ప్రియాంక గాంధీ ఎంట్రీ కాంగ్రెస్ కి లాభిస్తుందా?

ప్రియాంక గాంధీ ని తెరవెనక నుంచి తెరముందుకు తీసుకొచ్చారు. ఇప్పటికే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగిపోయింది. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి ని ఎవర్ని చేయాలనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కలిసి నిర్ణయించినపుడే తెరవెనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ ఎంట్రీ ఇచ్చిందని అర్ధమయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధికారిక పదవితో తెర ముందుకి తీసుకొచ్చారు.

రామమనోహర్ లోహియా ప్రముఖ సోషలిస్ట్ సిదాంత కర్త. గొప్ప దార్శనికుడు. తను మిగతా సోషలిస్ట్ నాయకుల్లాగా ముందు మార్క్సిస్ట్ గా ఉండి తర్వాత సోషలిస్ట్ గా మారలేదు. భారతీయ సంస్కృతిని, తత్వశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి గాంధేయ సిద్ధాంతాలతో ప్రభావితమయి తర్వాత సోషలిస్ట్ గా మారిన వ్యక్తి. భారత దేశంలో సోషలిస్ట్ మేధావుల్లో ప్రజల్లో అంత ప్రభావం చూపించిన వ్యక్తి మరొకరు లేరని చెప్పొచ్చు. అంతటి మేధావి రాజకీయాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశ రాజకీయాల్లో నెహ్రూని ఓడించకుండా సిద్ధాంతపరమైన రాజకీయాలు మనజాలవని చెప్పటమే కాకుండా జీవితాంతం నెహ్రూ కుటుంబానికి వ్యతిరేకం గా పోరాడాడు. నెహ్రూ అంటే లోహియా కి వ్యక్తిగత ద్వేషం ఏమిలేదు. కాకపొతే సరైన రాజకీయాలు దేశంలో నడవాలంటే వ్యక్తిపూజనీ, కుటుంబ పరిపాలన ని ప్రోత్సహించిన నెహ్రూ వారసత్వాన్ని నిరోధించలేకపోతే ప్రజాస్వామ్య మనుగడ కష్టమని అంచనా వేసాడు. అతని అంచనా ముమ్మాటికీ నిజమని తర్వాతి రాజకీయాలు నిరూపించాయి. తన పదవికి ముప్పు వచ్చినప్పుడు ఆత్యాయిక పరిస్థితిని ఇందిరా గాంధీ విధించటం, రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజకీయాల్లో ఓనమాలు రాని సోనియా గాంధీ ని నాయకురాలిని చేయటం, రాజకీయాలు ఇష్టం లేదని చెప్పినా రాహుల్ గాంధీ నే వారసుడుగా తీసుకురావటం, 47 సంవత్సరాలు వరకు రాజకీయాల్లోకి రాని ప్రియాంక గాంధీని ఆటల్లో అందరూ ఓడిపోయింతర్వాత చివరి అస్త్రం గా ఎవరూఊహించని ప్లేయర్ని తీసుకొచ్చినట్లు తీసుకు రావటం లోహియా దార్శనికత ఎంత కరెక్ట్ గా ఉందొ అర్ధమవుతుంది.

అయితే దేశ రాజకీయాలు పెను మార్పులకు లోనైనాయని తెలుసుకోలేకపోతున్నారు. ఈ శతాబ్దపు తరం (వారినే మిల్లీనియల్స్ అంటారు) ఈ వారసత్వ రాజకీయాలను ఏవగించుకుంటున్నారని అర్ధంచేసుకుంటే మంచిది. వాళ్ళ అభిలాషలు ఒక వ్యక్తికో, సిద్ధాంతానికో కట్టుబడిలేవు. 2014 లో వీళ్లు మార్పు కోసం మోడీ కి మద్దతిచ్చారు. కానీ 2019 వచ్చేసరికి వాళ్ళు కోరుకున్న మార్పు మోడీ హయం లో జరగలేదని నిస్పృహలో వున్నారు. అంతమాత్రాన తిరిగి వారసత్వ రాజకీయాలకు, కుటుంబ బానిసత్వానికి జై కొడతారని అనుకోలేం. సరైన ప్రత్యామ్నాయం లేనప్పుడు ఈ శతాబ్దపు తరం ఎటైనా వెళ్లొచ్చు. అమెరికాలో , యూరప్ లో అదే జరిగింది. అటు పూర్తి మితవాదానికి, ఇటు పూర్తి అతివాదానికి పెద్ద సంఖ్యలో మొగ్గుచూపారు. అంతేగాని పాత చింతకాయ పచ్చడి లాగా తిరిగి అపఖ్యాతి పొందిన కుటుంబ రాజకీయాల వైపు వెళ్ళరు. సరైన ప్రత్యామ్నాయం లేనప్పుడు ఈసారికి విముఖంగానైనా ఎంతో కొంత బెటర్ అని మోడీ వైపు మొగ్గే అవకాశాలూ వున్నాయి

.

ఈ శతాబ్దపు తరం సంగతి పక్కన వుంచితే 2014 నుంచి 2019 కి బీజేపీ తన సంప్రదాయ ఓటుని నిలబెట్టుకోవటమే కాకుండా కొత్త ప్రాంతాలకి ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతంలో విస్తరించిందని చెప్పాలి. ఆమేరకు ఈ అయిదు సంవత్సరాలలో బీజేపీ బలపడింది. అదేసమయంలో కాంగ్రెస్ ఈ అయిదు సంవత్సరాల్లో కొత్త ప్రాంతాలకు విస్తరించక పోగా తన ఓటు బ్యాంకుని పోగొట్టుకుందనే చెప్పాలి. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది కాబట్టి తిరిగి మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుందని అంచనా వేయటం తప్పిదమే అవుతుంది. ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీ కి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందని మరిచిపోవద్దు. ఆ మూడు రాష్ట్రాల్లో గత మూడు ఎన్నికల్లో ఒకే పార్టీ అధికారం లో ఉండటం వలన ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి ఎవరు ప్రత్యామ్నాయం గా ఉంటే వాళ్లకు ఓటేశారు. ఆవిధంగా కాంగ్రెస్ లాభపడిందని మరవొద్దు. అదే సీన్ మిగతా రాష్ట్రాల్లో ఏర్పడుతుందని అనుకోవటం భ్రమే. ఈ నేపధ్యం లో ప్రియాంక గాంధీ ఎంట్రీ ని పరిశీలిద్దాం.

ప్రియాంక గాంధీ ని తూర్పు ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల భాధ్యురాలిగా చేయటం సరైన వ్యూహమేనా? దీనివలన ఎవరికి లాభం ఎవరికి నష్టం? ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారి పరిశీలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ నాలుగో పెద్ద పార్టీ గా వుంది. అంటే ప్రధానమైన మొదటి మూడు పార్టీలను కాదని ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమేనా? ఇప్పటికే రెండు మూడు పెద్ద పార్టీ లైన సమాజ్ వాది బీఎస్పీ ఇంకో చిన్న పార్టీ రాష్ట్రీయ లోకదళ్ తో కలిసి అన్నింటికన్నా పెద్ద పార్టీ అయిన బీజేపీ కి వ్యతిరేకంగా జత కట్టాయి. ఓట్ల లెక్కలు చుస్తే ఈ రెండు కూటములు సమఉజ్జిగా ఓ విధంగా చెప్పాలంటే ఎస్పీ బీఎస్పీ కూటమి కి అధిక్యంగా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఇంత ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రియాంక గాంధీ ఎంట్రీ తో ఏ విధం గా ఈ రెండింటిని కాదని గెలవాలనుకుంటుంది? దీని పర్యవసానం ఏ మాత్రం బుర్ర పెట్టినా ప్రతిఒక్కరికి అర్ధమవుతుంది. ఒకటి , ఇదంతా ఎస్పీ బీఎస్పీ కూటమి ఫై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కూటమిలో గౌరవనీయమైన స్థానాలకు బేరసారాలకు ఉపయోగపడొచ్చు. నా అంచనా ప్రకారం ఎస్పీ ఈ విషయం లో మెత్తపడినా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏ మాత్రం సందు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆమె ప్రధానమంత్రి కావాలంటే కనీసం 30 సీట్లన్నా గెలవాలని కోరుకుంటుంది కాబట్టి. ఇకపోతే రెండోది. చివరకు మూడు కూటములయ్యి పోటీ జరిగితే ప్రియాంక గాంధీ సభలకు జనం రావచ్చు కానీ ఓట్లు రాలటం అంత తేలిక కాదు. అప్పుడు లక్ష డాలర్ల ప్రశ్నల్లా ప్రియాంక గాంధీ రంగప్రవేశం వలన ప్రధాన ప్రత్యర్థుల్లో ఏకూటమికి ఎక్కువ నష్టం జరుగుతుందనేదే. ఇది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా కులాలమీద ఆధారపడి వున్నాయి కాబట్టి. అయితే కులాలకతీతంగా ప్రియాంక గాంధీ కొన్ని ఓట్లు చీల్చే అవకాశం లేకపోలేదు. అదేసమయంలో ఇవి లోక్ సభ ఎన్నికలు కాబట్టి మోడీ ప్రభావం పార్టీ మద్దతు కన్నా కొంత అధికంగా వుండే అవకాశం వుంది. దానితో పాటు బీజేపీ అతి పెద్ద పార్టీ. సాధారణంగా ముక్కోణపు పోటీలో అతి పెద్ద పార్టీ కి లాభిస్తుంది. అలాకాకుండా జరగాలంటే పెద్దఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఉండాలి. ఇంకొన్నిరోజులు పొతే గాని ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు.

అసలు ప్రియాంక గాంధీ ని ఒక ప్రాంతానికి పరిమితం చేయటం వ్యూహాత్మకంగా కరెక్టా ? ప్రియాంక గాంధీ అంటే క్రేజ్ ఉంటే మొత్తం దేశంలో ఉండాలి. కాంగ్రెస్ కి గెలుపు గుర్రాలు ఎక్కడున్నాయో అక్కడంతా ఆమె చేత ప్రచారం చేయిస్తే కొంత లాభముండే అవకాశం ఉండొచ్చు. కేవలం తూర్పు ఉత్తర ప్రదేశ్ కి పరిమితం చేయటం అదీ గెలిచే అవకాశం లేనిచోట ప్రచారం చేయించటం వ్యూహాత్మక తప్పిదమనిపిస్తుంది. కాంగ్రెస్ వ్యూహకర్తలు ఈ విషయం లో పప్పులో కాలేసినట్లు వుంది. వాస్తవానికి ప్రియాంక గాంధీ ని రంగప్రవేశం చేయించాలనుకుంటే ఇంకా ముందుగా తీసుకొచ్చి దేశవ్యాప్త ప్రచారం చేయించి ఉంటే కొంత ఫలితం ఉండేదేమో? ఇంకొన్ని రోజులు పోతేగాని మరింత స్పష్టత రాదు. చూద్దాం మరి.

Prev టీడీపీకి పవన్ పంచ్.. 26న జనసేన అభ్యర్థుల తొలి జాబితా!!
Next ప్రతి మహిళను లక్షాధికారులను చేస్తాం: రోజా
 

1 Comments

Write a comment ...
Post comment
Cancel
 1. people
  23 Jan, 8:47 pm
  RAJAGOPALREDDY
  Reply

  Totally wrong timing. She could have been brought during UP assembly polls. This time I doubt whether the congress party will retain Rai Bareli

  Post comment
  Cancel