామన్నారు. జిల్లాను దేవుడు ఆశీర్వదించాడని, పదేళ్లుగా ఎప్పుడూ నిండని విధంగా ఈసారి చెరువులు నిండాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రామచంద్రారెడ్డి, ఆళ్లనాని, శంకరనారాయణ, ఎంపీలు రంగయ్య, మాధవ్, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

more updates »