326 భారీ ఆధిక్యం లో భారత్

326 భారీ ఆధిక్యం లో భారత్

పూణే లో జరుగుతున్న రెండవ టెస్టులో టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 275 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 36/3తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సఫారీసేన 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన క్వింటన్‌ డికాక్‌ (31)తో కలిసి దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ (64; 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కానీ, వీరిద్దరినీ అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించడంతో సఫారీసేన మరోసారి కష్టాల్లో పడింది. కానీ, కేశవ్‌ మహారాజ్‌ (72; 128 బంతుల్లో 12 ఫోర్లు), ఫిలాండర్‌ (44*; 177 బంతుల్లో 6 ఫోర్లు) అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మహారాజ్‌ను అశ్విన్‌ బోల్తా కొట్టించడంతో 109 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. మూడో రోజు ఆఖరి ఓవర్లో రబాడ (2)ను కూడా అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించడంతో భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో అశ్విన్‌ (4/69), ఉమేశ్‌ యాదవ్‌ (3/37) రాణించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన భారత్‌కు.. సఫారీలపై ఇది రెండో అత్యధిక ఆధిక్యం. 2009/10లో కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో టీమ్‌ఇండియాకు లభించిన 347 పరుగులే అత్యధికం.

ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు సాధించిన భారత నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అతడి కన్నా ముందు అనిల్‌ కుంబ్లే (84), శ్రీనాథ్‌ (64), హర్భజన్‌ సింగ్ (60) ఉన్నారు.

more updates »