మమతా అరాచకాలకు అడ్డు లేదా?

మమత బెనర్జీ చర్యలు ఒక్కొక్కటి ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి. ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె అసలు స్వరూపం అందరికీ తెలిసొచ్చింది. సిపిఎం' ప్రజా వ్యతిరేక , పార్టీ నియంతృత్వ' చర్యలకు వ్యతిరేకంగా బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని నిలపటానికి వచ్చిన అపర కాళీమాతలాగా ప్రవర్తించి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొదట్లో కొన్నాళ్ళు సాఫీగానే జరిగింది. బెంగాల్ మేధావులు, భద్రలోక్ ప్రజలు ఆవిడ రావటాన్ని స్వాగతించారు. ఆ తర్వాతగానీ ఆమె పనులు, నైజం ఒక్కొక్కటి బయటపడ సాగింది. ముందుగా సిపిఎం ని, దాని క్యాడర్ ని భయభ్రాంతుల్ని చేసింది. నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది. అయినా ప్రజలు సహించారు. కారణం అప్పటికింకా దీర్ఘకాలం అధికారంతో వచ్చిన సిపిఎం నియంతృత్వ పోకడలు, అణిచివేత చర్యలు ప్రజలు మరిచిపోలేదు కాబట్టి. రెండోది వాళ్లు చేసిన తప్పుల్నే మమత చేయటాన్ని ఖండించకపోగా ఆనందించటం అన్ని పార్టీలు చేసిన తప్పు. ఆ తర్వాతగానీ మిగతా వాళ్ళు కూడా మమత ని అర్ధం చేసుకోవటం మొదలెట్టారు. అప్పటికే సమయం మించి పోయింది. తాను అధికార యంత్రాంగం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవటమే కాకుండా మిగతా పార్టీలను ముఖ్యంగా కాంగ్రెస్ ని కూడా దెబ్బ తీసింది. దీనితోపాటు దాదాపు ముప్పయి శాతం వున్నముస్లింల ఓటుబ్యాంక్ కోసం మత రాజకీయాలు చేయటం మొదలు పెట్టింది. సిపిఎం వైపు, కాంగ్రెస్ వైపు వున్న ముస్లింలందరిని తన వైపు లాక్కోవాలనే తాపత్రయమే అందుకు పురికొల్పింది. ముస్లింలను బుజ్జగించటమే కాకుండా మెజారిటీ హిందువులకు వ్యతిరేకంగా కూడా కొన్ని చర్యలు చేపట్టింది. చివరకు ఎక్కడిదాకా వెళ్లిందంటే మొహరం, దుర్గ పండుగలు ఒకేసారి వస్తే మొహరం ప్రదర్శన కోసం దుర్గా వూరేగింపుని వరసగా రెండు సంవత్సరాలు వాయిదా వేసింది. చివరకు కోర్టు జోక్యంతో హిందువులు పండుగ జరుపుకోవలసి వచ్చింది. ఈ పరిణామాలన్నీ బీజేపీ కి అనుకూలించాయి. మమత రాకముందు బీజేపీ చాలా చిన్న పార్టీ. సిపిఎం, టీఎంసీ, కాంగ్రెస్ లే పెద్ద పార్టీలుగా వుండేయి. ఇంతకుముందే చెప్పినట్లు ముందుగా సిపిఎం, కాంగ్రెస్ లను దెబ్బ తీసింది. తనకు ఎదురే లేదనుకుంది. ఎప్పుడయితే మత రాజకీయాలు ఎక్కువ చేసిందో అవి వికటించి వాటిని తట్టుకోవటం కోసం ప్రజలు మెల్లి మెల్లిగా బీజేపీ పంచన చేరటం మొదలు పెట్టారు. ప్రజల్లో అభద్రతా భావం ఎంతవరకు పెరిగిందంటే అప్పటిదాకా సిపిఎం కింద వున్న క్యాడర్ కూడా అంచలంచలుగా బీజేపీ గొడుగు కింద చేరటం మొదలు పెట్టారు. ఇది రాజకీయ విశ్లేషకుల్ని, మేధావుల్ని కూడా ఆశ్చర్య పరిచింది. చివరకు ఎప్పుడూ కాంగ్రెస్, సిపిఎం గొడుగు కింద వుండే దళితులు కూడా బీజేపీ లో చేరారు. ఇది రాజకీయ మేధావులందరూ స్టడీ చేయాల్సిన సబ్జెక్టు. ఇటీవల టీఎంసీ కార్యకర్తల చేతిలో ఇద్దరు బీజేపీ దళిత కార్యకర్తలు హత్య కావించబడటం పత్రికల్లో, టీవీల్లో చూసాము. దురదృష్టవశాత్తు గుజరాత్ లో జరిగినదానికి వచ్చిన ప్రచారం లో పదోవంతు కూడా బెంగాల్ లో జరిగిన దానికి రాలేదు. కొంతమేరకు ఇది ప్రచార సాధనాల తప్పిదమని చెప్పాలి. దళితులపై దాడి బీజేపీ రాష్ట్రాల్లో జరిగితే ఒకలాగా వేరే రాష్ట్రాల్లో బీజేపీ దళితులపై జరిగితే వుంకోలాగా చూడటం సమస్యపై చిత్తశుద్ధి కన్నా దీన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవటం పైనే శ్రద్ద ఎక్కువగా ఉందని భావించాల్సి వస్తుంది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ నాయకులు చేసిన భీభత్సం తో దేశం మొత్తం ఒక్కసారి ఆలోచనల్లో పడింది. ఇప్పటివరకు బీజేపీ ఫై వ్యతిరేకత వున్న వాళ్లు కూడా టీఎంసీ చేసిన అకృత్యాలను చూసి ఆలోచించటం మొదలుపెట్టారు. లౌకిక వాదం పేరుతో, బీజేపీ ఫై వ్యతిరేకతని రెచ్చగొట్టటంతో మద్దతిచ్చిన వాళ్ళు కూడా ఈమె అప్రజాస్వామ్య , నియంతృత్వ పోకడలను చూసి విస్తు పోయారు. చివరకు నామినేషన్ వేయటానికి కూడా ప్రజలు భయపడి పోయారంటే ఈమె అధికార దుర్వినియోగం, ప్రజా అణిచివేత ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈమె నియంతృత్వ పోకడలతో పోలిస్తే సిపిఎం హయాం లో జరిగింది చాలా తక్కువనే చెప్పాలి. సిపిఎం 'అకృత్యాలను' వాడుకొని అధికారం లోకి వచ్చిన తర్వాత వాళ్ళను మించి పోయి ఏ రాష్ట్రం లోను లేని విధంగా ఓ నియంత లాగా ప్రవర్తిస్తుంది. దీనికి క్లైమాక్స్ గానే ఇటీవలి పరిణామాల్ని చూడాలి. అవినీతి ఆరోపణలని ఎదుర్కుంటున్న అధికారుల్ని వెనకేసుకు రావటం, వాళ్ళను విచారణ చేయకుండా అడ్డుకోవటం, సిబిఐ అధికారుల్ని వేధించటం, భయపెట్టటం , వీటిని కప్పిపుచ్చుకోవటానికి రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తుందని ధర్నాకి దిగటం, దానికి వత్తాసుగా ప్రతిపక్ష పార్టీలను పిలిపించుకొని మాట్లాడించుకోవటం ఈవిడ వికృత, అరాచక చేష్టల పరాకాష్టే. చివరకు సుప్రీమ్ కోర్ట్ జోక్యంతో వేరే రాష్ట్రం లో ఈ రాష్ట్ర అధికారుల్ని విచారించటం ఈవిడ వాదనకి చెంపపెట్టే. అయినా ఇది తనకు నైతిక విజయమని బుకాయించటం ఆవిడ నైజానికి సరిపోయింది. వీటన్నింటికన్నా ముఖ్యమైనది బీజేపీ మీటింగులకు అనుమతి నిరాకరించటం. భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పుకునే భావ స్వేచ్ఛ, రాజకీయ పార్టీల ప్రచార స్వేచ్ఛ , వాటి ప్రచారం కోసం సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ హక్కుగా వుంది. దాన్ని దుర్వినియోగ పరుస్తూ నిషేదించటం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ప్రధాన మంత్రి సభకు స్థలాన్ని నిరాకరించటం, బీజేపీ అధ్యక్షుడి సభకు అనుమతి నిరాకరించటం, యోగి ఆదిత్యనాథ్, షా నవాజ్ ఖాన్ , శివరాజ్ సింగ్ చవాన్ సభలకు అంతరాయం కలిగించటం దేశాన్ని , ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికా? దీన్ని అరాచక వాదం కాక ఏమని పిలవాలి? అటువంటి అప్రజాస్వామిక చర్యలను ఖండించాల్సింది పోయి ప్రతిపక్షాలు ఆవిడకి మద్దతివ్వటం దారుణం. రాష్ట్రం లో ఆవిడ దౌర్జాన్యాలకు బలైన సిపిఎం, కాంగ్రెస్ నాయకత్వాలు ఈవిడ చేష్టల్ని సమర్ధించటం ఏ ప్రజాస్వామ్య పరిరక్షణ కిందకు వస్తుంది? కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆవిడకు మద్దతిస్తే ఆ పార్టీ రాష్ట్ర ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆవిడ చర్యల్ని ఖండిస్తాడు. ఇదేమి రాజకీయమో ? అలాగే సిపిఎం మమత ప్రజాస్వామ్య వ్యతిరేక సభల నిషేధాన్ని ఖండించక పోవటం సమస్యపై చిత్తశుద్ధి లేదని అర్ధమవుతుంది. బీజేపీ తో పడకపోతే వాళ్ళ విధానాల్ని విమర్శించే హక్కు సిపిఎం కి వుంది కానీ సమావేశాలు జరుపుకోనియ్యకుండా చేసే మమత నియంతృత్వ విధానాల్ని ఖండించకపోవడం ఏ సిద్ధాంతం కింద వస్తుంది? అవినీతి అధికారుల్ని ఆవిడ రక్షిస్తుంటే ఆ సందర్భంలో ఇద్దరినీ విమర్శించటం అవకాశం వాదం కాదా? సమస్యను సమస్యగా చూడకుండా రాజకీయంగా చూడటం వలెనే ప్రజలకు దూరమవుతున్నారని రాజకీయపార్టీలు గ్రహిస్తే మంచిది. ఓ విధంగా చెప్పాలంటే మమత అరాచక చర్యల వలన బెంగాలీ ప్రజలు మొట్టమొదటి సారి రాష్ట్రంలో టీఎంసీ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ని చూడటం మొదలు పెట్టారు. తాను ఇటీవల చేపట్టిన అప్రజాస్వామిక చర్యలు తనకే బెడిసి కొడుతోంది. బీజేపీ ఇప్పటికే టీఎంసీ తర్వాత పెద్ద పార్టీగా అవతరించిన తర్వాత ఇటువంటి చర్యలు ఆ పార్టీకి లాభిస్తాయి తప్పిస్తే దానికి నష్టం చేయవు. అందుకే 17 సంవత్సరాల క్రితం మమత దీదీ ధర్నా చేస్తే అధికారం దక్కింది. ఇప్పుడు ధర్నా చేస్తే అపఖ్యాతి దక్కింది. అదీ పరిస్థితుల్లో వచ్చిన తేడా.
Prev కాపుల రిజర్వేషన్ల బిల్లుపై మీడియాతో మాట్లాడిన కొత్తపల్లి సుబ్బారాయుడు
Next రైలు ఢీకొని.. రెండు ఏనుగులు మృతి
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.