బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తున్న వరుస రాజకీయ హత్యలు

Article

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో వరుస రాజకీయ హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఆశిష్‌ సింగ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన సింగ్‌.. మాల్దాలోని ఓ ప్రాంతంలో శవమై కనిపించాడు. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో స్థానిక ఇంగ్లీష్‌ బజార్‌ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. తమ పార్టీ నేతలు ఇలా వరుసగా దారుణ హత్యలకు గురవుతున్నారంటూ భాజపా ఆందోళనకు దిగింది. సోమవారం ఈ మేరకు ‘బ్లాక్‌ డే’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా నిర్వహించనున్నట్లు భాజపా అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది. లా అండ్‌ ఆర్డర్‌ను అమల్లో పెట్టడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. అయితే దీనిపై బెంగాల్‌ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్‌ సభ ఫలితాలు వెలువడిన తర్వాతనే ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని లా అండ్‌ ఆర్డర్‌ను సక్రమంగానే అమలు చేస్తున్నామని తెలిపారు. పరిస్థితి ఇప్పటికయితే అదుపులోనే ఉందని, హత్యలకు ఎవరు కారణమయినా వారికి కఠిన శిక్ష పడుతుందన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నోటీసు పంపించింది. బషీర్‌హాట్‌లో శనివారం జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటికీ హింసాకాండ కొనసాగడం పై ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది వారాలుగా తీవ్రత తగ్గని రీతిలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యవస్థలు విఫలమైనట్లు చెప్పడానికి అవకాశం కలుగుతోందని పేర్కొంది. ప్రజలకు భరోసా కల్పించడంలో రాష్ట్ర వ్యవస్థలు విఫలమైనట్లు కనిపిస్తోందని పేర్కొంది. శాంతి భద్రతలను కాపాడటానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గట్టిగా సలహా ఇచ్చింది. విధి నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Prev ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?..
Next పెళ్లికి అంగీకరించలేదని ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.