చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం: వైఎస్‌ జగన్‌

Article

అమరావతి : వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో 2017 నవంబరు 6న పాదయాత్ర మొదలైనప్పుడు జగన్‌లో ఓ కసి కనిపించింది. ‘ప్రతీ గడపకూ వెళ్లాలనుంది.. జనం గుండె చప్పుడు వినాలనుంది.. కసిగా ఉన్నాను. ప్రజల కోసమే బతకాలన్న ఆవేశంతో ఉన్నాను’ అని జగన్‌ చెప్పారు. పద్నాలుగు నెలల సుదీర్ఘ పాదయాత్ర అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరువలోకొచ్చిన జననేతలో స్పష్టమైన, పరిపూర్ణమైన మార్పు కన్పిస్తోంది. సమస్యలు వినేందుకే వస్తున్నానని చెప్పిన నేత.. ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. తరలివచ్చిన ప్రజావెల్లువ సాక్షిగా కన్నీళ్లు తుడిచే పథకాలను ప్రకటించారు. దగాపడ్డ రైతన్నకు ఎక్కడికక్కడే భరోసా ఇస్తూ తానొస్తే ఎలా ఆదుకుంటానో చెప్పారు. పెట్టుబడి సాయం ఎలా ఇస్తానో వివరించారు. అప్పులపాలైన అక్కాచెల్లెమ్మల ఆవేదన విన్న జగన్‌.. జనం సాక్షిగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సంక్షేమం అందని పేదవాడి గురించే ఏడాది క్రితం జగన్‌ మాట్లాడేవారు. ఉపాధిలేక ఊరొదిలే యువత ఆవేదనే విపక్ష నేత వాణిలో చూశాం. పాదయాత్రలో ఆ సమస్యకు ఆయన పరిష్కారం చెప్పారు. అధికారంలోకొస్తే ఏటా పోస్టుల భర్తీచేస్తానని, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం తెస్తానన్నారు. ఇల్లులేని పేదల సొంతింటి స్వప్నం జగన్‌ నోటి వెంట వచ్చింది. అభాగ్యుల ఆర్తి తెలుసుకున్న తర్వాత ఆయనిప్పుడు ఆరోగ్యశ్రీని ఎంత విజయవంతంగా అమలుచేయవచ్చో స్పష్టత ఇస్తున్నారు.

పేదోడికి ధీమా.. అందరికీ భరోసా
అన్ని వర్గాలకు అనువైన హామీలు ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఈ హామీలు ఇచ్చాను. వీటిని నేరవేర్చలేక పోతే తప్పుకుంటాను. వైఎస్‌ జగన్‌

చేయగలిగినవే చేస్తాను.. చేసేవే చెబుతాను
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి సందర్భంలోనూ అనేమాటిది. ఏడాదికిపైగా సాగిన ప్రజాసంకల్ప యాత్రలో ఆయన ప్రజల కష్టాలెన్నో తెలుసుకున్నారు. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేశారు. జనామోదం పొందిన నవరత్నాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజల్లో భవిష్యత్‌ పట్ల ఆశను కల్పించారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారతాయనే భరోసానిచ్చారు. ఆయన అధికారంలోకొస్తే నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ.లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం వచ్చింది. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో బక్కచిక్కి శల్యమైన రైతుల కన్నీటి కథలు.. నిరుద్యోగుల వెతలు... అక్కచెల్లెమ్మల కన్నీటి గాథలు ప్రతిపక్ష నేతను కదిలించాయి. బతుకు భరోసా లేని అవ్వాతాతలు, ఆరోగ్యశ్రీ వర్తించక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అనేకమంది వైఎస్‌ జగన్‌ను కలుసుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు ఒకరేమిటి మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష నేత అడుగులో అడుగులేశారు.

అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇచ్చిన ప్రతిపక్ష నేత
టీడీపీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన అన్ని వర్గాలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్న పథకాలు వారికి భవిష్యత్‌ పట్ల భరోసాను కల్పించాయి. చిన్నారులను బడికి పంపించే తల్లుల కోసం ప్రకటించిన అమ్మఒడి పథకంతో చిన్నారులంతా బడిబాట పడతారు. అదేవిధంగా చదువుకునేవారికి ఎంత ఫీజైనా చెల్లిస్తామంటూ ప్రకటించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం విద్యార్థుల ఉన్నతవిద్య ఆశలను సాకారం చేస్తుంది. ఉన్నత విద్య పూర్తి చేసుకోగానే ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్‌ ప్రకటించడంతోపాటు ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగ సమస్యను రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించవచ్చు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వలసలు తగ్గిపోతాయి. ఇక తాగునీరు అందక, పంటలు పండక, గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కాంతిరేఖగా నిలుస్తుంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం ప్రకటించిన వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళల అభివృద్ధి సాధ్యమవుతుంది. అధికారంలోకి రావడానికి కాకుండా ప్రజాసంకల్పయాత్రలో ఎంతోమంది బాధితుల సమస్యలు విన్నాక.. వారి బాధలు చూశాక.. ఎంతో అధ్యయనం చేశాక ఆయా వర్గాల అభివృద్ధికి ఈ పథకాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీలు నెరవేర్చలేకపోతే ఏకంగా పదవి నుంచే తప్పుకుంటానని వైఎస్‌ జగన్‌ చెప్పడం ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి చూపాలనే దృఢసంకల్పానికి నిదర్శనం.

  నవరత్నాలతో పాటు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లో మరికొన్ని..
 • - మూతపడ్డ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపిస్తారు.
 • - అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం.
 • - ముస్లిం మైనార్టీలను ఆదుకునేందుకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, భూముల పంపిణీ.
 • - దాదాపు అన్ని సామాజికవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు.
 • - ఏటా మెగా డీఎస్సీ నిర్వహణతోపాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీ
 • - ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌
 • - ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు. పది మందికి ఉద్యోగాలు.
 • - ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం.
 • - దుల్హన్‌ పథకం కింద ఇచ్చే రూ.50 వేల మొత్తం రూ.లక్షకు పెంపు.
 • - ఇమామ్‌లకు ప్రతినెలా రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం.
 • - గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకునేలా విద్యుత్‌ ఛార్జీలను యూనిట్‌కు రూ.7.35 నుంచి రూ.3.75కు తగ్గింపు.
 • - నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌. ప్రధాన ఆలయాల్లో కనీస వేతనంపై పనిచేసే అవకాశంతోపాటు ఎమ్మెల్సీ స్థానం.
 • - గిరిజనులకు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అడ్వైజరీ కౌన్సిల్‌ ఏర్పాటు.
 • - మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్‌పై 50 శాతం సబ్సిడీ, వేట సమయంలో చనిపోతే మూడు నెలల్లో రూ. 10 లక్షలు అందేలా చర్యలు, ప్రత్యేక కార్పొరేషన్‌.

నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలన్నదే నా తాపత్రయం
‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలన్నదే నా తాపత్రయం’.. ..ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాట యావత్‌ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్ని సూటిగా తాకింది. నాయకుడంటే ఇలా ఉండాలన్న జనాభిప్రాయం ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా వ్యక్తమవుతోంది. ఏ మూలనో చిన్న అనుమానం ఉన్న వారు కూడా ఈ వ్యాఖ్యతో ఆయనపై నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. అసలు సిసలైన నాయకుడంటే జగనే అని ఘంటాపథంగా చెబుతున్నారు.

Prev ‘ఎన్టీఆర్ కథానాయకుడు’పై లక్ష్మీపార్వతి స్పందన
Next బీజేపీపై నిప్పులు చెరిగిన కేసీఆర్
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
  Please submit your comments.