అవెంజర్స్‌- ఎండ్‌గేమ్‌ రివ్యూ

Article
 • చిత్రం: అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌
 • నటీనటులు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌.. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌.. మార్క్‌ రఫెలో.. క్రిస్‌ ఇవాన్స్‌.. స్కార్లెట్‌ జొహాన్సన్‌.. టామ్‌ హొలాండ్‌.. విన్‌ డీసిల్‌.. క్రిస్‌ ప్రాట్‌ తదితరులు
 • సంగీతం: అలెన్‌ సిల్వస్ట్రీ
 • సినిమాటోగ్రఫీ: ట్రెంట్‌ ఆప్లాచ్‌
 • ఎడిటింగ్‌: జెఫ్రీ ఫోర్డ్‌, మాథ్యూస్‌
 • నిర్మాత: కెవిన్‌ ఫిజీ
 • దర్శకత్వం: ఆంటోని రుస్సో.. జో రుస్సో..
 • బ్యానర్‌: మార్వెల్‌ స్టూడియోస్‌
 • విడుదల తేదీ: 26-04-2019
 • ఇప్పటివరకూ హాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌హీరో చిత్రాలు వచ్చాయి. ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న దుష్టశక్తులపై ఆ సూపర్‌ హీరోలందరూ తమదైన శైలిలో పోరాడి ప్రేక్షకులతో ఔరా! అనిపించారు. ఈ విశ్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అందుకోసం అత్యంత శక్తివంతమైన ఆరు ఇన్ఫినీటీ స్టోన్స్‌ను సంపాదిస్తాడు థానోస్‌. అతన్ని ఎదుర్కొవడానికి ‘అవెంజర్స్‌’ బృందం యత్నించి ఓడిపోతుంది. కొందరు సూపర్‌హీరోలు అదృశ్యమైపోతారు. గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దానికి కొనసాగింపుగా, అదృశ్యమైన కొందరు సూపర్‌హీరోలు ఎలా తిరిగి వచ్చారు? మిగిలిన వారితో కలిసి థానోస్‌ను ఎలా ఎదుర్కొన్నారు? అని చెప్పే చిత్రమే ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’. విడుదలకు ముందే బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  కథేంటంటే: థానోస్‌ శక్తివంతమైన ఇన్ఫినిటీ స్టోన్స్‌తో సగానికిపైగా ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. అదే సమయంలో కెప్టెన్‌ మార్వెల్‌ నెబులాను, అంతరిక్షంలో చిక్కుకుపోయిన టోనీ స్టార్క్‌ను కాపాడుతుంది. వారు భూమిపైకి చేరుకుని బ్లాక్‌విడో, హల్క్, కెప్టెన్‌ అమెరికా, రాకెట్‌, థార్‌ తదితరుల బృందాన్ని కలుస్తుంది. థానోస్‌ చేతిలో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తీసుకుని, అతని చర్యలు అడ్డుకట్టవేయాలని భావిస్తారు. థానోస్‌ దగ్గరకు వెళ్లిన అవెంజర్స్‌ ఆశ్చర్యపోతారు. ఆ స్టోన్స్‌ను ఎవరూ వాడకూడదనే ఉద్దేశంతో నాశనం చేసినట్లు చెబుతాడు. దీంతో కోపంతో థార్‌.. థానోస్‌ తలను నరికేస్తాడు. అయితే, కాలంలో ప్రయాణించి ఆ రాళ్లను సంపాదిస్తే, థానోస్‌ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకురావచ్చని అవెంజర్స్‌ భావిస్తారు. అందుకు వారు ఏడు గ్రూప్‌లుగా విడిపోతారు. మరి అలా విడిపోయిన అవెంజర్స్‌ ఆ స్టోన్స్‌ను సంపాదించారా? థానోస్‌ నాశనం చేసిన ప్రపంచాన్ని తిరిగి తీసుకొచ్చారా? తల నరికినా థానోస్‌ ఎలా బతికాడు? చివరకు అతన్ని అవెంజర్స్‌ ఎలా అంతం చేశారు? అన్నదే ‘ఎండ్‌గేమ్‌’ కథ.

  ఎలా ఉందంటే: గతేడాది విడుదలైన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’కు ఇది కొనసాగింపు అని చెప్పాలి. అందులో చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించలేదు. వాటన్నింటికీ ఇందులో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు దర్శకులు రుస్సో బ్రదర్స్‌. అందుకు తగినట్టుగానే సన్నివేశాలను రాసుకున్నారు. అదృశ్యమైన సూపర్‌హీరోలు కలవడం.. థానోస్‌ దగ్గర ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్‌ను తిరిగి సంపాదించడం ద్వారా అతని చర్యలకు అడ్డుకట్టవేయాలని చూడటం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే, ఎప్పుడైతే అతను వాటిని నాశనం చేసినట్లు చెబుతాడో.. సూపర్‌హీరోలు వాటిని ఎలా తిరిగి తెస్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. వారంతా కాలంలో ప్రయాణించి గతంలోకి వెళ్లడం, అక్కడ జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హల్క్‌, రాకెట్‌లతో నవ్వులు పంచే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. అదే సమయంలో భావోద్వేగాలకు పెద్దపీట వేశారు. సినిమా దాదాపు 3గంటల పాటు సాగుతుంది. రుస్సో బ్రదర్స్‌ తాము అనుకున్న చాలా సన్నివేశాలను అలాగే చూపించాలనుకున్నారు. అందుకే ప్రథమార్ధంలో చాలా సన్నివేశాల్లో కాస్త సాగదీత కనిపిస్తుంది. ఆయా సన్నివేశాలకు కత్తెర వేస్తే ఇంకాస్త బాగుండేది.

  ఎవరెలా చేశారంటే: ‘ఎండ్‌గేమ్‌’ లీడ్‌ రోల్స్‌ ఏవైనా ఉన్నాయాంటే వాళ్లే రాబర్ట్‌ డౌనీ జూనియర్(ఐరన్‌మ్యాన్‌), క్రిస్‌ ఇవాన్స్‌(కెప్టెన్‌ అమెరికా). సినిమాలో అత్యధిక సన్నివేశాల్లో వీరే కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత వీరి పాత్రలు కనిపించవని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీడ్కోలు చిత్రంగా చెబుతున్న ఇందులో అద్భుత నటనతో అదరగొట్టేశారు. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌(థార్‌), బెనిక్టిడ్‌ కంబర్‌ బ్యాచ్‌(డాక్టర్‌ స్ట్రేంజ్‌)లు కూడా మెప్పించారు. ఈ సినిమాలో కాస్త నవ్వులు పంచిన పాత్రలు ఏవైనా ఉన్నాయంటే అవి హల్క్‌, రాకెట్‌. ‘ఇన్ఫినిటీవార్‌’తో పోలిస్తే, జోష్‌ బ్రోలిన్‌(థానోస్‌)పాత్ర శక్తిమంతంగా లేదు. సూపర్‌ హీరోలను హైలైట్‌ చేసే ఉద్దేశంతోనే అతని పాత్రను తగ్గించి రాసినట్లు అనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బ్రీ లార్సన్‌(కెప్టెన్‌ మార్వెల్‌). కథకు బలమైన పాత్ర కూడా అదే.

  రుస్సో బ్రదర్స్‌ మరోసారి వెండితెరపై తమ స్టామినా ఏంటో చూపించారు. అయితే, ఈసారి ఎక్కువ సినిమాటిక్‌ లిబర్టీని తీసుకున్నారు. తాజా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటంతో అందుకు తగినట్టుగానే సన్నివేశాలను రాసుకున్నారు. ప్రతీ ఫ్రేమ్‌ను ఉత్సుకత కలిగించేలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠను ప్రేక్షకుడిలో కలిగించారు. అయితే, ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బాగుండేది. ఇక సంగీతం పరంగా ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాడు అలెన్‌ సిల్వస్ట్రీ. యాక్షన్‌ సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాల్లో లీనమయ్యేలా చేస్తుంది. మార్వెల్‌ సినిమా నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నాయి.

  బలాలు

 • + కథ, కథనం
 • + ఐరన్‌ మ్యాన్‌, కెప్టెన్‌ అమెరికాల నటన
 • + విజువల్‌ ఎఫెక్ట్స్‌
 • + దర్శకత్వం
 • బలహీనతలు

 • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
 • - థానోస్‌ పాత్రను బలంగా తీర్చిదిద్దకపోవడం
 • చివరిగా: ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’: ఉత్కంఠ కలిగిస్తుంది.. నవ్విస్తుంది.. భావోద్వేగాలతో ఏడిపిస్తుంది.. గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  Prev మోదీ బ‌యోపిక్‌కి క్లియ‌రెన్స్ ఇవ్వ‌ని సుప్రీం కోర్టు
  Next న‌రేంద్ర‌మోదీ చిత్రం నుండి మ‌రో ట్రైల‌ర్
   

  0 Comments

  Write a comment ...
  Post comment
  Cancel
   Please submit your comments.