శ్రీలంక బాంబు పేలుళ్ల లో 10కి చేరిన భారత మృతులు

శ్రీలంక బాంబు పేలుళ్ల లో 10కి చేరిన భారత మృతులు

న్యూదిల్లీ: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో భారత మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం తెలిపారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందున్నట్లు తెలిపింది. తీవ్ర గాయాల వల్లే మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వెల్లడించింది. అయితే ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి చట్టం అమలు చేస్తున్నట్లు శ్రీలంక రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ చట్టం అమలులోకి రావడం వల్ల పోలీసులకు కొన్ని ప్రత్యేక అధికారాలు వస్తాయి. వీటితో అక్కడి పోలీసులు పేలుళ్లతో సంబంధమున్నట్లు భావించే అనుమానితులను ఎవరినైనా ముందస్తు అనుమతులు లేకుండానే విచారించవచ్చు. ఈ అధికారాలన్నీ దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయడానికి, సూత్రధారులను గుర్తించడానికి ఉపయోగపడతాయని శ్రీలంక ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం రాత్రి నుంచే అంతటా కర్ఫ్యూ విధించారు.

more updates »