మంచి కథ సిద్ధం చేసిన డైరెక్టర్ నరేంద్ర...ప్రధాన పాత్రలో కీర్తిసురేష్

Article

మహానటి సావిత్రి పాత్రలో అసమాన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు కీర్తిసురేష్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నరేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం కీర్తిసురేష్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్‌రామ్ క్లాప్‌నివ్వగా, వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. హరీష్‌శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. కీర్తిసురేష్ మాట్లాడుతూ తెలుగులో మహానటి తరువాత వస్తున్న సినిమా ఇది. మహిళా ప్రధానమైన చిత్రంలో నటించడం ఆనందంగా వుంది. ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది.

అత్యధిక భాగం యుఎస్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. డైరెక్టర్ నరేంద్ర మంచి కథ సిద్ధం చేశారు. తప్పకుండా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకముంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 2016 నుంచి ఈ కథపై పనిచేస్తున్నాను. తరుణ్ నాకు సహకారం అందించారు. అన్ని కలగలిపిన కథ ఇది. ఈ కథకు కీర్తిసురేష్ మినహా ఎవరూ న్యాయం చేయలేరు. ఇరవై ఐదు శాతం ఇండియాలో...75 శాతం యుఎస్‌లో చిత్రీకరణ చేస్తాం. ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలవుతుంది. ఏప్రిల్ నుంచి యుఎస్ షెడ్యూల్ వుంటుంది అన్నారు. మహేష్ కోనేరు మాట్లాడుతూ మహానటి చిత్రంతో కీర్తిసురేష్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతి మహిళా తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే అంశం నేపథ్యంలో సాగే చిత్రమిది. మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తాం అన్నారు.

Prev రజినీకాంత్ ‘పేట’ సినిమాకు తమిళ రాకర్స్ పెద్ద షాక్
Next ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు లైన్ క్లియర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.