ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త టీచర్ల నియామకాలు

ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త టీచర్ల నియామకాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గతేడాది నిర్వహించిన డీఎస్సీ–2018 నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి టీచర్‌ పోస్టులకు అర్హులైన వారి ఎంపికకు పాఠశాల విద్యా శాఖ తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సెప్టెంబర్‌ 4 వరకు కొనసాగనుంది. తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, స్కూల్‌ అసిస్టెంటు తెలుగు, స్కూల్‌ అసిస్టెంటు హిందీ, పీఈటీ పోస్టులు (మొత్తం అయిదు కేటగిరీలు) మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

రాష్ట్రంలో 7,902 పోస్టులతో డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అర్హతల నిర్ణయం, పరీక్షల నిర్వహణలో అనేక లోటుపాట్లు తలెత్తాయి. ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు కేసులు కూడా దాఖలయ్యాయి. ఈ న్యాయ వివాదాల కారణంగానే అయిదు కేటగిరీల నియామకాలు మినహాయించి తక్కిన వాటికి షెడ్యూల్‌ ఇచ్చారు. వివాదాలు పరిష్కారమైన తరువాత మిగిలిన పోస్టులకూ నియామకాలు పూర్తిచేయనున్నారు. ఈ పోస్టులకు నియామకాల ప్రక్రియ మొత్తం తొలిసారిగా ఆన్‌లైన్లో చేపడుతుండడం విశేషం.

ప్రతి కేటగిరీలో అభ్యర్థుల జాబితాల ప్రకటన, ధ్రువపత్రాల అప్‌లోడ్, వాటి పరిశీలన కార్యక్రమాన్ని మూడు దఫాలుగా చేయనున్నారు. పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా జాబితాలో అర్హులైన తదుపరి మెరిట్‌ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆయా కేటగిరీల పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్‌ (సీఎస్‌ఈ) ఆన్‌లైన్‌ పర్యవేక్షణలో కొనసాగనుంది. అంతిమంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుంది.

అనంతరం పాఠశాలల ఎంపికకు వీలుగా వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. పోస్టింగ్‌ ఆర్డర్లను కూడా ఆన్‌లైన్లో విడుదల చేస్తారు. వాటిని అనుసరించి ఆయా జిల్లాల ఎంపిక కమిటీల మెంబర్‌ సెక్రటరీలు (నియామకాధికారులు) అభ్యర్థులను ఆయా పాఠశాలల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థి ఎవరైనా పోస్టింగ్‌ కోసం ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేని పక్షంలో అతనికి మెంబర్‌ సెక్రటరీనే కేటాయింపు చేస్తారు.

more updates »