ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్ది సేపటి క్రితం స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప సభాపతి ఎన్నికను ప్రస్తావిస్తూ, కేవలం ఒకే ఒక్క నామినేషన్ దాఖలైందని, దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆయన్ను స్పీకర్ స్థానంలోకి ఆహ్వానించారు. కోన రఘుపతిని సీఎం వైఎస్ జగన్, విపక్షనేత చంద్రబాబు తదితరులు స్పీకర్ స్థానం వద్దకు తీసుకువెళ్లారు. తొలుత జగన్ కోన రఘుపతి స్థానం వద్దకు వచ్చి, ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, ఆపై చంద్రబాబు సైతం రఘుపతిని కౌగిలించుకుని అభినందించి, స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పలువురు పాలక, విపక్ష నేతలు ఆయన్ను అభినందించారు.

తండ్రి స్పీకర్‌.. కోడుకు డిప్యూటీ స్పీకర్‌
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్‌ స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

more updates »