రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ... కార్యాచరణపై చర్చ

రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ... కార్యాచరణపై చర్చ

దిల్లీ: ఎన్డీయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇవాళ ఉదయం ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాతో సమావేశమై మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఆతర్వాత ఏపీ భవన్‌ నుంచి రాహుల్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈనెల 19న తుదివిడత పోలింగ్‌ ముగియనుండటంతో ఎన్డీఏకు ఎన్నిసీట్లు వచ్చే అవకాశముంది, యూపీఏకు ఎన్ని సీట్లు వస్తాయి, మే 23 తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణ.. తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఎన్డీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు ఇంకా.. ఏఏ పార్టీల నేతలతో చర్చలు జరపాలి అనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు చర్చించారు. రాహుల్‌తో భేటీ తర్వాత శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం చంద్రబాబు బృందం లఖ్‌నవూ వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశం కానున్నారు.

more updates »