చరిత్ర సృష్టించిన మోడీ

చరిత్ర సృష్టించిన మోడీ

కాశ్మీర్ సమస్యకు ఓ పరిష్కారం రావాలని ప్రతి భారతీయుడి మనసులో వుంది. కానీ అది ఎలా చేయాలో ఎవరికీ అర్ధంకావటంలేదు. అందరూ దీన్ని గురించి మాట్లాడేవాళ్లే కానీ ఏమి చేయాలో చెప్పరు. కానీ దీనికొక పరిష్కారం దొరికితే బాగుణ్ణు అని అందరి మనస్సులో వుంది. ఇన్నాళ్లకు ఓ ప్రయత్నమయితే జరిగింది. ఇది ఎంతవరకు విజయవంతమవుతుందనేది కాలమే నిర్ణయించాలి. ఆర్టికల్ 370, 35 A , కేంద్రపాలన ఇవన్నీ కాదు ముఖ్యం సమస్య కు ఏదో పరిష్కారం కావాలి. అది ఏ పద్దతి లో వస్తుందనేది సామాన్య ప్రజానీకం ఆలోచించటం లేదు. అందుకే మోడీ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలు ( కాశ్మీర్ మినహా ) సంపూర్ణంగా ఆమోదించారు. ఇక కాశ్మీర్ విషయానికొచ్చేసరికి జమ్మూ, లడఖ్ ప్రజలు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు. కాశ్మీర్ లోయలోని ప్రజలు మాత్రం తక్షణమే ఆమోదించే అవకాశాలు లేకపోవచ్చు. వచ్చే కొద్దీ నెలల్లో ప్రభుత్వం ఏ మేరకు వారిలో విశ్వాసం నెలకొల్పుతారనే దానిపై ఆధారపడి వుంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఈ ప్రయత్నం ఓ పెద్ద ముందడుగు.

మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయినవెంటనే దేశపరిస్థితులను చక చకా చక్కదిద్దటం మొదలుపెట్టాడు. మొదటి 50 రోజుల్లోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. ఆర్ధికరంగంలో దివాలాకోరు చట్టానికి సవరణలు తీసుకొచ్చి చట్టానికి పదును పెట్టాడు. వైద్యరంగంలో పేరుకుపోయిన అవినీతి మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా ను రద్దుచేసి దాని స్థానంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ ని తీసుకొచ్చాడు. దీనిద్వారా వైద్యరంగంలో గణనీయమైన మార్పులు వచ్చి ఈ చట్టం గేమ్ చేంజర్ గా పనిచేస్తుందని మేధావులు చెబుతున్నారు. అలాగే బూజుపట్టిన సనాతన ఆచారం నుంచి ముస్లిం మహిళలకు విముక్తికలిగించే ముమ్మూరు తలాక్ నిషేధం బిల్లు ని చట్టం చేయగలిగాడు. ఇవన్నీ మొదటి 50 రోజుల్లోనే చక చకా చేయటం ఒక ఎత్తయితే వీటన్నిటికీ మించి కాశ్మీర్ సమస్యకు పరిష్కారమార్గం వెదకటం అతి పెద్ద పరిపాలనా చర్యగా చూడాలి.

కాశ్మీర్ సమస్యపై ఒకేసారి ఇన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటాడని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఈ సారి మంత్రివర్గంలో అమిత్ షా ని హోమ్ మంత్రి చేయటంతోటే ఈ ప్లాన్ కి శ్రీకారం చుట్టాడు. తన ఆలోచనలకు అనుగుణంగా వుండే వ్యక్తిని నియమించి పధకాన్ని అమలుచేశాడు. అందరూ ఆర్టికల్ 370, 35 A గురించి ఆలోచిస్తుంటే ఇంకో అడుగు ముందుకేసి అవి అమలు చేయాలంటే కొన్నాళ్ళు శాంతి భద్రతలు పూర్తిగా తన అధీనంలో వుండే పధకం అమలు చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అదే మాస్టర్ స్ట్రోక్. ఒకవైపు లడఖ్ ప్రజల దీర్ఘకాల కోర్కెను మన్నించాడు, రెండోవైపు జమ్మూ-కాశ్మీర్ ని అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి ముందు ముందు ఎవరు ఎన్నుకోబడ్డా శాంతి భద్రతలకు ఢోకా లేకుండా చూసుకున్నాడు. అదేసమయం లో ఇది కేవలం తాత్కాలికమేనని చెప్పి ప్రజలను శాంతపరచటానికి ప్రయత్నం చేశాడు. దానితోపాటు జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు భవిష్యత్తు ఎలా బంగారు బాట లాగా ఉంటుందో వివరించి చెప్పాడు. చెప్పటమే కాకుండా దానికి తగ్గ భూమికను ఇప్పటికే మొదలుపెట్టాడు. ఈ రోజు సీఐఐ తో సమాలోచనలు జరిపి పెట్టుబడులకు మార్గం సుగమం చేశాడు. మోడీ రాజనీతజ్ఞత ఇందులో స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకుముందు ప్రధానమంత్రులందరూ మూస విధానంలో ఆలోచించారు తప్పితే పరిష్కారమార్గం కోసం నూతన ఆలోచనలతో ముందుకు రాలేదు. అందుకే మోడీకి ప్రజలు నీరాజనం పడుతున్నారు.

ఇక అంతర్జాతీయ విషయాలకొస్తే పాకిస్తాన్ ని ఉపయోగించుకొని తాలిబన్ ని దారికి తెచ్చుకొని ఆఫ్గనిస్తాన్ నుంచి బయటపడాలని ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు పాకిస్తాన్ తో సఖ్యతగా వుండాలని తాపత్రయపడుతున్నాడు . ఈ అవకాశాన్ని పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుని కాశ్మీర్ విషయం లో అమెరికాను వాడుకోవాలని చూస్తుంది. ఇది చివరకు తాలిబన్ కి కూడా నచ్చలేదు. ఈ రోజు వాళ్ళు ప్రకటన చేస్తూ మా సమస్యకు కాశ్మీర్ సమస్యకు ముడిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పింది. ఏది ఏమైనా అమెరికాకు దాని ప్రయోజనాలు ముఖ్యం. అందుకే మోడీ ఇంకో అడుగు ముందుకేసి వడి వడిగా ప్లాన్ ని అమలుచేసి ట్రంప్ కి కూడా చెక్ పెట్టాడని చెప్పాలి. ఇది మోడీ ఇంకో మాస్టర్ స్ట్రోక్. జరగబోయే పరిణామాలను ముందుగా ఊహించి ప్రతి వ్యూహాన్ని రచించటం లోనే చాణక్య నీతి ఇమిడివుంది.

ఇక మూడో మాస్టర్ స్ట్రోక్ దేశం మొత్తాన్ని ఈ చర్యతో ఒకతాటి మీదకు తీసుకురావటం. స్వాతంత్య్రానంతరం 1971 బాంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు ప్రజలందరూ ఇందిరా గాంధీ ని సమర్ధించారు. ఇన్నాళ్ల తర్వాత మోడీ దేశప్రజలందరినీ ఒకే బాటలో నడిపించటం. బాలాకోట్ తో మొదలయ్యి కాశ్మీర్ తీర్మానాలు, బిల్లులతో జాతీయభావాలు రగిలించగలిగాడు. ఇందిరా గాంధీ తర్వాత అదే స్థాయిలో జాతీయనేతగా మోడీ ఎదిగాడు. రాజకీయనాయకులకు ఈ పోలిక నచ్చదు. అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు ఈ పోలికపై గుర్రుమంటున్నారుగాని ఇది వాస్తవం. ఇద్దరూ కఠిన నిర్ణయాలు తీసుకోగలిగిన నేతలు. ఇందిరా గాంధీ బాంగ్లాదేశ్ ని సృష్టించి తూర్పు సరిహద్దు ని పటిష్టం చేస్తే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపి పశ్చిమ సరిహద్దుల్ని మోడీ పటిష్టం చేశాడు. అయితే ఇవి బంగ్లాదేశ్ యుద్ధం లాగా వెంటనే పరిష్కారం కాకపోయినా ఒకటి రెండు సంవత్సరాలలో శాంతి నెలకొనే అవకాశాలు మెండుగా వున్నాయి. అందుకే మోడీ చరిత్ర సృష్టించాడని ఘంటాపధంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి మోడీ అభినందనీయుడు.

more updates »