'చిత్రల‌హ‌రి' రివ్యూ

'చిత్రల‌హ‌రి' రివ్యూ
 • రివ్యూ: చిత్రలహరి
 • తారాగణం: సాయితేజ్, కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు..
 • సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
 • సంగీతం: దేవిశ్రీప్రసాద్
 • కథ, మాటలు, దర్శకత్వం: కిషోర్ తిరుమల
 • కెరీర్ ఆరంభంలో మంచి విజయాలతో ఆకట్టుకున్న యువహీరో సాయిధరమ్ గత కొంతకాలంగా రేసులో వెనకబడ్డారు. వరుస పరాజయాలు పలకరించడంతో నిరుత్సాహంలో ఉన్నారు. తాజాగా ఆయన ‘చిత్రలహరి’ చిత్రంతో ప్రేక్షకులముందుకొచ్చారు. విజయం సాధించాలనే ఉద్దేశ్యంతో తనపేరును సాయితేజ్ గా మార్చుకున్నాడు. ఫీల్ ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న కిషోర్ తిరుమల నిర్ధేశక బాధ్యతలు చేపట్టడం, 80, 90దశకాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న పాటల కార్యక్రమం చిత్రలహరిని టైటిల్ పెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉత్సుకతను కలిగించింది. ఇంతకి ఈ చిత్రలహరి కథాకమామిషు ఏమిటో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

  విజయ్ (సాయితేజ్) ఇంజనీరింగ్ పూర్తిచేసి జీవితంలో స్థిరపడే ప్రయత్నాల్లో ఉంటాడు. తన ప్రతిభపై అపారమైన నమ్మకం ఉన్నప్పటికీ.. పేరులోనే విజయం తప్ప జీవితంలో విజయం లేదని ఎప్పుడూ బాధపడుతుంటాడు. కారుప్రమాదానికి గురైన వారిని రక్షించే లక్ష్యంతో ఆంబులెన్స్, పోలీస్ అలెర్ట్ చేసే ఓ అప్లికేషన్ తయారుచేస్తాడు. దానిని ఏదైనా కంపెనీ ద్వారా కార్యరూపంలోకి తీసుకురావాలని తపిస్తుంటాడు. మరోవైపు విజయ్..లహరి (కల్యాణి ప్రియదర్శన్) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలన్నది లహరి వ్యక్తిత్వం. ప్రేమలో అర్థం చేసుకునే మనసు ముఖ్యమని విజయ్ వాదిస్తుంటాడు. విజయ్ చెప్పిన అబద్ధాల కారణంగా లహరి అతన్ని విడిచి వెళ్లిపోతుంది. దీంతో ఇటు జీవితంలో, అటు కెరీర్ వైఫల్యాలతో క్రుంగిపోతుంటాడు విజయ్. చివరకు విజయ్ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? ప్రేమలో విజయతీరాన్ని చేరుకున్నాడా?విజయ్ ప్రేమకథలో స్వేచ్ఛ (నివేథా పేతురాజ్) పాత్ర ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే మిగతా చిత్ర కథ..

  జీవితంలో గొప్ప లక్ష్యాన్ని కలిగిన యువకుడు వైఫల్యాలకు క్రుంగిపోకుండా ఆత్మైస్థెర్యంతో జీవితాన్ని ఎలా జయించాడు అనే స్ఫూర్తివంతమైన అంశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కిషోర్ తిరుమల. దీనికి ఓ అందమైన ప్రేమకథను జోడించి అలరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు అంశాల మధ్య సమన్వయం కుదరక కథాగమనం కాస్త పట్టుతప్పినట్లుగా అనిపించింది. ముఖ్యంగా విజయ్, లహరి ప్రేమకథలో బలమైన ఉద్వేగాలు కనిపించలేదు. సంభాషణల మీద పెట్టిన శ్రద్ధ సన్నివేశాల రూపకల్పనలో తీసుకోలేదనిపిస్తుంది. స్వేచ్ఛ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సునీల్, వెన్నెల కిషోర్ చక్కటి కామెడీని పండించారు. వీరిద్దరి హాస్యం సినిమాకు ప్రధానబలంగా నిలిచింది.

  ప్రమాదంలో ఉన్నవారిని రక్షించడానికి విజయ్ తయారుచేసిన డివైజ్ లోపాలున్నాయని కంపెనీ వారు ప్రశ్నిస్తారు. అది తప్పని నిరూపించడానికి విజయ్ స్వయంగా కారు ప్రమాదం చేసుకోవడం ఏమాత్రం లాజిక్ అందదు. వ్యక్తిత్వ వికాస ఫిలాసఫీని విజయ్ పాత్ర ద్వారా చెప్పేందుకు ఎక్కువగా ప్రయత్నించారు. విజయ్, లహరి మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు హృద్యంగా అనిపించాయి. సంభాషణల విషయంలో దర్శకుడు కిషోర్ తిరుమల మరోమారు తన ప్రతిభను చాటుకున్నారు. ‘విజయం అంటే స్విగ్గీలో ఇచ్చిన భోజనం ఆర్డర్ కాదు గంటలో రావడానికి..దానికి ఎంతో ఓపిక ఉండాలి’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సంభాషణలపరంగా కిషోర్ తిరుమల పదును చూపించారు. విజయం కోసం కథానాయకుడు పడే సంఘర్షణ, ఈ క్రమంలో ఎదురైన సంఘటనల్ని ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. ఎక్కడా ద్వంద్వార్థాలు, అశ్లీలత లేకుండా క్లీన్ ఎంటర్ సినిమాను తీర్చిదిద్దారు. ప్రథమార్థం చక్కటి కామెడీ, లవ్ ఎమోషన్స్ ఆకట్టుకుంది. ద్వితీయార్థంలో ైక్లెమాక్స్ ఘట్టాలు హృద్యంగా అనిపించాయి.

  విజయ్ పాత్రలో సాయితేజ్ పరిణితితో కూడిన నటనను ప్రదర్శించాడు. గత చిత్రాలకు పూర్తిభిన్నంగా సెటిల్డ్ పర్ కనబరిచాడు. సంఘర్షణతో కూడిన స్ఫూర్తివంతమైన పాత్రలో మెప్పించాడు. ఇక కథానాయికలు కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ తమ పరిధుల మేరకు నటించారు. ఇద్దరి స్క్రీన్ బాగుంది. పోసాని కృష్ణమురళి, రావురమేష్, వెన్నెల కిషోర్, సునీల్ తమదైన శైలిలో మెప్పించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం బాగుంది. రెండు పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ అందంగా బంధించింది. ఉన్నతమైన నిర్మాణ విలువలతో మైత్రీమూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.

  చిత్రలహరిలో ఎన్నో భావాలు కలిసిన పాటలుంటాయి. అలాగే ఈ సినిమా కథ కూడా విభిన్న వ్యక్తుల జీవితాల కథ అని సినిమా ఆరంభంలో టైటిల్ అర్థం చెప్పారు దర్శకుడు కిషోర్ తిరుమల. ప్రేమకథకు స్ఫూర్తికలిగించే అంశాల్ని జోడించి చక్కటి పాయింట్ రాసుకున్నారు దర్శకుడు. కథ, కథనాల మీద మరింత దృష్టి పెడితే సినిమా గొప్పగా ఆవిష్కృతమయ్యేది. అయితే వినోదాన్ని మిస్ చేయకపోవడం సినిమాకు పెద్దబలంగా నిలిచింది. ఈ వేసవి సెలవులు సినిమాకు అడ్వాంటేజ్ కానున్నాయి. వినోదానికి లోటు లేకపోవడంతో సమ్మర్ రేసులో ఈ సినిమా విజేతగా నిలిచే అవకాశం ఉంది.

 • రేటింగ్: 2.75/5
 • more updates »