బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాదం: 36 మంది పిల్లలు మృతి

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాదం: 36 మంది పిల్లలు మృతి

పట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మెదడువాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. మరో 133 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ చిన్నారుల్లో ఎక్కువ శాతం హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) వల్లే చనిపోతున్నారని వైద్యులు వెల్లడించారు. జిల్లాలోని శ్రీ కృష్ణ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ ఎస్‌కే సాహి దీనిపై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. 90 శాతం పిల్లలు హైపోగ్లైసీమియా కారణంగా చనిపోతున్నారని ఆయన తెలిపారు.

జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులన్నీ మెదడువాపు లక్షణాలున్న చిన్నారులతో నిండిపోయాయి. అధిక ఉష్ణోగ్రతతో జ్వరం రావడం, మానసిక ఆందోళన, తరచుగా ఉద్వేగానికి లోనవడం, కోమా వంటికి ఈ వ్యాధి లక్షణాలు. ఇందులో చాలా మంది పిల్లలు మారుమూల గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఆ జిల్లాలో వేసవి కాలం వస్తే మెదడువాపు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పదిహేనేళ్లలోపు పిల్లలకు వేసవిలో ఈ వ్యాధి రావడంతో అక్కడ శిశు మరణాల రేటు కూడా అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వల్లనో లేదా మరేదైనా కారణాల వల్ల రాత్రి పూట పిల్లలకు ఆహారం తినిపించకుండా ఖాళీ కడుపుతో నిద్రపుచ్చితే పిల్లల రక్తంలో గ్లూకోస్‌ స్థాయిలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. దీని వల్ల మెదడువాపు లక్షణాలు, హఠాత్తుగా కళ్లు తిరిగి కోమాలోకి వెళ్లడం వంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు.

more updates »