ఢిల్లీలో దారుణం.. పదేళ్ల బాలికపై స్వీపర్ లైంగికదాడి

ఢిల్లీలో దారుణం.. పదేళ్ల బాలికపై స్వీపర్ లైంగికదాడి

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని షాదరాలోని ఓ మున్సిపల్ స్కూల్‌లో చదువుతున్న పదేళ్ల విద్యార్థినిపై.. అదే స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన అమానుషం గురించి బాలిక తన కుటుంబ సభ్యులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్పందించిన కుటుంబ సభ్యులు బాలికతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని శనివారం (ఫిబ్రవరి 9) అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోస్కో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని బస్తీకి చెందిన ఓ బాలిక.. ఢిల్లీలోని బంధువుల ఇంట్లో ఉంటూ.. ఓ మున్సిపల్ స్కూల్‌లో 5 వ తరగతి చదువుతుంది. బాలిక తల్లిదండ్రులు యూపీలోనే ఉంటున్నారు. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం భోజన సమయం తర్వాత స్వీపర్‌ ఆ బాలిక దగ్గరకొచ్చి.. ఓ ప్రదేశం చూపిస్తూ అక్కడ కూర్చోవాల్సిందిగా చెప్పాడు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన అతడు బాలికను బలవంతంగా ఒక ఖాళీ గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.

దీంతో భయపడ్డ ఆ బాలిక కొన్నిరోజులు నిశ్శబ్దంగా ఉంది. అయితే పొత్తికడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో.. బాలిక బంధువులు వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్.. బాలికపై లైంగికదాడి జరిగిందని చెప్పడంతో.. వారు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ స్వీపర్‌ను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దీనిపై స్పందించిన పాఠశాల అధికారులు వెంటనే అతడ్ని పనిలోనుంచి తొలగిస్తున్నామని.. పాఠశాలలో అంతర్గత లోపాలపై విచారణ చేస్తున్నట్లు తెలిపింది.

more updates »