ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?..

ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?..

అగ్రరాజ్యంగా పేరుకెక్కిన అమెరికాను చరిత్రలో రెండు ఘోర వైఫ్యల్యాలు కుదిపేశాయి. అవే మద్యపాన నిషేధం(1920-1933), వియత్నాం యుద్ధం (1955-1975).

ఈ రెండింటిలో అమెరికా ఎందుకు విఫలమైందనే అంశం మీద ఆ దేశ మేధావులంతా తెగ పరిశోధనలు చేస్తున్నారు. టన్నుల కొద్దీ పుస్తకాలు రాస్తున్నారు.

నిజానికి అమెరికాలో మద్యపాన నిషేధం ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల కిందట జరిగింది. దాని గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. అయితే, ఈ అంశంపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. పుస్తకాలు వస్తున్నాయి.

ఇవన్నీ చెప్పిన, చెబుతున్న విషయం ఒక్కటే.. అదే అమెరికాలో మద్య నిషేధం ఒక విఫల ప్రయోగం అని.

నిషేధం అక్కడి సమాజంలో తీవ్ర ఉద్రిక్తతలను తీసుకువచ్చింది. కొత్త చట్టాలు పోలీసు యంత్రాంగానికి విపరీతమైన అధికారాలను, బలాన్ని ఇచ్చాయి. మద్యం బాధితులకు మాత్రం చేయూత ఇవ్వలేకపోయాయి.

పారిశ్రామిక ప్రగతి వల్ల పట్టణాల్లోకి వలస వస్తున్న పేద ప్రజలు, శ్వేతజాతీయేతరులు, అప్పుడప్పుడే ఉప్పొంగుతున్న జాజ్ సంస్కృతిని ఒక వైపు.. శ్వేతజాతి రైటిస్టులను మరొకవైపు ఈ నిషేధం నిలబెట్టింది.

'ఈ రెండు పక్షాల మధ్య 13 సంవత్సరాల పాటు సాగిన యుద్ధమే అమెరికా మద్య నిషేధం' అని ఈ పరిశోధనలన్నీ చెబుతాయి.

పేదల మీద, నల్లజాతీయుల మీద, వాళ్ల అల్పసంతోషాల మీద, వాళ్లు సరదాగా గుమిగూడే సెలూన్ల మీద పోలీసులు యుద్ధం ప్రకటించారు. వీళ్లకు 'కు క్లక్స్ క్లాన్' వంటి ప్రైవేటు సైన్యం తోడయింది.

ఒక ఉన్నత లక్ష్యంతో మొదలైన సంక్షేమ పథకం విచ్ఛిన్నమైంది. నిషేధానికి మద్దతు ఇస్తున్న వర్గాల ఆలోచనలు, విశ్వాసాలు, దృక్పథాల ప్రకారం బలవంతంగా చట్టం అమలైంది తప్పితే.. పేదల జీవితాలకు, గృహిణులకు భద్రత దొరకలేదు. నిషేధ చట్టం వచ్చింది కాబట్టి మనుషుల్ని చంపైనా చట్టం అమలు చేస్తాం అనే 'భద్రతా ఉగ్రవాద' పరిస్థితి తలెత్తింది.

more updates »