రికార్డు సృష్టించిన జగన్ పాదయాత్ర - మరి ముఖ్యమంత్రి పీఠం దక్కేనా?

జగన్ పాదయాత్ర ఓ విధంగా చరిత్ర సృష్టించింది. మొత్తం 3648 కిలోమీటర్లు , 2516 గ్రామాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 429 రోజులు (2017 నవంబర్ 6 నుంచి 2019 జనవరి 9 వ తేదీ వరకు), అందులో పాదయాత్ర 341 రోజులతో కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా లోని ఇచ్చాపురం వరకు నడిచి చరిత్ర సృష్టించాడు. మొత్తం భారతదేశంలోనే ఇంత పెద్ద పాదయాత్ర చేసిన రెండవ రాజకీయ నాయకుడు జగన్ మోహన రెడ్డి. అందరికన్నా ఎక్కువ దూరం నడిచిన రాజకీయ నాయకుడు పూర్వ ప్రధానమంత్రి చంద్రశేఖర్. భారత పాదయాత్ర పేరుతొ కన్యాకుమారి నుంచి ఉత్తర భారతం వరకు నడిచాడు. మొత్తం దక్షిణ భారతంలో జగన్ పాదయాత్ర రికార్డ్.

ఇక మన రాష్ట్రంలో మొదటగా పాదయాత్రతో ప్రాచుర్యం పొందింది పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. తను 2003 లో మొత్తం 1470 కిలోమీటర్లు 64 రోజుల్లో నడిచాడు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే ఒరవడిలో 2013 లో నారా చంద్రబాబు నాయుడు 2340 కిలోమీటర్లు 208 రోజుల్లో నడిచి ఆతర్వాత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రెండింటితో పోలిస్తే జగన్ మోహన రెడ్డి పాదయాత్ర ఇంకా విస్తృతంగా జరిగింది. మరి అదే ఒరవడిలో జగన్ కూడా ముఖ్యమంత్రి అవుతాడా?

ఇది ఇప్పుడు అందరి మనస్సులో తొలుస్తున్న ప్రశ్న. దానిలోకి వెళ్లేముందు మన ప్రచార సాధనాలను గురించి ప్రస్తావించుకోవాల్సిన అవసరముంది. ఇంత పెద్ద రికార్డ్ సృష్టించే యాత్ర చేపట్టినప్పుడు దానికి తమ ప్రసార సాధనాల్లో ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వకపోవటం ఏ జర్నలిస్ట్ విలువలో చెప్పాల్సివుంది. సంపాదకీయాల్లో, వ్యాసాల్లో, వ్యాఖ్యానాల్లో తనకు వ్యతిరేకంగా రాసుకునే స్వేచ్ఛ పత్రికా సంపాదకులకు వుంది. కానీ వార్తను నిషేదించటం, తగ్గించి రాయటం జర్నలిజం ప్రామాణికతకు విఘాతంగా భావించాల్సివుంది.

ఇక ఇప్పుడు ఈ పాదయాత్ర తనని మిగతా ఇద్దరిలాగే ముఖ్యమంత్రిని చేస్తుందా అంటే ఈరోజుకి అవుననే సమాధానం వస్తుంది. గత సంవత్సరం నుంచి ప్రకటిస్తూ వస్తున్న జాతీయ మీడియా సర్వేలన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జగన్ మోహన రెడ్డి గెలుస్తాడనే చెబుతున్నాయి. ఆ వార్తని కూడా రెండు ప్రధాన పత్రికలూ ప్రచురించక పోవటం చూస్తే తెలుగు మీడియా ఎంత దిగజారి పోయిందో అర్ధమవుతుంది. అయితే రాజకీయాలు ఎప్పుడు ఒకలాగా వుండవు. గత ఎన్నికలకు ముందుకూడా జగన్ మోహన రెడ్డి తెలుగుదేశం కన్నా ముందున్నట్లు సర్వేలు ప్రకటించిన సంగతి మరిచిపోవద్దు. మరి అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి?

అప్పుడు తెలుగుదేశం బీజేపీ తో పొత్తుపెట్టుకోవటం, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించటం game changer గా చెప్పొచ్చు. అదే లేకపొతే జగన్ మోహన రెడ్డి గెలిచి ఉండేవాడు. మరి ఈసారి అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈసారి ముఖ్యమైన మార్పు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనటం. పోయినసారి ద్విముఖ పోటీ అయితే ఈసారి ముక్కోణపు పోటీ జరగటం. అయినా ఇప్పటివరకు పరిశీలకుల అంచనా ప్రకారం జగన్ మోహన రెడ్డి గెలిచే అవకాశాలు మెండుగా వున్నాయి. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందని పరిశీలకుల అంచనా.

ఇక అందరి కళ్ళు జన సేన, పవన్ కళ్యాణ్ పైనే వున్నాయి. జన సేన ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేదే ఇప్పుడు అందరి మనస్సులో వున్న వంద బిలియన్ డాలర్ల ప్రశ్న.ఇప్పటివరకు తను విస్తృతంగా టూర్ చేసిన ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర లో జనసేన కు ప్రజాదరణ బాగా ఉందని అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే ప్రజాదరణ మిగతా జిల్లాల్లో ఉంటుందా? ఇదే అందరి మనసుల్లో తొలుస్తున్న ప్రశ్న. దాని మీదే మొత్తం ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

ఒకటిమాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ కి రెండు నెలల క్రితంతో పోలిస్తే గ్రాఫ్ క్రమేణా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇది మొత్తం రాష్ట్రంలో గెలుపుకి సరిపోతుందా? ఎన్నికలకి సమయం ఇంకా రెండు నెలలు కూడా లేదు. తను మిగతా జిల్లాల్లో విస్తృతంగా తిరిగే సమయం లేదు. రెండోది రాష్ట్రం మొత్తం ఎన్నికలకు సమాయత్తం అయ్యే వనరులు ఉన్నాయనేది సందేహాస్పదమే. కాబట్టి ఈ రెండు నెలల్లో తన కార్యక్రమాలు, వ్యూహాలు ఎలా వుంటాయనే దాన్నిబట్టి, ఎంతమేరకు ప్రజల్లో చొచ్చుకు పోగలుగుతాడనే దాన్నిబట్టి ఆ పార్టీ ఫలితం ఉంటుంది. ఇప్పటికున్న అంచనాల్ని బట్టి చూస్తే జగన్ పార్టీ ముందంజలో ఉందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతానికి రెండో స్థానం కోసం తెలుగుదేశం, జనసేన పోటీపడుతున్నాయని చెప్పాలి. అయితే ఇంతకుముందు చెప్పినట్లు రాజకీయాలు చలనశీలంగా ఉంటాయి. ఒక్కటి మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగుదేశం అధికారం కోల్పోవటం. అలాగే జన సేన వరకు చూస్తే ప్రజల్లో నిలదొక్కుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ సమయమూ, వనరులూ సరిపోకపోతే కింగ్ బదులు కింగ్ మేకర్ అయ్యే అవకాశం తోసిపుచ్చలేము. అది ఈ రెండు నెలల్లో పవన్ కళ్యాణ్ ఏ మేరకు ప్రభావం చేస్తాడనే దాన్నిబట్టి ఉంటుంది. ప్రస్తుతానికయితే జగన్ అధికారం లో కొచ్చే అవకాశాలే మెండుగా వున్నాయి. రాజకీయాల్లో రెండు నెలలు తక్కువేమి కాదు. చూద్దాం రాజకీయ క్రీడ ఈ రెండు నెలల్లో ఎలావుంటుందో?

Prev జగన్ ముందడుగు.. అసలు కథ ఇప్పుడే..
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.