ఎన్నికల పండగ వచ్చేసింది

Article

ఎన్నికల పండగ మొదలయ్యింది. దేశం యావత్తూ ఎన్నికల సన్నాహాలతో మారుమోగిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి దఫా లోనే అంటే ఏప్రిల్ 11 వ తేదీకల్లా ఎన్నికలు అయిపోతాయి. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ తో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగానే ఎన్నికల ముందు ఆయారాంలు, గయారాంలు ఎక్కువయ్యారు. రాను రాను విలువలు పడిపోవటం సర్వసాధారణం అయినవేళ ఈ పోకడలు మరీ ఎక్కువయ్యాయి. ప్రజలు రాజకీయ నాయకులను, రాజకీయాలను అసహ్యించుకునేంతగా ఈ ఫిరాయింపుల ప్రహసనం వుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని పరిశీలకుల అభిప్రాయంగా వుంది. దేశం మొత్తం మీద చూస్తే ఒక్క కేరళ మినహాయించి మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో డబ్బులు వరదలై పారతాయి. మరీ అన్ని డబ్బులు పెట్టిన వాళ్ళు అంతకు పదింతలు సంపాదించుకోవాలని తాపత్రయ పడతారు. ఈ రొచ్చు నుంచి బయటపడే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనబడటం లేదు.


దేశ రాజకీయాలలో బాలాకోట్ సంఘటన తర్వాత రాజకీయవాతావరణం మారింది. అప్పటివరకు రైతుల ఆగ్రహం, గ్రామీణ ఆర్ధిక రుణభారం, పైపైకి ఎగబాకిన నిరుద్యోగం మోడీ కి ఇబ్బందిగా మారి ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ వచ్చేపరిస్థితులు లేవని అంచనాలు వేశారు. కానీ పుల్వామా ఘటన తర్వాత భారత ప్రభుత్వం వాయుసేనతో పాకిస్తాన్ భూభాగం లోకి చొచ్చుకొని వెళ్లి ఉగ్రవాద శిబిరాలను మట్టు పెట్టటం ఒక్కసారి మోడీ కి రాజకీయవాతావరణం అనుకూలంగా మారిందని చెప్పొచ్చు. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వటం, అభినందన విడుదల విషయంలో తొణక్కుండా కఠినంగా ఉండటం మోడీ పై ప్రజల్లో సానుకూలవైఖరికి కారణం. స్థిరమైన ప్రభుత్వం, గట్టి నాయకత్వం దేశానికి ఎంత అవసరమో ప్రజలు గుర్తించారని చెప్పొచ్చు. ప్రజలు ముంబై దాడి సమయంలో మన్మోహన్ సింగ్ వ్యహరించిన తీరుకి, పుల్వామా దాడి కి మోడీ ప్రతిస్పందించిన తీరుకి తేడాను స్పష్టంగా చూడగలుగుతున్నారు. ఇది ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా చెప్పొచ్చు.

దానితోపాటు మోడీకి వ్యతిరేకంగా మహా ఘట్ బంధన్ ( మహా కూటమి) ఏర్పడుతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించి దానికి విరుద్ధంగా ప్రవర్తించటం ఆ గేమ్ చేంజర్ కి సహాయకారిగా పనిచేసిందని చెప్పొచ్చు. మొదట్లో ఎన్ డి ఏ లోని భాగస్వాములు కలిసికట్టుగా లేరని అది ప్రతిపక్షాలకు కలిసొస్తుందని అంచనా వేశారు. నిజంగానే అప్పట్లో అలానే అనిపించింది. కానీ ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ ఒక మెట్టు దిగి సీట్ల సర్దుబాటుచేసుకున్న తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. ముందుగా బీహార్ లో తాను గెలిచిన ఎంపీ స్థానాలను వదులుకొని జనతా దళ్ యు ని సంతృప్తి పరిచిన విధానం నాయకత్వ పరిణితి కి నిదర్శనమని చెప్పాలి. అలాగే మహారాష్ట్ర లో ఒంటరిగా పోటీచేస్తానని ప్రకటించిన శివసేన ని దారికి తెచ్చుకోవటంతో విమర్శకుల నోళ్లకు తాళం పడింది. అంతటితో ఆగకుండా తమిళనాడు లో ఇంకొంచెం తగ్గి కేవలం అయిదు సీట్లకే పరిమితమై ఎన్నికలు one sided అని అందరూ అనుకున్నతరుణంలో అక్కడా అన్ని పార్టీలను కలిపి పోటీ వాతావరణం తీసుకురావటం ఓ విధంగా ఎవరు ఊహించని పరిణామమని చెప్పొచ్చు. వీటికి తోడు ఈశాన్య భారతం లో పౌరసత్వ బిల్లు పై రగడ తర్వాత కూటమి నుంచి బయటకు వెళ్లిన పార్టీలను తిరిగి కూటం లోకి తెచ్చుకొని కలిసి పోటీచేయటం ఈ ఎన్నికల ఎత్తుగడలకు క్లైమాక్స్ గా చెప్పాలి. మొత్తం మీద బాలాకోట్ వాయుదాడి గేమ్ చేంజర్ అయితే NDA భాగస్వాములను కలుపుకెళ్ళటంలో కొత్త భాగస్వాములను జత చేయటం లో చూపిన రాజనీతి తురుపుముక్కగా చెప్పొచ్చు. ఈ రెండు పరిణామాలు ఎన్నికల వాతావరణాన్ని మార్చాయని చెప్పొచ్చు.

రెండోవైపు ప్రతిపక్షాలు ఇందుకు భిన్నంగా వున్నాయి. బీజేపీ కి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిసినతర్వాత కూడా ప్రతిస్పందనను వేగవంతం చేయలేకపోవటం, మహాకూటమిని ఏర్పాటు చేయలేకపోవటం ఓ విధంగా నైతికంగా దెబ్బే ననుకోవాలి. ముందుగా చూస్తే ఉత్తర ప్రదేశ్ లో అన్ని ప్రతిపక్షాలు ఒక్కత్రాటి మీదకు రావకపోవటం మొదటి షాక్. 80 సీట్లున్న రాష్ట్రం లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయటం రాజకీయ వాతావరణాన్ని మార్చింది. బీహార్ లో ఈ రోజుకీ పొత్తు కుదరక పోవటం ఒకింత ప్రతిపక్షాలను నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. తమిళనాడు, ఝార్ఖండ్ లలో పొత్తులు సానుకూలంగానే వున్నాయి. మహారాష్ట్ర లో కూడా ఇంకా ఆలస్యం కావటం , అక్కడ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడి తనయుడు బీజేపీ లో చేరటం ఒకింత దెబ్బేనని చెప్పాలి. బీఎస్పీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం లేదని ప్రకటించటం ఇంకో షాక్. అలాగే జాతీయ స్థాయిలో మహాకూటమి లో భాగస్వాములైన టీఎంసీ , టీడీపీ వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో పోటీకి దిగటం మహాకూటమి డొల్లతనాన్ని తెలియజేస్తుంది. కేరళ లో కాంగ్రెస్, సిపిఎం తలపడటం ఒకరిమీద ఒకరు విమర్శ చేసుకోవటం చూస్తుంటే అసలు మహాకూటమి అనేది నవ్వులాటగా మారిందని చెప్పల్సి ఉంటుంది. ఇప్పుడే ఇలావుంటే రేపు రాష్ట్రాలకు ప్రచారంలోకి వెళ్ళినతర్వాత మహాకూటమిలోని నేతలు ఇంకెంత దాడులు చేసుకుంటారో చూడాలి.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు చూద్దాం. అసలు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో చివరి దాకా తెలియటంలేదు. తెలంగాణ లో అయితే ఇటీవల అసెంబ్లీలో గెలిచిన ఎమల్యేలు ఒక్కక్కరు తెరాస లో చేరుతున్నారు. ఇంతకాడికి ఎన్నికలు ఎందుకో అర్ధంకావటం లేదు. ఓ విధంగా చూస్తే కొంతమేరకు జనసేన ఈసారి విభిన్నంగా కనిపిస్తుంది. అయితే దాని ప్రభావం కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితంగా కనిపిస్తుంది. 14 వ తేదీ జరిగిన జనసేన ఆవిర్భావ సభ విజయవంతమైంది. జనాన్ని ఆకర్షించటం లో పవన్ కళ్యాణ్ ముందంజ లో వున్నాడు. కానీ వున్న పరిమిత సమయం లో , పరిమిత వనరులతోటి ఆ జనాకర్షణను ఎంతవరకు ఓట్లుగా మరల్చుకుంటాడో చెప్పలేం. తాను రాజకీయాల్లో కొత్త అనుకున్న సమయం లో బీఎస్పీ తో పొత్తుపెట్టుకొని అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఏది ఏమయినా ప్రధాన పోటీ టీడీపీ,వైఎస్సార్ పార్టీల మధ్యనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి శాశ్వతంగా ఉండటానికి వచ్చేదని పడే పడే చెప్పటం భవిష్యత్తు లో ఆంధ్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని చెప్పొచ్చు.

మొత్తం మీద ఎన్నికల పండగ వచ్చింది కాబట్టి వచ్చే రెండు నెలలు అందరికీ బుర్రలకు పనిబట్టినయ్యనే చెప్పాలి. ఓకే ఎంజాయ్ చెయ్యండి, కాదు చేద్దాం. బై బై

Prev న్యూజిలాండ్ కాల్పుల్లో.. హైదరాబాదీ కుటుంబానికి సాయం చేయండి
Next భయంతో ప్రజలు టీడీపీకి ఓటు వేశారు: దేవినేని ఉమ
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.