హెచ్‌1బీతో అమెరికా పౌరసత్వం!

Article

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ నిపుణులకు తీపి కబురు! ట్రంప్‌ వైఖరితో ఉద్యోగాల్లో కొనసాగిస్తారా, అమెరికాలో ఉండనిస్తారా అని ఆందోళన చెందుతున్న వారికి ఆయనే ఉపశమనం కలిగించే వార్త చెప్పారు. ఉద్యోగాల్లో కొనసాగడంతో పాటు... అగ్రరాజ్య పౌరసత్వాన్ని కూడా పొందడానికి మార్గం సుగమం చేసేలా హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో త్వరలోనే భారీ మార్పులు తీసుకురానున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు. అమెరికాలోని ఐటీ నిపుణుల్లో అత్యధికమంది భారతీయులే. దశాబ్ద కాలంగా వారు అక్కడే పనిచేస్తున్నా... శాశ్వత నివాసం/పౌరసత్వం లేవు. ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత తొలి రెండేళ్లలో ప్రభుత్వం వీరిపై ఆంక్షలు విధించింది. వీసా గడువు పొడిగింపును, కొత్త హెచ్‌-1బి వీసాల జారీని కఠినతరం చేసింది. అయితే... అత్యంత ప్రతిభావంతులను ప్రోత్సహించి, వారు అమెరికాలోనే ఉండేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ట్రంప్‌ కొంతకాలంగా యోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ‘ప్రతిభ ఆధార వలస విధానం (మెరిట్‌-బేస్డ్‌ ఇమిగ్రేషన్‌ సిస్టం)’ గురించి ఇటీవల ఆయన పదేపదే ప్రస్తావించారు కూడా. గత నెల చట్టసభ్యులతో సమావేశం సందర్భంగా హోంలాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ కిస్టెన్‌ నీల్సెన్‌ మాట్లాడుతూ- వర్క్‌ వీసాల నిమిత్తం విదేశాల నుంచి పరిమితికి మించి దరఖాస్తులు వస్తున్నాయని, వాటన్నింటిని నిశితంగా పరిశీలించి, అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను ఎంపిక చేసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు అత్యధిక వేతనాలతో పనిచేయదలచిన ప్రతిభావంతులకు హెచ్‌-1బి వీసాల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా పౌరసత్వ, వలస విభాగం ‘యూఎస్‌సీఐఎస్‌’ కూడా గత నవంబరులో ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే వీసా నిబంధనలను సడలించనున్నట్టు ట్రంప్‌ వెల్లడించడం విశేషం. ఆయన నిర్ణయం పట్ల పలువురు భారతీయ నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్‌ మాటలను అంత త్వరగా నమ్మలేమని, అనవసరంగా అత్యాశలు పెట్టుకోవద్దని ఒబామా హయాంలో అధికారిగా పనిచేసి, ప్రస్తుతం హెచ్‌1-బి వీసా వ్యవహారాలను చూస్తున్న లియోన్‌ ఫ్రెస్కో ట్విట్టర్‌లో స్పందించారు.

ఇక్కడే నిశ్చింతగా ఉండొచ్చు
అమెరికాలోని హెచ్‌1-బి వీసాదారులు ఇక నిశ్చింతగా ఉండొచ్చు. వారు ఉద్యోగాల్లో కొనసాగేందుకు కచ్చితమైన భరోసానిచ్చేలా సులభతర నిబంధనలు రాబోతున్నాయి. అమెరికా పౌరసత్వం పొందడానికి కూడా ఇవి దోహదపడతాయి. ప్రతిభావంతులనూ; అత్యంత సమర్థులైన నిపుణులను ప్రోత్సహించాలనుకుంటున్నాం. వారు అమెరికాలోనే తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.
- ట్విట్టర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు

Prev కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. షేర్లన్నీ ఢమాల్!
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.