పార్టీ ఫిరాయింపులపై ద్వంద నీతి

1. తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మళ్ళీ, పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి వచ్చేసింది.

2. ఎన్నికలకు ముందు టి.ఆర్.యస్. నుండి కాంగ్రెసులోకి ఫిరాయించిన నలుగురు శాసనమండలి సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని శాసనమండలి ఛేర్మన్ కు టి.ఆర్.యస్. ఫిర్యాదు చేసింది.

3. కొత్తగా ఎన్నికైన వైరా నియోజకవర్గ శాసన సభ్యుడు(ఇండిపెండెంట్) మరియు రామగుండం నుండి ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ ఎన్నికల గుర్తుపై ఎన్నికైన శాసన సభ్యుడు ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే అధికార పార్టీ కండువా కప్పుకొన్నారు.

4. కాంగ్రెసు పార్టీకి చెందిన ఏనిమిది మందికిపైగా అధికార పార్టీలో చేరడానికి ఉత్సుకతతో ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారు స్వయంగా సెలవిచ్చారు.

5. పార్టీ ఫిరాయించిన శాసనమండలి సభ్యులపై ఫిరాయింపు నిరోధక చట్టం మేరకు అనర్హులుగా ప్రకటించాలన్న డిమాండు సమర్థనీయం.

6. రామగుండం నుండి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై ఎన్నికైన సభ్యుడు తక్షణం రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నిక కావాలి, లేదా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఆయనకు వర్తింప చేయాలి కాదా?

7. గత లోక్ సభ ఎన్నికల్లో ఇతర పార్టీల గుర్తులపై ఎన్నికైన వారు అధికార పార్టీలో చేరి, ఇప్పటికీ సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు. వారిపై లోక్ సభ స్పీకర్ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోక పోవడం గర్హనీయం. గత శాసనసభ కాలంలో పార్టీలు ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు పడకుండానే ఎలా రక్షించబడ్డారో చూశాం.

8. గత నాలుగేళ్ళ కాలంలో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఖాతరు చేయకుండా అపకీర్తిని మూట కట్టుకొన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాలుగింట మూడు వంతుల భారీ మెజారిటీతో ప్రజలు అధికారాన్ని తిరిగి అప్పజెప్పారు కాదా! ఇప్పుడైనా ఫిరాయింపులకు 'పుల్ స్టాప్' పెట్టవచ్చు కాదా!

9. అసలు ప్రతిపక్షమే ఉండ కూడదన్న కుటిలనీతి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, బహుళ పార్టీ వ్యవస్థకే ప్రమాదకరం కదా!

10. రాజకీయాలు వ్యాపారమయమై, విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన మీదట విలువలకు పాతరేసి, స్వార్థ చింతనతో అధికార పార్టీ వైపు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల జాడ్యం కోనసాగడం పర్యవసానంగా ఫిరాయింపు నిరోధక చట్టం నవ్వుల పాలౌతూనే ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, బహుళ పార్టీ వ్యవస్థ బలహీన పడుతూనే ఉన్నది.

టి.లక్ష్మీనారాయణ
రాజకీయ విశ్లేషకులు

Prev దేశఆర్ధికవ్యవస్థతో ఆటలాడుకుంటున్న రాహుల్ గాంధీ
Next రవిప్రకాశ్ కోసం మూడు రాష్ర్టాల్లో గాలింపు
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.