పాక్‌పై లంక ఘనవిజయం

పాక్‌పై లంక ఘనవిజయం

గడాఫీ స్టేడియంలో శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న చివరి టీ-20 మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ మళ్లీ పరాజయం పాలయింది. దీంతో లంక పాక్‌పై 13 పరుగులతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక పాక్ చతికిలపడిపోయింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌ను లంక 3-0తో వైట్‌వాష్ చేసింది. లాహోర్ వేదికగానే జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ లంక ఘన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. దశాబ్దంకు పైగా పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్ జరుగలేదు. భద్రతా కారణాలరీత్యా పాక్‌లో పర్యటించడానికి ఏ దేశ ఆటగాళ్లు సాహసించలేకపోయారు. లంక ప్రధాన ఆటగాళ్లు సైతం ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ఛేదనలో పాక్ 6 వికెట్లు కోల్పోయి, 134 పరుగులకే పరిమితమయింది. హరీస్ సోహైల్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టగా, లాహిరు కుమార 2, కసున్ రాజిత ఒక వికెట్ పడగొట్టారు.

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి, 147 పరుగులు చేసింది. ఒషాడ ఫెర్నాండో 48 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులతో రాణించాడు. మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో అమీర్ 3 వికెట్లు పడగొట్టగా, ఇమాద్ వాజిద్, వాహబ్ రియాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన వనిందు హసరంగ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సుదీర్ఘ కాలం తరువాత స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ పరాజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

more updates »