తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన చంద్రబాబు

Article

తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. విద్యార్థుల మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరీక్షల్లో గెలవడమే జీవితం కాదని పేర్కొన్న బాబు.. అది ప్రతిభకు గుర్తింపు మాత్రమేనని పేర్కొన్నారు. పరీక్షల కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని అన్నారు. పరీక్షల్లో పాస్ కానంత మాత్రాన ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రుల ఆశలను తుంచేయవద్దని విద్యార్థులకు సూచించారు. తమపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్న వారిని కడుపుకోతకు గురిచేయవద్దన్నారు.

ఈ ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారందరూ తొలుత పరాజితులేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చదువు విజ్ఞానం పెంచుకోవడానికేనని, అదే జీవితం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. విజయానికి ఓటమి తొలిమెట్టు అని, మళ్లీ కష్టపడితే మంచి ఫలితం వస్తుందని సూచించారు. ఎంచుకున్న రంగాల్లో ప్రతిభ చూపితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని, మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు మీరిచ్చే గొప్ప బహుమతి అని చంద్రబాబు ధైర్యం నూరిపోశారు.

Prev దొంగ ఓటు వివాదంతో చిక్కుల్లో పడ్డ రెమో సినిమా హీరో
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.