ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష

Article

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష.. రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. తన ధర్నాకు ఒక రోజు ముందు ప్రధాని మోదీ ఏపీకి రావాల్సిన అవసరం ఏముందని బాబు ప్రశ్నించారు. మీరు ఒక వేళ తమ డిమాండ్లను నెరవేర్చకపోతే.. వాటిని ఎలా సాధించుకోవాలో తమకు తెలుసన్నారు. ఈ దీక్ష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం. తమ ఆత్మగౌరవంపై దాడి చేస్తే సహించేది లేదని బాబు అన్నారు. ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసి దాడులు చేయడం సరికాదని.. ఈ విషయంలో ప్రత్యేకంగా మోదీకి హెచ్చరిక చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

దీక్షకు హైటెక్ ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌చేస్తూ ఏపీ సర్కార్ ఢిల్లీలో సోమవారం చేపట్టిన దీక్షకు హైటెక్ ఏర్పాట్లు చేసింది. 127 మంది ఎమ్మెల్యేలు, 41 మంది ఎమ్మెల్సీలు, 15 మంది కార్పొరేషన్లతోపాటు 150 మంది పార్టీ కార్యవర్గసభ్యులు, 2వేల మంది పార్టీ కార్యకర్తలను తరలించడానికి ఏసీ బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేయడమేకాకుండా వారికి స్టార్ హోటళ్లలో వసతి కల్పించడానికి రూ.60లక్షల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. పార్టీకి సంబంధించిన సుమారు 2500 కార్యకర్తలు, నేతల కోసం వసతిని ఏర్పాటు చేశారు. హోటల్ రాయల్ ప్లాజా, సూర్య, వైఎంసీఏ, సదరన్ హోటల్, ఓయో పహార్‌గంజ్, కర్జన్ హాస్ట ల్‌లో గదులను బుక్‌చేశారు. ఏపీ నుంచి 32 హైటెక్ ఏసీ బస్సుల్లో కార్యకర్తలను, నేతలను ఆదివారం రాత్రే తరలించారు. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల ప్రజల కోసం ప్రత్యేక రైళ్ల ను కూడా బుక్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఏపీ సీఎం గర్జిస్తున్న ఫ్లెక్సీలను ఢిల్లీ వీధుల్లో ఏర్పాటుచేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రతిపక్ష పార్టీల నేతలను బాబు ఆహ్వానించారు.

Prev లేడీ రౌడీషీటర్‌ ఆగడాలు.. మహిళను ఎత్తుకెళ్లి..
Next ఇంటర్‌ బోర్డు ఎదుట రేవంత్‌, సంపత్‌ల ధర్నా, అరెస్టు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.