చెలరేగిన మిథాలీ రాజ్ దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

చెలరేగిన మిథాలీ రాజ్ దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

వడోదరలోని రిలయన్స్‌ స్టేడియంలో శుక్రవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళలు ఘన విజయం సాధించారు. దక్షిణాఫ్రికా మహిళలు నిర్ధేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 48 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. పూనమ్ రౌత్ (65), కెప్టెన్ మిథాలీ రాజ్ (66) అర్ధ సెంచరీలు చేశారు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగులుండగానే భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. కీలక సమయంలో అర్ధ సెంచరీ చేసిన పూనమ్ రౌత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకుంది.

248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ప్రియా పూనియా (20), జెమిమా రోడ్రిగ్స్ (18) 8 ఓవర్ల పాటు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. తొమ్మిదో ఓవర్లో రోడ్రిగ్స్.. 13వ ఓవర్లో పూనియా ఔట్ అవ్వడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పూనమ్ రౌత్, కెప్టెన్ మిథాలీ రాజ్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ జోడి ప్రొటీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు.

పూనమ్ నెమ్మదిగా ఆడగా.. మిథాలీ బ్యాట్ జులిపించింది. ఇద్దరూ అర్ధ సెంచరీలు చేసాక వేగం పెంచారు. ఈ జోడి 100పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. టీమిండియాను విజయానికి చేరువ చేశారు. అయితే జట్టు స్కోర్ 195 పరుగుల వద్ద మిథాలీ, 196 పరుగుల వద్ద పూనమ్ ఔట్ అయ్యారు. తానియా భాటియా (8) అండతో హర్మన్‌ప్రీత్ కౌర్ (39) జట్టును విజయ తీరాలకు చేర్చింది. అయబొంగా ఖాకా మూడు వికెట్లు తీసింది.

అంతకుముందు దక్షిణాఫ్రికా మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేశారు. ఓపెనర్లు లిజెల్ లీ (40), లారా వోల్వార్డ్ (69; 98 బంతుల్లో, 7ఫోర్లు) ఆచితూచి ఆడడంతో.. ప్రొటీస్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. 16వ ఓవర్లో పూనమ్ యాదవ్.. లీని ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచింది. అనంతరం వోల్వార్డకు త్రిష చెట్టి మంచి సహకారం అందించింది. దీంతో ప్రొటీస్ 100 పరుగుల మార్క్ చేరింది. ఈ దశలో పేసర్ శిఖా పాండే విజృంభించి వోల్వార్డ్, త్రిష (22)లను ఔట్ చేసింది.

భారత బౌలర్లను డు ప్రీజ్, లారా గూడాల్ (38) సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. గూడాల్ బౌండరీలతో చెలరేగడంతో ప్రొటీస్ 200 పరుగులు దాటింది. ఈ సమయంలో డు ప్రీజ్, లారాలను ఏక్తా బిస్త్ పెవిలియన్ చేర్చింది. ఇన్నింగ్స్ చివరలో సునే లూస్ (12), మారిజాన్ కాప్ (11) ధాటిగా ఆడడంతో దక్షిణాఫ్రికా మహిళలు 247 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శిఖా పాండే, ఏక్తా బిస్త్ తలో రెండు వికెట్లు సాధించారు.

more updates »