ఆర్టికల్ 370 పై ప్రజల ఆలోచనల్లో క్రమంగా వచ్చిన మార్పు

ఆర్టికల్  370 పై ప్రజల ఆలోచనల్లో క్రమంగా వచ్చిన మార్పు

అధికరణ 370 పై ఇంతగా ప్రజల్లో మద్దత్తు రావటం ఒక పది సంవత్సరాల క్రితంవరకూ ఏ రాజకీయపండితుడు ఊహించలేదు. 1949 లో తాత్కాలిక అధికరణగా భారత రాజ్యాంగం లో పొందుపరిచిన దగ్గరనుంచి ప్రజల్లో దీనిపై పెద్దగా చర్చగానీ, అవగాహనగానీ లేదు. కేవలం నెహ్రు మంత్రివర్గం లో పనిచేసిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక్కరే నిరసన తెలపటం, దానిపై నిరసనగా శ్రీనగర్ వెళ్ళటం, అక్కడ జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా తనని గృహ నిర్బంధం చేయటం అక్కడే తాను మృతి చెందటం ఒక్కటే మనకు తెలిసిన చరిత్ర. అప్పటికి డాక్టర్ అంబేద్కర్ షేక్ అబ్దుల్లా సంభాషణ గాని, అంబేద్కర్ ఆ అధికరణను పొందుపరచటానికి తిరస్కరించిన విషయంగానీ ప్రజల్లోప్రాచుర్యం పొందలేదు. అప్పటికి దేశంలో నెహ్రూ కున్న ప్రజాదరణ ముందు ఈ అధికరణపై పెద్దగా చర్చగానీ, వివాదంగానీ జరగలేదు. కేవలం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ మాత్రమే నిరసన తెలుపుతూ వచ్చింది. కానీ దేశప్రజల్లో ఎక్కువమంది నెహ్రు దేశ హితం కోసమే ఈ అధికరణను తీసుకొచ్చాడనే భావనలో ఉండేవారు. అందుకనే జనసంఘ్ నిరసనను పెద్దగా పట్టించుకోలేదు.

మరి ఆ వాతావరణం మారి ఈరోజు ఈ అధికరణ తొలగించటం అవసరమనే భావనకు రావటానికి ఏ కారణాలు దోహదం చేశాయో ఒక్కసారి పరిశీలిద్దాం. అన్నింటికన్నా ప్రధానమైనది స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోగా రోజు రోజుకీ మరింత జటిలం కావటం. స్వాతంత్య్రానంతరం ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ హయాం లో సమస్య మరింత సంక్లిష్టంగా మారి చివరకు 1990ల్లో మైనారిటీ మతస్థులైన హిందూ కాశ్మీరీ పండిట్లను లక్షలాదిమందిని నానా హింసలు పెట్టి అక్కడినుండి కట్టుబట్టలతో తరిమివేయటం దేశవ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యామ్నాయ ఆలోచనలను వినేటట్లు చేసింది. అయినా ఇంకా సమస్య పరిష్కారమవుతుందనే ఆశతోనే ప్రజలు వున్నారు. కానీ రాను రానూ పరిస్థితులు ఇంకా దిగజారడం మొదలుపెట్టాయి. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులప్రాబల్యం అంతకంతకూ పెరగటం దేశ ప్రజల మనస్సులో ఆందోళన మొదలయ్యింది. మొదట్లో స్వతంత్ర కాశ్మీర్ పేరుతొ జరిగిన ఆందోళన 21వ శతాబ్దానికి ప్రపంచ జిహాద్ లో భాగంగా ఇస్లాం రాజ్య స్థాపన లక్ష్యంగా మారటం ప్రజల్లో మరింత ఆందోళనకు గురిచేసింది. కాశ్మీరీ ఆందోళనలో పాకిస్తాన్ జెండాలు, ఐ ఎస్ జెండాలు ప్రదర్శించటం దీనికి పరాకాష్ట. అలాగే రాను రాను పాకిస్థాన్ తన భూభాగం లో ఈ ఉగ్రవాద మూకలకు శిక్షణ ఇచ్చి , శిబిరాలేర్పరిచి అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం కూడా ప్రజల ఆలోచనల్లో మార్పు రాసాగింది.

దీనికి తోడు ప్రధానస్రవంతి లోఉన్న పార్టీలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా , ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గట్టి వైఖరి తీసుకోకపోవటం కూడా ప్రజల ఆలోచనల్లో మార్పుకు దోహదం చేసింది. ఉదాహరణకు ముంబై దాడుల తర్వాత భారత దేశం ప్రతిచర్యలు తీసుకోకపోవటం , పార్లమెంట్ పై దాడి ప్రజల మనస్సులో పాకిస్తాన్ పై విపరీతమైన ద్వేషాన్ని రగిలించింది. అదేసమయం లో కాశ్మీర్ లోని చట్టబద్దపార్టీలు పాకిస్తాన్ విషయం లో మెతక వైఖరి వహించటం కూడా ఆ పార్టీలపై దేశప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ఈ పరివర్తన కాలంలోనే దేశరాజకీయాల్లో మార్పులు చోటుచేసుకొని బీజేపీ అధికారం లోకి రావటం ఓ కీలక పరిణామం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీపీ తో జతకట్టినా ప్రజలు బీజేపీ ఒక్కటే కాశ్మీర్ విషయం లో గట్టిగా వ్యవహరించగలదని నమ్మారు. అందుకు కారణం అప్పటివరకు పాకిస్తాన్ అనుకూల హురియత్ నాయకులతో సంప్రదింపులు జరిపే వైఖరిని విడనాడి మోడీ హయాం లో ఆ వేర్పాటు సంస్థలతో సంప్రదింపులు జరపకూడదని కఠిన వైఖరి తీసుకోవటం ప్రజలకు నచ్చింది. ఇన్ని సంవత్సరాల సామరస్య ధోరణికి భిన్నంగా మోడీ కఠిన వైఖరి అవలంబించటం వలన వాళ్ళు చెప్పే అధికరణ 370 పై కూడా ఆలోచించటం మొదలుపెట్టారు.

దీనికి తోడు టీవీ లు, సోషల్ మీడియా రావటంతో చరిత్రలో ఏం జరిగిందో విస్తృతంగా తెలుసుకొనే అవకాశం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కొత్త శతాబ్దం లో పుట్టిన వాళ్లకు ఒక దేశం లో రెండు రాజ్యాంగాలు, రెండు పౌరసత్వాలు , రెండు జండాలు ఉండటం పై పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇందుకు కారణమైన అధికరణ 370 ని తొలగించాలనే బీజేపీ వైఖరిని బలంగా సమర్ధించటం మొదలుపెట్టారు. దాదాపు 40 వేలమందిని బలిగొన్న ఈ సమస్యకు ఏదైనా శాశ్వత పరిష్కారం రావాలని బలంగా కోరుకున్నారు. ఈ లోపు యూరి దాడి, దానికి ప్రతీకారంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్ , పుల్వామా ఘటన అందుకు ప్రతీకారంగా జరిగిన బాలాకోట్ సైనికచర్య ప్రజల్లో జాతీయభావాలను ఉచ్చస్థాయికి తీసుకెళ్లాయి. మోడీపై నమ్మకం పెరిగింది.

ఈ నేపధ్యం లో పూర్తీ మెజారిటీతో రెండోసారి అధికారం లోకి వచ్చిన వెంటనే తీసుకున్న అధికరణ 370, 35 A ల రద్దు పూర్తి ప్రజాదరణ పొందింది. ఇందుకు కారణం గత 70 సంవత్సరాల పరిణామాలతో విసిగిపోయిన ప్రజానీకం, ఉగ్రవాద దాడులు, పాకిస్తాన్ ప్రోద్బలంపై ఏర్పడినకోపం, మోడీపై ఏర్పడిన నమ్మకం అన్నీ కలిసి సానుకూల వాతావరణం ఏర్పడింది. సాధారణ పరిస్థితుల్లోనయితే ఈ అధికరణ తొలగింపు పార్లమెంటులో ఆమోదం పొంది ఉండేదికాదు. ప్రజల్లో వచ్చిన ఈ ఆలోచన మార్పువలనే అనేక ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ లోని అనేక నాయకులు ప్రభుత్వ వైఖరిని సమర్ధించటం జరిగింది. వీటన్నిటికీ తోడు మోడీ, అమిత్ షా ల రాజకీయ చాణిక్యం కూడా ఓ కారణం. అధికరణ 370 తొలగింపు అసాధ్యమని నిన్నటిదాకా భావించిన రాజకీయ పండితుల అంచనాలు తలకిందులు చేస్తూ పరిస్థితులు చక చకా సానుకూలంగా మారటంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మోడీ - అమిత్ షా జంట విజయం సాధించారు. దేనికైనా కాలం కలిసి రావాలంటే ఇదేనేమో. చివరిగా ఒకమాట . సమస్యపరిష్కారానికి ఇది మొదటి ఘట్టం మాత్రమే. ఒకవైపు ఉగ్రవాదులు, రెండోవైపు పాకిస్తాన్ పొంచివున్న నేపధ్యం లో వచ్చే రోజులు చాలా గడ్డుగా ఉంటాయి కాబట్టి చాకచక్యంతో ప్రభుత్వం సమస్యని పరిష్కరిస్తుందని ఆశిద్దాం. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలకు సలహా. రాజకీయాలను పక్కనపెట్టి ప్రభుత్వానికి సహకరిస్తే ప్రజలు హర్షిస్తారు. అలాకాకుండా ఈ సమయం లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు హర్షించరు సరికదా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అపవాదుని మూటకట్టుకొనే అవకాశముందని మరచిపోవద్దు.

more updates »