తెలంగాణా సీను ఆంధ్రా లో పునరావృతం అవుతుందా?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మంచి రసకందాయం లో పడ్డాయి. తెలంగాణ ఎన్నికల్లో జరిగిన సీన్లు ఆంధ్రాలో పునరావ్రతం అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి అయిదు సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ వారసత్వం కొనసాగుతూనే వుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర నేతలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. చివరకు హైదరాబాద్ లో ఆంధ్ర నేతలు డబ్బులు పంచుతూ పట్టుబడి అభాసు పాలైన సంగతి ప్రచార సాధనాల్లో చూశాం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నీ తానై చివరి వారం రోజులు ప్రచారాన్ని దగ్గరుండి నడిపిన సంగతి చూశాం. దాని పర్యవసానం కూడా మనకు తెలిసిందే.

తిరిగి అదే సీను ఆంధ్రాలో రిపీట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల జగన్ కేటీఆర్ ములాఖత్ కావటం, కేసీఆర్ జగన్ తో ఫోన్లో మాట్లాడటం, జగన్ కేసీఆర్ ని తన గృహ ప్రవేశానికి అమరావతి కి ఆహ్వానించటం, అలాగే తలసాని యాదవ్ ఆంధ్రా కి వెళ్లి అవాకులు చవాకులు పేలటం చూస్తుంటే తెలంగాణ లో జరిగిన పరిణామాలనుంచి గుణపాఠం తీసుకున్నట్లు కనిపించటం లేదు. రెండు రాష్ట్రాలూ విడిపోయిన తర్వాత రెండూ ప్రాంతీయ పార్టీలైనప్పుడు వాటికి కొన్ని పరిమితులుంటాయన్న సంగతి మరిచి పోతున్నారు. అందునా ఇద్దరూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులైనప్పుడు, ఇంకా ఎన్నో సమస్యలు పరిష్కారం కానప్పుడు వాళ్లపై రెండో రాష్ట్రంలో వ్యతిరేక సెంటిమెంట్ ఉంటుందని ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నవాళ్లకు అర్ధమవుతుంది. రాజకీయాల్లో తలలు పండిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ సున్నితమైన విషయాన్ని అర్ధంచేసుకోలేక పోతున్నారా? కాదు. వాళ్ళ మనసంతా అవతలి వాడిని ఎలా దెబ్బతీయాలనే దాని మీదే వుంది. ఒకరిమీద ఒకరు ప్రతీకారం తీర్చుకోవాలనే కక్ష ముందు రాజకీయ పరిణితి ఓడిపోతూ వుంది.

ఈ సున్నితత్వాన్ని గ్రహించే కేసీఆర్ తెలంగాణలో ప్రచారమంతా చంద్రబాబు కి వ్యతిరేకంగా నడిపాడు. ఇది బాగా హిట్టయ్యింది కూడా. మరి ఇంత తెలిసిన కేసీఆర్ తిరిగి ఆంధ్రా లో రిటర్న్ గిఫ్ట్ పేరుతొ చంద్రబాబు నాయుడు ఫై వ్యతిరేకతతో జగన్ కి మద్దత్తిస్తే చంద్రబాబు నాయుడు అదే అస్త్రాన్ని ప్రయోగించడని ఎందుకు అనుకుంటున్నాడు? సెంటిమెంట్ ని రెచ్చగొట్టటం లో కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు ఇద్దరే. ఎవరూ పత్తిత్తులు కాదు. సంవత్సరం క్రితం సర్వేల్లో ప్రజాదరణ తగ్గిందని తెలుసుకొని చంద్రబాబు ప్రత్యేక హోదా ఫై యూ టర్న్ తీసుకున్న తర్వాత మోడీ కి వ్యతిరేకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. మొత్తం మీడియా ని కూడా ఇందుకు పూర్తిగా ఉపయోగించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ అనుభవంతో, తెలంగాణ ఎన్నికల గుణపాఠం తో ఇప్పుడు కేసీఆర్ జగన్ బాన్ హోమిని ని తారాస్థాయికి తీసుకెళ్ళటంలో, సెంటిమెంట్ ని రెచ్చగొట్టటం లో చంద్రబాబు ఆంధ్రా ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రం గా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే కేసీఆర్ గెలవటానికి చంద్రబాబు పరోక్షంగా తోడ్పడ్డాడు. ఇప్పుడు చంద్రబాబు గెలవటానికి కేసీఆర్ పరోక్షంగా తోడ్పడతాడా?

ఈ రోజుకైతే ఎన్నికల ముఖచిత్రం జగన్ కి అనుకూలం గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఒక్కసారి అయిదు సంవత్సరాలు వెనక్కెళితే 2014 ఎన్నికలకు ముందు కూడా జగన్ సర్వేల్లో చంద్రబాబు కన్నా ఆధిక్యంలో వున్నాడు. చివరలో చంద్రబాబు తెలివిగా మోడితోటి, పవన్ కళ్యాణ్ తోటి సఖ్యత నెరిపి వాళ్ళ మద్దత్తు తో అధికారం లోకి వచ్చిన సంగతి అందరికి తెలుసు. అయితే ఈసారి అటువంటి రాజకీయ పొత్తులకు అవకాశాలు తక్కువ. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కేసీఆర్ జగన్ బాన్ హోమీ లాంటి అంశాలు ఈ లోపల రెండు మూడు జరిగితే ఫలితాలు తారుమారయ్యే అవకాశముంది. ఈసారి పవన్ కళ్యాణ్ ప్రవేశం తో ముక్కోణపు పోటీ జరగబోతుంది. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మేరకు వుంటుందనే దాని ఫై ఎన్నికలు ఆధార పడి ఉంటాయి. వస్తున్న వార్తలను బట్టి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ప్రభావం గణనీయంగా ఉండబోతుందని తెలుస్తుంది. మిగతా జిల్లాల్లో జనసేన ప్రభావం ఎలావుండబోతుందనేది ఇప్పటికిప్పుడు పూర్తిగా విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారు. అంతిమంగా ఆంధ్రా ఎన్నికలు దానిమీదే ఆధారపడ్డాయి. పవన్ కళ్యాణ్ గోదావరి, విశాఖ జిల్లాల్లో చూపిన ప్రభావం మిగతా జిల్లాల్లో చూపించ గలడా అనేదే అందరి మనస్సులో నానుతున్న సమస్య. ఇంకొన్ని రోజులు పోతే కానీ ఈ విషయం ఫై స్పష్టత రాదు. ఈ లోపల జగన్ తప్పటడుగులు ఎన్ని వేస్తాడో, చంద్రబాబు వీటిని ఏ మేరకు తనకు అనుకూలంగా మలచుకుంటాడో చూడాలి.

Prev పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్తున్న కారు
Next ప్రతి మహిళను లక్షాధికారులను చేస్తాం: రోజా
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.