మోదీ బయోపిక్‌పై సుప్రీంకోర్టుకు ఈసీ నివేదిక

Article

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌ ‘మహాత్ముల కథ’ అని, అది ఎన్నికల సరళి మీద ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడిస్తూ ఎన్నికల సంఘం(ఈసీ) సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించింది. ఓటింగ్ పూర్తయ్యే వరకు ఆ సినిమా విడుదల మీద విధించిన నిషేధాన్ని ఆ నివేదికలో సమర్థించుకుంది. దాన్ని కేవలం ఒక బయోపిక్‌గా మాత్రమే చూడలేమని, ఒక రాజకీయ ప్రతినిధి మీద చేసిన ప్రశంసలకు సంబంధించిన చిత్రమని పేర్కొంది. మే 19కు ముందు దాన్ని విడుదల చేయడం వల్ల ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని, దాని వల్ల ఓటింగ్ ప్రక్రియ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆ చిత్రంలో ప్రతిపక్ష పార్టీలను తక్కువ స్థాయిలో చూపించారని, ఓటింగ్ పూర్తయ్యే వరకు దాని విడుదలకు అనుమతించలేమని స్పష్టం చేసింది.ఈసీ సమర్పించిన నివేదికను సుప్రీం ఏప్రిల్ 26న పరిశీలించనుంది. అలాగే చిత్ర నిర్మాతలు వేసిన పిటిషన్‌పై ఆ రోజు తుది నిర్ణయం తీసుకోనుంది. బయోపిక్‌ విడుదలను ఈసీ నిలిపివేయడంతో చిత్ర నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రెండు నిమిషాల ప్రోమోను వీక్షించి ఈసీ ఈ సినిమా విడుదలను నిలిపివేయలేదని నిర్మాతల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో వాదనలు వినిపించారు. ఆ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తి సినిమాను వీక్షించి, దానిపై తుది నిర్ణయాన్ని కోర్టులో సమర్పించాలని ఈసీని ఆదేశించింది.

Prev ఢిల్లీలో తెలుగు విద్యార్థుల నిరసన
Next ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్లు..
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.