చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారు: అమిత్ షా

చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారు: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ వస్తే కనీసం గౌరవించాలన్న విజ్ఞతలేని వ్యక్తి చంద్రబాబు అని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. ప్రత్యేకహోదా కోరినవారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పంచన చంద్రబాబు ఇప్పుడు చేరారని దుయ్యబట్టారు. బీజేపీ అధినేత ఈరోజు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

ఆ లేఖలో అమిత్ షా స్పందిస్తూ..‘ప్రత్యేక హోదా సంజీవని కాదని ఇంతకుముందు చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని ఆయనే అరెస్ట్‌ చేయించారు. హోదా పొందిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు అదే హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారు. మాటలు మార్చే వ్యక్తులకు చంద్రబాబు పెద్ద ఉదాహరణ. అబద్ధాలు చెప్పే సంస్కృతిని చంద్రబాబు అమలు చేస్తున్నారు’ అని దుయ్యబట్టారు.

ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని షా విమర్శించారు. ఏపీ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయామని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఇంకా కాంగ్రెస్ పార్టీ రక్తమే ప్రవహిస్తోందని ఆరోపించారు.

more updates »